ఒకే రోజు మూడు తీర్పులు.. కోర్టు తేల్చేసిందిలా !
దేశ అత్యున్నత న్యాయస్థానం.. సుప్రీంకోర్టు ఒకే రోజు మూడు కీలక తీర్పులు ప్రకటించింది. శబరిమలలో అన్ని వయసుల మహిళల ప్రవేశానికి సంబంధించిన అంశంపై మొదట తీర్పునిచ్చిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్.. ఈ కేసును ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి నివేదించారు. శబరిమలలో అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ గత ఏడాది సెప్టెంబరులో కోర్టు తీర్పు నిచ్చింది. అయితే ఆ తీర్పును సవాలు చేస్తూ పలు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసును విస్తృత […]
దేశ అత్యున్నత న్యాయస్థానం.. సుప్రీంకోర్టు ఒకే రోజు మూడు కీలక తీర్పులు ప్రకటించింది. శబరిమలలో అన్ని వయసుల మహిళల ప్రవేశానికి సంబంధించిన అంశంపై మొదట తీర్పునిచ్చిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్.. ఈ కేసును ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి నివేదించారు. శబరిమలలో అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ గత ఏడాది సెప్టెంబరులో కోర్టు తీర్పు నిచ్చింది. అయితే ఆ తీర్పును సవాలు చేస్తూ పలు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలన్న నిర్ణయాన్ని ప్రస్తుత బెంచ్ లోని సీజెఐ గొగోయ్, జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ ఇందు మల్హోత్రా బలపరచగా.. న్యాయమూర్తులు వై.వి. చంద్రచూడ్, జస్టిస్ నారిమన్ విభేదించారు. వీరిద్దరూ గతంలో ఇఛ్చిన తీర్పునే కొనసాగించాలన్నారు. కాగా-ముస్లిములు, పార్సీ మహిళలను వారి ప్రార్థనా మందిరాలలోకి అనుమతించాలా అన్న దానితో శబరిమల అంశాన్ని పోల్చవచ్చునని జస్టిస్ గొగోయ్ పేర్కొన్నారు. మతమన్నది విశ్వాసానికి సంబందించినదని, ఆ ఆలయంలోకి మహిళల ప్రవేశమన్నది ఒక్క మతమనే అంశంతో ఆగదని ఆయన అభిప్రాయపడ్డారు. శబరిమల తలుపులు మరో రెండు రోజుల్లో తెరుచుకోనున్న నేపథ్యంలో గతంలో ఇఛ్చిన తీర్పుపై స్టే జారీ చేసేందుకు కోర్టు నిరాకరించింది. ఆ తీర్పును తిరిగి సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను పెండింగులో ఉంచింది. ఈ కేసుకు సంబంధించి రివ్యూ పిటిషన్లతో బాటు అనేక రిట్ పిటిషన్లు దాఖలయ్యాయని వెల్లడించింది.
ఇక రాఫెల్ యుధ్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో కేంద్రానికి సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. ఈ అంశంపై దాఖలైన అన్ని రివ్యూ పిటిషన్లనూ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ వివాదంపై గతంలో ప్రకటించిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని. అలాగే సీబీఐ విచారణ ఆవశ్యకత కూడా లేదని అభిప్రాయపడింది. ఈ విమానాల కొనుగోలుకు ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందనన్న అంశం జోలికి తాము వెళ్లడం లేదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ విమానాల కొనుగోలుకు సంబంధించి గత ఏడాది డిసెంబరు 14 న పిటిషన్లు దాఖలు కాగా వాటిని కొట్టివేస్తూ కేంద్రానికి అనుకూలంగా తీర్పు నిచ్చిన సంగతి విదితమే.. కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీలతో బాటు ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ నాడు వ్యాజ్యాలు దాఖలు చేశారు. కానీ ఆ తీర్పును తిరిగి పరిశీలించాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయ పడింది. ఆ విమానాల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో బాటు పలువురు ఇతర ప్రతిపక్ష నేతలు కూడా ఆరోపించారు.
కాగా-కోర్టు ధిక్కరణ కేసులో రాహుల్ గాంధీకి ఊరట లభించడం విశేషం. రాఫెల్ విమానాల అంశంపైనా, నాడు లోక్ సభ ఎన్నికల ప్రచార సమయంలోనూ ఆయన ప్రధాని మోదీని ఉద్దేశించి ‘ చౌకీదార్ చోర్ హై ‘ అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత మీనాక్షి ఆయనపై కోర్టు ధిక్కరణ కేసు వేశారు. దీనిపై సున్నితంగా స్పందించిన కోర్టు.. ‘ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని ‘ రాహుల్ కి సూచిస్తూ ఈ పిటిషన్ ను కొట్టివేసింది. తన వ్యాఖ్యలకు గాను ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పిన విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ఇలా..అతి కీలకమైన మూడు కేసుల్లో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పులనిచ్చారు. ఈనెల 17 న ఆయన రిటైర్ కానున్న నేపథ్యంలో ప్రధానమైన ఈ మూడు కేసులనూ పరిష్కరించారు.