Athletics: నాడు స్టేట్ లెవల్లో గోల్డ్ మెడల్ సాధించిన ఛాంపియన్.. నేడు జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్! అథ్లెట్ కన్నీటి గాథ..
స్టేట్ లెవల్ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ఛాంపియన్. ఐతే అతని ప్రతిభను గుర్తించి భుజం తట్టి ప్రోత్సహించే చేతులు కరువయ్యాయి. కట్‌చేస్తే.. ఇదిగో..ఇలా.. జొమాటోలో..
Bihar Athlete Mukesh Kumar tragedy story in telugu: ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో (ZOMATO)లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న ఓ యువకుడికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అతని కథ ప్రతి ఒక్కరి మనసును మెలిపెడుతోంది. ఏముంది ఈ వీడియోలో? ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా? అతనో అథ్లెట్. మీరు సరిగ్గానే చదివారు. అతను స్టేట్ లెవల్ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ఛాంపియన్. ఐతే అతని ప్రతిభను గుర్తించి భుజం తట్టి ప్రోత్సహించే చేతులు కరువయ్యాయి. కట్‌చేస్తే.. ఇదిగో..ఇలా.. జొమాటోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ పొట్టపోసుకుంటున్నాడు. అతని దీనగాధ మీరూ చదవండి.
బీహార్‌లోని వైశాలి జిల్లాకు చెందిన ముఖేష్ కుమార్ అనే యువకుడికి సంబంధించినదే ఈ వీడియో. నిజానికి, ముఖేష్ రెండో తరగతి చదువుతున్న రోజుల్లోనే అథ్లెటిక్స్‌లో 4 బంగారు పతకాలు సాధించాడు. ఆ పసివాడి తాపత్రయం బడిలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను అమితంగా ఆకట్టుకుంది. భవిష్యత్తులో మరెన్నో శిఖరాలను అధిరోహించాలని ముఖేష్‌ను మరింతగా ప్రోత్సహించారు. ముఖేష్ పెరిగి పెద్దయ్యాడు. అతనితోపాటే అతని ప్రతిభ పెరిగింది. 400 మీటర్ల అథ్లెట్‌గా రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో కూడా పాల్గొన్నాను. ఐతే ఈ పోటీలో నాలుగో స్థానానికే పరిమితమైన ముఖేష్.. తీవ్ర మనస్తాపంతో డిప్రెషన్‌లోకి వెళ్లాడు. అథ్లెటిక్స్‌లో మళ్లీ గెలవలేనని భావన అతన్ని బాగా కుంగదీసింది.
ఐతే విద్యా బుద్ధులతోపాటు, తనలోని ఆటగాడిని తట్టిలేపిన ఉపాధ్యాయులు ఈ క్లిష్ట సమయంలో మద్దతుగా నిలిచి తిరిగి మనిషిని చేశారని ముకేశ్ ఈ వీడియోలో తెలిపాడు. ఈరోజు ఓడిపోయినా ఏదో ఒక రోజు తప్పకుండా గెలుస్తావనే నమ్మకాన్ని తనలో బలంగా కలిగించారని ముఖేష్ చెప్పుకొచ్చాడు. ఉపాధ్యాయుల సహాయంతో, తిరిగి పుంజుకున్న ఆత్మవిశ్వాసంతో, నూతన ఉత్సాహంతో శిక్షణ ప్రారంభించాడు. కోవిడ్ కల్లోల కాలంలోనూ అన్ని స్టేడియంలు మూతబడినప్పటికీ, వెనుదిరగకుండా గంగా నది ఒడ్డున ప్రాక్టీస్ చేసేవాడు. మానసికంగా బలం పుంజుకున్న తన కుటుంబ ఆర్థిక పరిస్థితి మరో సవాలు విసిరింది.
అతని తండ్రి ఓ పేద రైతు. తండ్రి సంపాదన తన కలలను నెరవేర్చుకోవడానికి సరిపోదని, డబ్బు సంపాదించడానికి తనకోమర్గం చూపమని స్నేహితుడిని అడగగా.. జొమాటోలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేసే ఐడియా ఇచ్చాడన్నాడు. తన మొదటి సంపాదనతో చెల్లెలికి షూస్ కొన్నానని, ఆమె కూడా స్టేట్ లెవల్ ఛాంపియన్ అని తెలిపాడు. ఆమె ఇంకా.. ఇంకా.. సాధన చేసి నేషనల్, ఇంటర్‌నేషనల్ స్థాయిల్లో బంగారు పతకాలు సాధించాలని, నాకు కూడా సాధించాలని ఉందని ఈ వీడియోలో ముఖేష్ చెప్పుకొచ్చాడు. తనకు ప్రభుత్వం చేయూత నిస్తే దేశం గర్వపడేలా గొప్ప ఆటగాడినవుతాననే ఆశాభావం వ్యక్తం చేశాడు ముఖేష్. ఈ పేదింటి ఆటగాడి ప్రతిభ ఏ హృదయాన్నైనా స్పందింపజేస్తుందనే ఆశతో జొమాటో ఈ వీడియోనూ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది.
Also Read: