ఉద్యోగులకు టీటీడీ బ్రహ్మోత్సవ కానుక

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి ఇవాళ తొలి ఫైలుపై సంతకం చేశారు. త్వరలో...

ఉద్యోగులకు టీటీడీ బ్రహ్మోత్సవ కానుక

Updated on: Oct 12, 2020 | 1:41 PM

Brahmotsava presentations to TTD employees: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి ఇవాళ తొలి ఫైలుపై సంతకం చేశారు. త్వరలో ప్రారంభం కానున్న వార్షిన నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఉద్యోగులకు నగదు కానుకలిచ్చే ఫైలుపై ఆయన తొలి సంతకం చేశారు. బ్రహ్మోత్సవ బహుమానంపై తొలి సంతకం చేయడం ఆనందంగా వుందని జవహర్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

బ్రహ్మోత్సవ బహుమానంగా టీటీడీ ఉద్యోగులకు 21 కోట్ల రూపాయలు చెల్లించనున్నది టీటీడీ. శాశ్వత ఉద్యోగులకు 14వేల రూపాయలు, కాంట్రాక్టు ఉద్యోగులకు 6850 రూపాయలు టీటీడీ చెల్లించనున్నది. టీటీడీ ఉద్యోగులతోపాటు అనుబంధ సంస్థల ఉద్యోగులకు కూడా టీటీడీ బ్రహ్మోత్సవ కానుకగా నగదు పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ఇదిలా వుండగా.. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై టీటీడీ మల్లగుల్లాలు పడుతోంది. నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఆనంద నిలయం బయట నిర్వహిస్తామని, తిరుమాడ వీధుల్లో శ్రీవారి వాహన సేవలు కొనసాగుతాయని 20 రోజుల క్రితం టీటీడీ ప్రకటించింది.

తాజాగా ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నందున బ్రహ్మోత్సవాల నిర్వహణపై టీటీడీ బోర్డు పునరాలోచనలో పడింది. సెప్టెంబర్ నెలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లుగానే స్వామివారి ఆలయంలోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం బెటరన్న అభిప్రాయం పలువురిలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం సమావేశం కానున్న టీటీడీ బోర్డు సభ్యులు, అధికారులు బ్రహ్మోత్సవాల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం.