
దేశంలో ఏ రోడ్డుపై ప్రయాణించినా దూరం తెలిపే కొలత రాళ్లు కచ్చితంగా దర్శనం ఇస్తాయి. వీటిని సాధారణంగా కిలోమీటర్ రాళ్లు అంటారు. ఒక గ్రామం నుండి మరో గ్రామానికి ఎంత దూరం ఉందో ఈ రాళ్లు తెలియజేస్తాయి. అయితే, ఈ కిలోమీటర్ రాయి పైభాగంలో ఉండే రంగు, మనం ప్రయాణిస్తున్న రోడ్డు ఏ కేటగిరీకి చెందిందో సూచిస్తుంది.
ప్రభుత్వం రోడ్డు రకాల ఆధారంగా రంగులను కేటాయించింది. కిలోమీటర్ రాళ్లు అన్నీ సాధారణంగా తెలుపు రంగులో ఉంటాయి. అయితే, రాయి పైభాగంలో దాదాపు 25 శాతం వరకు వేరే రంగు వేసి రోడ్డు రకాన్ స్పష్టం చేస్తారు.
పసుపు – తెలుపు : కిలోమీటర్ రాయి పైభాగం పసుపు రంగులో ఉంటే, మీరు జాతీయ రహదారి పై ప్రయాణం చేస్తున్నారని అర్థం. ఇది అత్యంత ప్రధానమైన రహదారి.
ఆకుపచ్చ – తెలుపు : ఈ రంగు ఉన్నట్లైతే అది రాష్ట్ర రహదారి పై ఉన్నామని తెలుపుతుంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలన్ ఇది కలుపుతుంది.
నలుపు – తెలుపు : ఈ రంగు పెద్ద జిల్లా రోడ్డు లేదా పట్టణంలోని సిటీ రోడ్డుకు సంకేతం.
ఆరెంజ్ – తెలుపు : రాయిపై ఆరెంజ్ రంగు ఉంటే, అది గ్రామీణ రోడ్డు అని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ రోడ్లను సాధారణంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన లాంటి పథకాల కింద అభివృద్ధి చేస్తారు. ఈ రంగుల ద్వారా మీరు ఎక్కడ ఉన్నారో, మీ ప్రయాణం ఏ రకమైన రహదారిపై కొనసాగుతుందో సులభంగా తెలుసుకోవచ్చు.