చెన్నైలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. పిల్లా పాపలు, మహిళలు, యువతులు అంతా ఒక్కచోట చేరి ఆటపాటలతో హోరెత్తించారు. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి సందడి చేశారు. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పారు. వరంగల్ జిల్లాకు చెందిన వందలాది కుటుంబాలు 40 ఏళ్ల క్రితం చెన్నైలో స్థిరపడ్డారు. ప్యారీస్, షాపుకారుపేట, బ్రాడ్ వే, ఉత్తర చెన్నై తదితర ప్రాంతాల్లో ఉద్యోగులు, చిన్నా చితక వ్యాపారులు అక్కడే ఉంటున్నారు. అయితే కులాలకు అతీతంగా తెలంగాణ సంఘాన్ని ఏర్పాటు చేసి గత ఏడేళ్లుగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. బతుకమ్మలే కాదు… తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను కూడా వారంతా ఘనంగా జరుపుకుంటారు.
ప్రతి ఏడాది విరాళాలు సేకరించి.. బతుకమ్మ వేడుకలను జరుపుతుంటారు. మైదానంలో తీరొక్క పూలతో కొలువుదీరిన బతుకమ్మలు, ఆటపాటలు… డీజేల హోరుల మధ్య అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ వారితో పాటు.. తమిళనాడుకు చెందిన వారు కూడా ఈ సంబురాల్లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు.