ఏపీలో లోటస్ డ్రీమ్స్ ఫలితమిచ్చేనా ?

ఏపీ అసెంబ్లీలో ఖాతాలేని బీజేపీ ఏకంగా అధికారాన్నే టార్గెట్‌ చేసుకుంది. ఆమధ్య నలుగురు రాజ్యసభ ఎంపీలకు కండువాలు కప్పి, ఏకంగా టిడిపి రాజ్యసభాపక్షాన్నే విలీనం చేసుకున్న తర్వాత మరో 10 మందికి వెల్‌కమ్‌ చెప్పింది. కమలం గడప తొక్కినవారంతా ఏపీలో జెండా ఎగరేస్తాం.. అంటూ నేడో, రేపో అధికారం ఖాయమన్న విధంగా ప్రకటనలిచ్చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల పునాదులు బలంగా ఉన్న ఏపీలో ఏకంగా అధికారానికి ఎగబాకే సత్తా బీజేపీకి ఉందా? ఆపరేషన్‌ ఆకర్ష్‌లో దూసుకుపోతున్న బీజేపీ.. ఏపీలో […]

ఏపీలో లోటస్ డ్రీమ్స్ ఫలితమిచ్చేనా ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 03, 2019 | 6:43 PM

ఏపీ అసెంబ్లీలో ఖాతాలేని బీజేపీ ఏకంగా అధికారాన్నే టార్గెట్‌ చేసుకుంది. ఆమధ్య నలుగురు రాజ్యసభ ఎంపీలకు కండువాలు కప్పి, ఏకంగా టిడిపి రాజ్యసభాపక్షాన్నే విలీనం చేసుకున్న తర్వాత మరో 10 మందికి వెల్‌కమ్‌ చెప్పింది. కమలం గడప తొక్కినవారంతా ఏపీలో జెండా ఎగరేస్తాం.. అంటూ నేడో, రేపో అధికారం ఖాయమన్న విధంగా ప్రకటనలిచ్చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల పునాదులు బలంగా ఉన్న ఏపీలో ఏకంగా అధికారానికి ఎగబాకే సత్తా బీజేపీకి ఉందా? ఆపరేషన్‌ ఆకర్ష్‌లో దూసుకుపోతున్న బీజేపీ.. ఏపీలో అధికారం అనే గోల్‌పోస్ట్‌ను చేరుతుందా?

మోదీ రెండోసారి అధికారంలోకి రాగానే నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలకు కండువాలు కప్పిన తర్వాత- ఆ పార్టీపై మరింత ఫోకస్‌ పెరిగింది. ఏపీలోనూ బలమైన ప్రతిపక్షంగా మారతామనీ, జెండా ఎగరేస్తామని ఆ పార్టీ పదేపదే మాట్లాడుతున్న తరుణంలో- పలువురు టీడీపీ, కాంగ్రెస్‌, జనసేన నేతలు కమలం గూటికి చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు సమక్షంలో వారు ఆ పార్టీలో చేరారు. టిడిపికి చెందిన మాజీ మంత్రి శనక్కాయల అరుణ, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, అనకాపల్లి నుంచి జనసేన తరపున ఎంపీగా పోటీచేసిన చింతల పార్థసారథి, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే రవి, గుంటూరు జెడ్పీ మాజీ చైర్మన్‌ చిన సత్యనారాయణ, విశాఖకు చెందిన గ్రాంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ తోట నగేష్‌, తెలంగాణ నుంచి దేవేందర్‌గౌడ్‌ తనయుడు వీరేందర్‌ గౌడ్‌ సహా పలువురు నేతలు గురువారం ఢిల్లీలో అధినేతల సమక్షంలో కమలదళంలో చేరారు.

ఏపీలో కాంగ్రెస్‌, టీడీపీ, ఇతర పార్టీల్లో పనిచేసిన సీనియర్లు కొన్ని నెలల నుంచి మా పార్టీకి టచ్ లో వున్నారని బిజెపి ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఈ చేరిక సందర్భంగా వెల్లడించారు. మోదీ నాయకత్వంలో నవీన భారత నిర్మాణానికి పనిచేస్తున్న బీజేపీనే ఏపీలో సరైన ప్రత్యామ్నాయం అని తమకు టచ్ లో వున్న నేతలు భావిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని బలోపేతం చేయడానికి ఈ నాయకులందరూ బాధ్యత తీసుకున్నారని ఆయనంటున్నారు. మరోవైపు బీజేపీ కండువాలు కప్పుకున్న నేతలు- జాతీయతా భావనతోనే పార్టీలో చేర్చినట్లు చెబుతున్నారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడానికి తమ అనుభవాన్ని వినియోగిస్తామని వాకాటి, శనక్కాయల అంటున్నారు.

ఒకవైపు విభజన చట్టాన్ని కేంద్రం అమలుచేయడం లేదనీ, పన్నుల్లో రావల్సిన రాష్ట్రవాటాను ఇవ్వడం లేదని తెలుగు రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తరుణంలో బిజెపి అనుకూల వాదన వినిపించేందుకు ఈ నేతల దగ్గర ఎలాంటి సమాచారం వుంది ? ఏ రకమైన వాదనతో సింగిల్ డిజిట్ కూడా ఇవ్వని సీమాంధ్ర ఓటరును ఈ నేతలు ప్రసన్నం చేసుకోగలరు ? నాడు చంద్రబాబు ఢిల్లీ పెద్దలకు వినిపించిన సమస్యలనే ఇవాళ జగన్‌ కూడా వినిపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీని విస్తరిస్తున్న బీజేపీ నేతలు- ఏపీకి కేంద్రం న్యాయం చేస్తుందన్న సంకేతాలను ఏమేరకు పంపించగలుగుతారన్నది చర్చనీయాంశమైంది.