పడి లేచే అలలను కొందరు ఆదర్శంగా తీసుకుంటారు.. తమ జీవితంలో ఎదురయ్యే కష్టాలను, నష్టాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకువెళ్తారు. చరిత్రలో తమకంటూ ఓ పేజీని లిఖించుకుంటారు. అదే సమయంలో ఇంకొందరు.. తమ జీవితంలో ఏ చిన్న కష్టం వచ్చినా పలాయన మంత్రం పఠిస్తూ.. ఒకొక్కసారి జీవితాన్ని అంతం చేసుకుంటారు కూడా.. ఇందుకు ఉదాహరణగా నిలుస్తారు కొందరు ఇంటర్ స్టూడెంట్స్. ఇంటర్ లో ఉత్తీర్ణత సాధించలేదని క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతూ కన్నతల్లిదండ్రులకు గుండె కోతను మిగులుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఐపీఎస్ అధికారి సక్సెస్ స్టోరీ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే ఆ పోలీసు ఉన్నతాధికారి ఇంటర్ ఫెయిల్ కావడం మాత్రమే కాదు… యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ను నాలుగు సార్లు రాసి మరీ తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. మరి ఆ ఐపీఎస్ ఆఫీసర్ అధికారి ఎవరో పూర్తి వివరాల్లోకి వెళ్తే..
యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ ను ప్రతి సంవత్సరం UPSC సివిల్ సర్వీసెస్ నిర్వహిస్తుంది. ఉత్తీర్ణత సాధించడం కష్టతరమైన పరీక్షలలో ఇది ఒకటి. అంతేకాదు చాలా అరుదుగా అభ్యర్థులు మొదటి ప్రయాణంలో పరీక్షను ఛేదిస్తారు. కొందరు వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారు కానీ ఇంటర్వ్యూ రౌండ్లో ఉత్తీర్ణత సాధించలేరు.. మరికొందరు మొదటి ప్రయాణంలో రెండింటిలోనూ ఉత్తీర్ణులవుతారు. అదే సమయంలో UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలనే కలను కంటూ.. తాము కన్న కలను నెరవేర్చుకోవడం కోసం ఒకసారి రెండు సార్లు కాదు.. తమ లక్ష్యం సాధించే వరకూ ప్రయత్నించేవారు కూడా ఉన్నారు.
వారిలో ఒకరు ఐపీఎస్ అధికారి మనోజ్ శర్మ. తన నాలుగో ప్రయత్నంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించారు.
వాస్తవానికి మనోజ్ శర్మ ఇంటర్ ఫెయిల్ స్టూడెంట్. 12వ తరగతిలో హిందీ మినహా అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. అంతేకాదు టెన్త్ క్లాస్ ను కూడా థర్డ్ క్లాస్ పాస్ అయ్యారు. చిన్నతనంలో తనకు ఎదురైనా పరాజయాలను చూసి ఎప్పుడూ మనోజ్ కుంగిపోలేదు. మరింత పట్టుదలతో చదివారు. తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఇదే విషయాన్నీ ప్రస్తావిస్తూ.. ‘ట్వెల్ఫ్త్ ఫెయిల్’ అనే జీవిత చరిత్రను రచయిత అనురాగ్ పాఠక్ రాశారు.
మనోజ్ శర్మ చిన్ననాటి క్లాస్‌మేట్ ఇప్పుడు జీవిత భాగస్వామి శ్రద్ధ.. అన్నివిధాలా మనోజ్ కు అండగా నిలబడ్డారు. UPSC పరీక్షలో మనోజ్ చేస్తున్న ప్రయాణంలో శ్రద్ధ సహాయం చేసింది. మనోజ్ 12వ తరగతి చదువుతున్న సమయంలో శ్రద్ధను కలిశారు. తన ప్రేమను చెప్పడానికి సంకోచించారు. అనంతరం మనోజ్ శ్రద్ధకు తన ప్రేమని ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నారు.
CM @Dev_Fadnavis releases a book ‘12th Fail’, written by Anurag Pathak and based on the life struggle of Manoj Kumar Sharma, IPS. pic.twitter.com/FWLL7seH4Z
— CMO Maharashtra (@CMOMaharashtra) September 12, 2019
మనోజ్ తన జీవితంలో చాలా అడ్డంకులను ఎదుర్కొన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన మనోజ్.. పేదరికంతోనే పెరిగారు. రాత్రి సమయంలో బిచ్చగాళ్ల మధ్య రోడ్డుపై పడుకున్న రోజులు కూడా ఉన్నాయి ఆయన జీవితంలో. యూపీఎస్సీ పరీక్షలో మూడుసార్లు విఫలమయ్యారు. నాలుగో ప్రయత్నంలో 121వ ర్యాంకు సాధించి ఐపీఎస్ అధికారి అయ్యారు. ప్రస్తుతం యూపీఎస్సీ టాపర్ మనోజ్ శర్మ ముంబై పోలీస్ శాఖలో అదనపు కమిషనర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..