‘కరోనా వైరస్’ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీని ఎఫెక్ట్ ఆరోగ్య పరంగానే కాకుండా.. ఆర్థిక పరంగా కూడా పెను ప్రభావం చూపుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థే కుప్ప కూలుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే దీని ప్రభావం పెట్రోల్ ధరలపై, స్మార్ట్ ఫోన్ల ధరలపై పడిందని పలువురు పేర్కొంటున్నారు. కాగా ప్రస్తుతం ‘కరోనా’ ప్రభావం టాయ్‌లెట్ పేపర్‌పై పడింది. అక్కడ మిగిలిన వస్తువుల కన్నా.. టాయ్‌లెట్ పేపర్‌కు డిమాండ్ ఎక్కువ అయ్యింది. అది ఎంతలా అంటే.. కత్తులతో వచ్చి మరీ బెదిరించి దోచుకెళ్లేంతగా.
తాజాగా హాంకాంగ్‌లో మంగ్ కాక్ జిల్లాలో సోమవారం తెల్లవారు జామున ఓ డెలివరీ బాయ్‌ను కొంత మంది దుండగులు కత్తితో బెదిరించి, కొన్ని పెట్టెల టాయ్‌లెట్ పేపర్‌ను ఎత్తుకెళ్లారు. వాటి విలువ దాదాపు 130 డాలర్ల విలువ ఉంటుంది. అనంతరం షాపు నిర్వాహకులు పోలీసులకు సమాచారమివ్వగా.. వారు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.
కరోనా వైరస్ ప్రభావంతో చైనా వ్యాప్తంగా టాయ్‌లెట్ పేపర్, శానిటైజర్ వస్తువులు, హ్యాండ్ వాష్ క్రీమ్స్, లిక్విడ్స్‌పై డిమాండ్ ఎక్కువ పెరిగింది. ఎంతలా అంటే.. తెల్లవారుజాము నుంచే షాపుల ముందు పొడవైన క్యూల లైన్లు దర్శన మిస్తున్నాయి. కొద్ది నిమిషాల్లోనే సరుకంతా ఖాళీ అయిపోతోంది.