పిలవకుండానే వచ్చే కోపంతో.. గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువట! కాస్త చూస్కోండి..
కోపం ఓ ఉధ్వేగం. ధర్మానికి హాని జరిగినప్పుడు, కళ్లకు ఎదురుగా అన్యాయం జరుగుతున్నప్పుడు కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా వచ్చే కోపాన్ని ధర్మాగ్రహం అంటారు. కానీ పిలవని పేరంటంలా కొన్ని సందర్భాల్లో వచ్చిపడే కోపం శత్రువుతో సమానం. చాలామందికి ఈ రెండో తరహా కోపంతోనే అనుభవం ఎక్కువగా ఉంటుంది..

గుండెపోటుకు కారణాలు అనేకం. కానీ తరచుగా కోపం తెచ్చుకునే అలవాటు ఉన్న వారి గుండె ఆరోగ్యానికి ప్రమాదకరమని మీకు తెలుసా..? ప్రతిష్టాత్మక అమెరికన్ సంస్థ జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం చేసిన తాజా పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కోపం వచ్చి గట్టిగా అరవడం వల్ల ఆ తర్వాత రెండు గంటల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం దాదాపు 5 రెట్లు ఎక్కువగా ఉంటుందని తేలింది. అంతేకాదు యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం తరచుగా అతిగా కోపం తెచ్చుకునే వ్యక్తులకు గుండె ప్రమాదాలు ఎక్కువ. కోపం తెచ్చుకునే వారికి గుండె జబ్బులు లేకపోయినా గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తాజా పరిశోధనలో తేలింది. కాబట్టి కోపం, గుండెపోటు మధ్య సంబంధం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
కోపానికి, గుండెపోటుకు సంబంధం ఏమిటి?
కోపంగా ఉన్నప్పుడు శరీరం కాటెకోలమైన్లు అని పిలువబడే ఒత్తిడి హార్మోన్ల స్థాయిలను వేగంగా పెంచుతుందని పరిశోధనలో తేలింది. ఇవి శరీరంలో రక్తపోటును త్వరగా పెంచే హార్మోన్లు. ఒత్తిడి రక్తపోటును పెంచుతుంది. పెరిగిన రక్తపోటు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. కోపం సమయంలో ఒత్తిడి హార్మోన్లలో అకస్మాత్తుగా పెరుగుదల గుండెపోటును ప్రేరేపిస్తుందని పరిశోధన నిపుణుడు డాక్టర్ ఇలాన్ విట్స్టెయిన్ వెల్లడించారు. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. ఈ రకమైన ప్రమాదం పురుషుల్లో ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది.
జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ నిర్వహించిన పరిశోధన ప్రకారం తీవ్రమైన అనారోగ్యం లేకపోయినా.. తరచుగా కోపం తెచ్చుకునే వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఐదు రెట్లు పెరుగుతుంది. కాబట్టి మీరు కోపాన్ని తగ్గించుకోవాలి. అది మిమ్మల్ని నియంత్రించే ముందు దానినే మీరే నియంత్రించుకోవడం మంచిది. శరీరాన్ని కోపం నుంచి రక్షించుకోవడానికి, వీలైనంత వరకు దానిని తగ్గించడానికి ప్రతిరోజూ యోగా, ధ్యానం చేయాలి, కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకండి. అవసరమైతే ఈ విషయంలో వైద్యుడిని సంప్రదించడం మంచిది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.
