జైలు జీవితం అనుభవించాలని ఎవరికి ఉంటుంది చెప్పండి. సింగిల్ కాస్ట్యూమ్, నాలుగు గోడలు, విశాలమైన భవనం, స్మశానం తరువాత నిశ్శబ్ధంగా ఉండే వాతావరణం, ఏదైనా వ్యాధి బారిన పడితే పలకరించేందుకు తనకంటూ ఎవరూ లేని బ్రతుకులు. ఇవన్నీ చూశాక జీవితం అంటే విరక్తి వచ్చే అవకాశం ఉంటుంది. మానసిక, శారీరక పరిపక్వతను అందించి పూర్తి స్థాయి వైరాగ్యంలోకి నెట్టేందుకు ఇది తోర్పడుతుంది.
ఇక్కడకు వచ్చిన వారు క్షణికావేశంలో తప్పు చేసి వచ్చిన వారే ఉంటారు. కావాలని ఎవరూ ఏ నేరానికి పాల్పడరు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యానో, తన వ్యక్తిగత అవసరాల కారణంగానో నేరానికి పాల్పడుతూ ఉంటారు. వీరికి మానవీయ కోణంలో చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. సమాజంలో ఉన్నప్పటికీ సమాజ పోకడలకు దూరంగా బ్రతుకుతూ ఉంటారు. ఇలాంటి వారిని సంరక్షించేందుకు జైలు అధికారులు ఉంటారు. వీరి పరిస్థితి అయితే వర్ణణాతీతం. ఇంత బతుకూ బ్రతికి నేరం చేయకున్నా నేరస్థుల మధ్య గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే కేంద్ర హోం శాఖ సరికొత్తగా ఒక నిబంధన తీసుకొచ్చింది. దీనిని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఆదేశించింది.
నిబంధనలకు విరుద్దంగా జైల్లో మొబైల్ ఫోన్లు వాడుతూ పట్టుబడితే వారికి మూడేళ్ల జైలు శిక్షతోపాటూ రూ. 25వేల జరిమానా విధించాలని పేర్కొంది. ఇందులో నేరస్తులు, అధికారులు, సందర్శకులు ఎవరినీ విడిచిపెట్టకుండా అందరినీ చేర్చడం గమనార్హం. ఇందుకోసం మోడల్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ యాక్ట్-2023ని కొత్తగా రూపొందించింది. ఒకవేళ జైలు జీవితం అనుభవిస్తున్న వారు మొబైల్ ఫోన్లతో పట్టుబడితే గతంలో వేసిన శిక్షకు అదనంగా మూడేళ్లు చేర్చాలని పేర్కొంది. ఎప్పుడో 1894, 1900 కాలంనాటి చట్టాలకు చెల్లుచీటి ఇచ్చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కొన్ని నిబంధనలు చేర్చించి. అలాగే ఖైదీలను కొన్ని వర్గాలుగా విభజించింది. అందులో సివిల్ ఖైదీలు, క్రిమినల్ ఖైదీలు, శిక్షపడ్డ వారు, ట్రయల్స్‌లో ఉన్న వాళ్లు, రిమాండ్ ఖైదీలు, అలవాటుగా నేరాలకు పాల్పడేవారు, ప్రతిసారి జైలు నుంచి తప్పించుకునే వాళ్లు ఇలా వివిధ క్యాటగిరీలుగా విభజించింది.
అత్యంత ప్రమాదకరమైన నేర ప్రవృత్తి కలిగిన వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్స్‌లో ఉంచాలని వీరిపై పూర్తిస్థాయి భద్రతను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ ఖైదీలను పురుషులు, స్త్రీలు, ట్రాన్స్‌జెండర్స్‌గా వర్గీకరించి ప్రత్యేకంగా ఉంచాలి. వీరికి ప్రత్యేక బ్యారక్‌లు, ఎన్‌క్లోజర్లు, సెల్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. వీరితో పాటూ మదకద్రవ్యాలకు అలవాటు పడ్డవారు, తాగుడుకు బానిసై నేరానికి పాల్పడ్డవారు, అనేక దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమౌతున్నవారు, మొదటి సారి నేరం చేసి జైలుకు వచ్చిన వారు, 65ఏళ్లు పైబడిన వారు, విదేశీయులు, జీవితఖైదు, మరణశిక్ష పడ్డవారు, మానసిక స్ధితి సరిగ్గా లేని వారితో పాటూ యువ ఖైదీలను వేర్వేరు ప్రదేశాల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరింది.
ఎలక్ట్రానిక్ పరికరాలు ధరించి ట్రాకింగ్ చేసేందుకు అంగీకరించిన వారికి సెలవులకు అనుమతి ఇస్తారు. అలా కాకుండా నిబంధనలకు విరుద్దంగా నడుచుకున్నవారికి ఎలాంటి సెలవులు ఉండవు. వీటన్నింటితో పాటూ కొత్త నేరాలు చేయడానికి తోడ్పడటం, చేసేందుకు ఉసిగొల్పడం లాంటివి చేస్తే ముందుగా హెచ్చరిస్తారు. వాటిని పట్టించుకోకుండా తన తీరు మార్చుకోకుండా ఉంటే.. అతని జైలుజీవిత చరిత్ర రికార్డుల్లో ప్రవర్తనకు సంబంధించిన అంశాలను నమోదుచేస్తారు. ఇలాంటి వారికి క్యాంటీన్ సౌకర్యంతో పాటూ ఇతర వినోద సౌకర్యాలను నెలపాటు ఆపేస్తారు. సంపాదించుకున్న క్షమాభిక్ష కాలాన్ని రద్దుచేస్తారు. నెలరోజులపాటు సందర్శకులను అనుమతించరు. నెలరోజులపాటు ప్రత్యేక సెల్‌లో నిర్బంధిస్తారు. కొత్త శిక్షలు, జరిమానాల గురించి ఖైదీలకు తెలిసేలా ఇంగ్లీష్‌తో పాటూ స్థానిక భాషల్లో జైల్లో బోర్డులు పెట్టాలని పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..