బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రేపు భేటీకానున్న తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, తాజా రాజకీయ వ్యూహాలపై చర్చ
భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డాతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు శనివారం సమావేశం...
భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డాతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు శనివారం సమావేశం కానున్నారు. ఇందుకోసం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. శనివారం ఉదయం గం. 11.00కు జేపీ నడ్డాను ఆయన నివాసంలో సోము వీర్రాజు కలవనున్నారు. పార్టీ కార్యాకలాపాల్లో భాగంగా అన్ని రాష్ట్రాల అధ్యక్షులతో సమావేశమై, సమీక్షించాలని జేపీ నడ్డా చాలా రోజుల క్రితమే నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో భేటీలు ఇప్పటికే జరగాల్సినప్పటికీ, నడ్డా అనారోగ్యం కారణంగా వాయిదా పడిందని తెలిసింది. ఈ క్రమంలో శనివారం ఏపీ, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల అధ్యక్షులు కూడా నడ్డాను కలవనున్నారు. ఒక్కొక్కరితో విడివిడిగా ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను సమీక్షించి, పార్టీ విస్తరణకు తగిన వ్యూహాల గురించి చర్చించనున్నారు.