
మగవారి షర్ట్‌లకు బటన్లు కుడివైపు, ఆడవారి షర్ట్‌లకు ఎడమవైపు ఉండటం వెనుక చాలా కారణాలున్నాయి. ఈ చిన్న తేడా వెనుక ఆసక్తికరమైన కారణం ఉంది. అలాగే కొన్ని పాతకాలం నాటి ఆచారాలు కూడా దాగి ఉన్నాయి. అసలు ఈ బటన్లను ఇలా ఒకే రకంగా కాకుండా వేరు వేరుగా కుట్టడానికి కారణాలేంటి, కాలక్రమేణా ఇది ఎలా సంప్రదాయంగా మారిందో తెలుసుకుందాం.
అప్పటి కాలం మగవారు తమ పనులు స్వయంగా చేసుకునేవారు. బటన్లు కుడివైపు ఉండటం వల్ల కుడిచేతి వాటం ఉన్నవారు సులభంగా బటన్లు పెట్టుకోవడానికి, తీయడానికి వీలుగా ఉండేది. ఇది కత్తి పట్టడం లేదా ఇతర పనులకు కుడిచేయిని స్వేచ్ఛగా ఉంచడానికి కూడా ఉపయోగపడేది. అందుకని వారికి అనువుగా ఈ బటన్లను కుట్టేవారు.
ధనిక వర్గాలలోని ఆడవారు తమ దుస్తులను ధరించడానికి దాసీల లేదా సేవకుల సహాయం తీసుకునేవారు. సేవకులు ఎదురుగా నిలబడి బటన్లు పెట్టేవారు కాబట్టి, వారికి సులువుగా ఉండేందుకు బటన్లు ఎడమవైపు పెట్టేవారు. ఇది సేవకుల కుడిచేతికి అనువుగా ఉండేది. పేదరికంలో ఉన్న ఆడవారు కూడా ఈ సంప్రదాయాన్ని అనుసరించారు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు పాలు పట్టేటప్పుడు, ముఖ్యంగా కుడిచేతి వాటం ఉన్న తల్లులు, తమ ఎడమ చేతిలో బిడ్డను పట్టుకుని, కుడిచేతితో బటన్లు విప్పుకోవడానికి సులభంగా ఉండేలా ఎడమవైపు బటన్లను ఏర్పాటు చేసేవారు.
బటన్ల అమరిక స్త్రీ, పురుష దుస్తుల మధ్య తేడాని సూచించే ఒక సంప్రదాయంగా కూడా కొనసాగింది. ఇది స్త్రీ, పురుషులకు వేర్వేరు ఫ్యాషన్ ప్రమాణాలు ఉండేవని కూడా తెలియజేస్తుంది. ఈ రోజుల్లో, ఈ సంప్రదాయం చాలావరకు ఫ్యాషన్ డిజైనర్లు కొనసాగిస్తున్నప్పటికీ కొందరు డిజైనర్లు స్త్రీ, పురుషులిద్దరికీ ఒకే రకమైన బటన్ల అమరికతో షర్టులను కూడా రూపొందిస్తున్నారు.
గతంలో, మగవారి దుస్తులకు కుడివైపు బటన్లు, ఆడవారి దుస్తులకు ఎడమవైపు బటన్లు అనే నియమం చాలా కఠినంగా ఉండేది. కానీ, ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలో, ఈ నియమం క్రమంగా సడలిపోతోంది. చాలామంది డిజైనర్లు ఇప్పుడు యూనిసెక్స్ దుస్తులను రూపొందిస్తున్నారు, అంటే స్త్రీ, పురుషులిద్దరూ ధరించగలిగే దుస్తులు. ఈ యూనిసెక్స్ షర్టులలో బటన్ల అమరిక ఏదో ఒక వైపు (ఎక్కువగా కుడివైపు) ఉంటుంది, లేదా కొన్నిసార్లు బటన్లు అసలు కనపడకుండా లోపలి వైపు అమర్చి కుట్టేస్తున్నారు.