జగనన్న విద్యా దీవెన నిధులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బటన్ నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్ బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా జమ చేశారు. జులై-సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి రూ.584 కోట్లను, 8,09,039 మంది విద్యార్థులకు అందించారు.
నిధులు విడుదల చేసిన అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. విదేశాల్లో ఉన్న ఏపీ విద్యార్థులు కూడా చదివేందుకు ప్రభుత్వమే ఆర్థికంగా అండగా నిలుస్తోందన్నారు. తద్వారా విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో చదువుకోగలుగుతున్నారనీ, ఈ పథకం ద్వారా 400 మంది చదువుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్శిటీల్లో చదివేవారు భవిష్యత్తులో మిగతా వారిని అభివృద్ధిలోకి తీసుకొస్తారని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఇలాంటి మార్పులు మార్పులు వైద్య, వ్యవసాయ, మహిళా సాధికారత, సామాజిక న్యాయం, పరిపాలనా సంస్కరణల్లో కనిపిస్తున్నాయని సీఎం జగన్ అన్నారు. ఇలాంటి మంచి మార్పులు తేవడాన్ని గర్వంగా భావిస్తున్నామని తెలిపిన ఆయన.. గతంలో ఎవరూ ఎప్పుడూ ఇలాంటి ఆలోచన చెయ్యలేదని అన్నారు. గత టీడీపీ పాలనలో చంద్రబాబు చేసిందేమీ లేదన్న సీఎం జగన్, ఈ మార్పులు మీ జగన్ చేయగలుగుతున్నారని చెప్పుకొచ్చారు.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై సైతం సీఎం విరుచుకుపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా, ప్రజలకు మంచి చెయ్యడానికి ఉపయోగించలేదనీ, తన అవినీతి కోసమే అధికారాన్ని వాడని విమర్శించారు. వాళ్లంతా దోచుకోవడం, పంచుకోవడమే చేశారనీ, ఇదంతా ప్రజలు ఆలోచించాలని సీఎం జగన్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక జనసేన అధినేత పవన్‌పై కూడా జగన్ విమర్శలు కురిపించారు. చంద్రబాబు సీఎం అయ్యేందుకే పవన్ పనిచేస్తున్నారని విమర్శించారు. పొత్తులో చంద్రబాబు ఏ సీటూ ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ ఓకే అంటారని సీఎం జగన్ విమర్శించారు. ప్యాకేజీల కోసం త్యాగం చేసే, త్యాగాల త్యాగరాజును ఎప్పుడూ చూసివుండరు అంటూ విమర్శించారు.
ఇక జగనన్న విద్యా దీవెన పథకం వివరాల విషయానికొస్తే.. ఈ పథకం ద్వారా హాస్టళ్లలో ఉంటూ ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు భోజనం, వసతి ఖర్చుల కోసం ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ప్రతీ ఏటా రెండు విడతల్లో ఈ నిధులను విడుదల చేస్తున్నారు. జులై, డిసెంబర్ నెలలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంది. ఈసారి విద్యార్థులు, తల్లి పేరుతో జాయింట్ ఖాతాలు తెరిచిన వారికే సాయం అందుతుందని ప్రభుత్వం మొదట చెప్పింది. అయితే దాన్ని వచ్చే విడత వరకు వాయిదా వేసింది. ప్రస్తుతానికి విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధుల జమ చేస్తోంది. వచ్చే సంవత్సరం నుంచి మాత్రం ఉమ్మడి ఖాతా ఉంటేనే డబ్బులు పడతాయి. ఇక ఈ పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం.. ఐటీఐ చదువుకునే విద్యార్థులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్ చదువుకునే వారికి రూ. 15 వేలు, డిగ్రీ, బీటెక్, మెడిసిన్, ఇతర ఉన్నత విద్యా కోర్సులు చదివే వారికి సవంత్సరానికి రూ. 20 వేలు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..