లారీ చూడగానే పోలీసులకు డౌట్ వచ్చింది.. ఆపి చెక్ చేయగా.. మైండ్ బ్లాంక్ అయ్యే సీన్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టయింది. 'పుష్ప' సినిమా స్ఫూర్తితో కంటైనర్‌లో రహస్య గదిని ఏర్పాటు చేసి మారేడుమిల్లి నుండి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్న 500 కేజీల గంజాయిని ఈగల్ ఫోర్స్, పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులు అరెస్ట్ కాగా, రూ. 10 వేల నగదు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

పుష్ప సినిమా చూసే ఉంటారుగా.. అందులో హీరో క్యారెక్టర్ ఎర్రచందనం దుంగలను పాల ట్యాంకర్‌లో పెట్టి అక్రమంగా రవాణా చేస్తుంటాడు. ఆ సీన్ చూసి ఇన్స్పైర్ అయ్యారో ఏం పాడో గానీ.. తాజాగా గంజాయి స్మగ్లర్లు కూడా అలానే అక్రమ రవాణాకు తెరలేపారు. ఓ భారీ కంటైనర్‌లో ఒక ప్రత్యేకమైన రూమ్ లాంటిది చేసి, అందులో ఏకంగా 500 కేజీల గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో చోటు చేసుకుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్, బూర్గంపాడు పోలీసులు సంయుక్తంగా చేసిన ఆపరేషన్‌లో కంటైనర్‌లో భారీగా తరలిస్తున్న గంజాయి పట్టుబడింది, కంటైనర్‌లో రహస్యంగా ఏర్పాటు చేసిన రూము లాంటి బాక్సులో 500 కేజీల గంజాయిని తరలిస్తున్నారు నిందితులు.
ఇది కూడా చదవండి: బంగారం వెదజల్లుతున్న అగ్నిపర్వతం! రోజూ కిలోల కొద్ది బయటపడుతున్న గోల్డ్.. ఎక్కడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారేడుమిల్లి నుండి ఉత్తరప్రదేశ్‌కు ఈ గంజాయి తరలిస్తున్నట్లుగా తెలిపారు పోలీసులు, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఈగల్ టీం, పట్టుబడిన వారిలో ఓ మైనర్ కూడా ఉన్నారని, ఈ ఘటనకు సంబంధించి 8 మంది పై కేసు నమోదు చేశామని నలుగురు అదుపులో ఉండగా మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుండి 10 వేల నగదు, ఒక ద్విచక్ర వాహనం, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ఫొటో: పట్టుబడిన గంజాయి, నిందితులతో పోలీసులు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

