ప్రస్తుత కాలంలో కార్లు సర్వసాధారణం అయిపోయాయి. గతంలో కార్లు అంటే ధనవంతుల వద్ద మాత్రమే ఉపయోగించే వాహనం అని భావన ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కార్ల ధరలు సామాన్యులకు అందుబాటులోకి రావడం.. ఇప్పుడు ప్రతి ఒక్కరు సొంతంగా కారు కొనుక్కోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడిక బైక్స్ ధరలు.. కార్ల ధరలకు పోటీనిస్తుండటంతో.. ప్రజలు ఎక్కువగా కారు కొనేందుకే ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ కారణంగానే.. రోడ్లపై దూసుకెళ్లే కార్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఫలితంగా ట్రాఫిక్ సమస్యలు కూడా పెరిగిపోయాయి. పొల్యూషన్ అయితే ఇక్కడ చెప్పనక్కర్లేదు. ఆ కారణంగానే కదా మన ఢిల్లీలో ‘సరి-బేసి’ విధానాన్ని ప్రారంభించింది.
ఇక వాహనాలు తిరిగేందుకు, రవాణా వ్యవస్థ కోసం ప్రభుత్వాలు సైతం రోడ్లను నిర్మిస్తున్నాయి. ట్యాక్స్ కట్టి వాహనదారులు తమ వాహనాల్లో ప్రయాణం సాగిస్తుంటారు. ప్రపంచ దేశాలన్నింటినీలో ఇదే పద్ధతి ఉంటుంది. కానీ, ఈ దేశం బహు విచిత్రం. కార్లు నడవని దేశం ఉండదని అనుకుంటే పొరపాటని నిరూపిస్తూ.. తమ దేశంలో కార్ల ప్రయాణాన్ని నిషేధించింది. అవును, ఈ దేశ ప్రభుత్వం కార్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. దాంతో అక్కడి ప్రజలు కార్లను కొనలేరు. నడపలేని పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఏంటా దేశం.. కార్లపై నిషేధం ఎందుకు విధించింది? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
స్విట్జర్లాండ్‌లోని జెర్మాట్ నగరానికి సంబంధించినది ఈ మ్యాటర్. స్విట్జర్లాండ్ అందాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఈ దేశాన్ని ‘భూతల స్వర్గం’ అంటారు. డైలీ స్టార్ నివేదిక ప్రకారం.. జెర్మాట్ నగర మునిసిపాలిటీ ప్రజలు ప్రైవేట్ కార్లను ఉంచకుండా నిషేధించింది. అంటే, ఈ నగరంలో నివసించే వ్యక్తులు ఎలాంటి కారును ఉంచుకోలేరు. నగరంలో ఎక్కడికైనా వెళ్లవలసి వచ్చినా.. ప్రజా రవాణాను మాత్రమే ఉపయోగించాలి. ఈ ప్రజా రవాణాలో ప్రధానంగా రైలు సేవలు అధికంగా ఉన్నాయి.
అయితే, ఈ నియమం నుంచి టాక్సీ డ్రైవర్లు, బిల్డర్లతో సహా కొంతమందికి మినహాయింపునిచ్చింది. ఒకవేళ ఎవరైనా తమ ప్రైవేట్ కారును రోడ్డుపై నడపాల్సి వస్తే మున్సిపాలిటీ విధించిన రూల్స్ ప్రకారమే నడపాల్సి ఉంటుంది. వారు ముందుగా ప్రభుత్వం నుండి పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ప్రైవేట్ కారు ఎందుకు కావాలో, మీ సమస్య ఏంటో ఆ దరఖాస్తులో తెలియజేయాలి. అక్కడి ప్రభుత్వం అనుమతి ఇస్తేనే కారు కొనుక్కోవడం గానీ, నడపడం గానీ ఉంటుంది. లేదంటే భారీ జరిమానా, శిక్షను అనుభవించాల్సి వస్తుంది.
ప్రజా రవాణాలో ప్రయాణించే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది అక్కడి ప్రభుత్వం. ప్రత్యేక రహదారి కేటాయించింది. ఇక ప్రైవేటు కారులో ప్రయాణించాలనుకుంటే.. అందుకు కూడా ఒక మార్గం ఉంది. మొత్తానికి ఈ నిబంధనలను అమలు చేయడం ద్వారా నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేసింది. నగరం అందాన్ని సంరక్షించింది ప్రభుత్వం.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..