మహాత్మాగాంధీని తుపాకీతో కాల్చిచంపిన నాథూరాం గాడ్సేను బీజేపీ నేత ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ దేశభక్తుడంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆమె కామెంట్లపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. ఆమె వెనక్కి తగ్గింది. ఇదిలా ఉంటే.. తాజాగా మరో బీజేపీ నేత ఇవాళ నోరు పారేసుకున్నారు. నాథూరాం గాడ్సే కేవలం ఒక్కరినే చంపాడనీ, కానీ కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఏకంగా 17,000 మందిని పొట్టనపెట్టుకున్నారని కర్ణాటక బీజేపీ నేత నలిన్ కుమార్ కతీల్ ఆరోపించారు.
‘నాథూరాం గాడ్సే ఒకరినే చంపాడు, ముంబై మారణహోమంలో పాక్ ఉగ్రవాది కసబ్ 72 మంది అమాయకులను హతమార్చాడు. కానీ రాజీవ్ గాంధీ ఏకంగా 17,000 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ మూడు ఘటనల్లో ఎవరు క్రూరులో మీరే నిర్ణయించుకోండి’ అని ప్రజలను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ ట్వీట్ మరో సంచలనంగా మారింది.
దీంతో ఆయనపై పలువురు నెటిజన్లు మండిపడ్డారు. చివరికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ ట్వీట్‌ను గుట్టుచప్పుడు కాకుండా తొలగించారు. అనంతరం తన ట్వీట్ ఎవరినైనా నొప్పించి ఉంటే.. అందుకు క్షమాపణ కొరుతున్నానని పేర్కొంటూ మరో ట్వీట్ చేశారు.