Monkeypox: వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి.. వైద్యుల హెచ్చరిక
మంకీ ఫాక్స్ కేసులు కలవర పెడుతున్నాయి. రెండు రోజుల క్రితం ఓ కేసు నిర్ధారణ అవగా.. తాజాగా మరో కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ఇద్దరు రోగులను ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు అధికారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇది వేగంగా వ్యాప్తి చెందకముందే అడ్డకట్టవేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులను అప్రమత్తం చేస్తుంది..
తిరువనంతపురం, డిసెంబర్ 18: కేరళ రాష్ట్రంలో మరో ఎంపాక్స్ కేసు నమోదైంది. కన్నూర్ తలస్సేరికి చెందిన వ్యక్తికి తాజాగా ఈ వ్యాధి నిర్ధారణ అయింది. దీంతో అతడిని పరియారత్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని రక్త నమూనాను పరీక్షకు పంపారు. వాయనాడ్‌కు చెందిన వ్యక్తికి 2 రోజుల ముందు ఎంపాక్స్ సోకినట్లు నిర్ధారైన సంగతి తెలిసిందే. ఇంతలో మరో కేసు నమోదైంది. దీంతో ప్రస్తుతం దేశంలో మత్తం 3 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య శాఖకు తెలియజేయాలని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అన్నారు.
2 రోజుల క్రితం యుఏఈ నుండి వచ్చిన వాయనాడ్ వ్యక్తికి ఈ వ్యాధి నిర్ధారణ కావడంతో, రాష్ట్రంలో రక్షణ చర్యలు పటిష్టం చేశారు. మరోవైపు యూఏఈ నుంచి మరో వ్యక్తికి కూడా ఎంపాక్స్ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఈ వ్యాధి నిర్ధారణ అయిన ఇద్దరు కన్నూర్ పరియారం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. త్వరలోనే వారి రూట్ మ్యాప్‌ను ప్రకటిస్తామని ఆరోగ్య మంత్రి తెలిపారు. మరిన్ని ఐసోలేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో రెండో కేసు గుర్తించిన తర్వాత వీణా జార్జ్ నేతృత్వంలో రాష్ట్ర స్థాయి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ (ఆర్‌ఆర్‌టీ) సమావేశమై పరిస్థితిని అంచనా వేసింది.
ఎంపాక్స్ వ్యాధి లక్షణాలు కనిపించిన తర్వాత మాత్రమే వ్యాధి మరొకరికి వ్యాపిస్తుంది. ఎక్స్పోజర్ తర్వాత 21 రోజులు గమనించాలి. విదేశాల నుంచి వచ్చే వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉంటూ పాక్స్ లక్షణాలు కనిపిస్తే ఆరోగ్య శాఖకు నివేదించాలని అధికారులు తెలిపారు. విమానాశ్రయాల్లో సహా అన్ని చోట్ల అవసరమైన జాగ్రత్తలను పటిష్టం చేశారు. ఎంపాక్స్ కోవిడ్ లేదా H1N1 ఇన్ఫ్లుఎంజా మాదిరి గాలి ద్వారా వ్యాపించదు. వ్యాధి సోకిన వ్యక్తితో ముఖాముఖి మాట్లాడటం, ప్రత్యక్షంగా తాకడం, లైంగిక సంపర్కం, దుస్తులు తాకడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం మొదలైన వాటి ద్వారా వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి తెలిపారు.
మంకీ ఫాక్స్ లక్షణాలు
మంకీ ఫాక్స్ ప్రారంభ లక్షణాలు.. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, సైనసైటిస్, వెన్నునొప్పి, కండరాల నొప్పి, నీరసం. జ్వరం వచ్చిన వారం రోజుల్లో శరీరంపై బొబ్బలు, ఎర్రటి మచ్చలు వస్తాయి. ముఖం, పాదాలపై ఎక్కువ పొక్కులు కనిపిస్తాయి. అలాగే అరచేతులు, జననేంద్రియాలు, కళ్ళపై కూడా కనిపిస్తాయి.
Source: Mpox case reported in kerala kannur district, Health Minister veena george give instruction