బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఆయనే..!

బీహార్ ముఖ్యమంత్రి పీఠంపై ఏర్పడిన సందిగ్ధతపై భారతీయ జనతా పార్టీ క్లారిటీ ఇచ్చింది. మంగళవారం వెల్లడైన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయేకు స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి విషయంలో కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఆయనే..!
Follow us

|

Updated on: Nov 11, 2020 | 2:25 PM

BJP clarified on Bihar New CM: బీహార్ ముఖ్యమంత్రి పీఠంపై ఏర్పడిన సందిగ్ధతపై భారతీయ జనతా పార్టీ క్లారిటీ ఇచ్చింది. మంగళవారం వెల్లడైన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయేకు స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ.. సిట్టింగ్ సీఎం నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ కంటే బీజేపీ దాదాపు 31 సీట్లను అధికంగా సాధించింది. గతంలో జేడీయూకు ఎక్కువ సీట్లు.. బీజేపీకి తక్కువ సీట్లు వున్నప్పుడు నితీశ్ ముఖ్యమంత్రిగాను.. బీజేపీకి చెందిన సుశీల్ మోదీ ఉప ముఖ్యమంత్రిగాను వ్యవహరించారు. కానీ ఈసారి ఫలితాల్లో నితీశ్ పార్టీ కేవలం 43 సీట్లకు పరిమితమైంది. మోదీ చరిష్మాతో బీజేపీ 74 సీట్లను కైవసం చేసుకుంది. దాంతో ముఖ్యమంత్రి పీఠం బీజేపీ తీసుకుంటుందన్న ప్రచారం మొదలైంది.

బీహార్ ఎన్నికల హడావిడి ప్రారంభం కాగానే ఎన్డీయేకు విఘాతం కలిగిన విషయం తెలిసిందే. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో వున్న లోక్ జనశక్తి పార్టీ కూటమి నుంచి వైదొలగడంతోపాటు.. నితీశ్ పార్టీ పోటీ చేసిన స్థానాలపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. నితీశ్ పార్టీ ఓటమే లక్ష్యంగా చిరాగ్ పాశ్వాన్ పని చేశారు. దానికి తోడు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా వున్న రామ్ విలాస్ పాశ్వాన్ అకాల మరణం కూడా ఎన్డీయేకు విఘాతంగా మారింది. అయితే.. చిరాగ్ పాశ్వాన్ కూటమి నుంచి వెళ్ళిపోయినా పెద్దగా ఏమీ సాధించలేదు. గతంలో రెండు అసెంబ్లీ స్థానాలు కలిగిన లోక్ జనశక్తి పార్టీ.. ప్రస్తుత ఎన్నికల ఒక స్థానానికి పరిమితమైంది.

ఇదిలా వుంటే.. 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీలో ఎన్డీయే కూటమికి 125 సీట్లు దక్కగా.. హాఫ్ మార్క్ దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో తక్కువ సీట్లలో గెలిచిన నితీశ్ కుమార్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వరన్న కథనాలు మొదలయ్యాయి. అందుకు కారణం బీజేపీ 74 సీట్లు, జెడీయూకు 43 సీట్లు వచ్చాయి. ఎక్కువ సీట్లు వచ్చిన బీజేపీలోనే ముఖ్యమంత్రి సీటు కోసం పోటీ మొదలైందని వార్తలు పుట్టుకొచ్చాయి. కథనాల్లో తీవ్రత పెరుగుతుండడంతో బీజేపీ అధినాయకత్వం రంగంలోకి దిగింది. నితీశ్ కుమారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, కూటమిగా పోటీ చేసినపుడు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ సీట్లు వస్తాయని అంత మాత్రానా ముందే ప్రకటించిన ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్చేది లేదని బీహార్ బీజేపీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందే రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందాన్ని మార్చడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ALSO READ: యుపీ, బెంగాల్‌పై ఓవైసీ నజర్.. యాక్షన్ ప్లాన్ ఇదే!

ALSO READ: సాదాబైనామాల క్రమబద్దీకరణపై హైకోర్టు స్టే