AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russells viper: రక్తపింజర్రోయ్.. దీంతో పెద్ద ప్రమాదంరోయ్..

గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే రక్తపింజర పాము అత్యంత విషపూరితమైనది. దీని కాటు రక్తంపై ప్రభావం చూపుతూ ప్రాణాపాయం కలిగిస్తుంది. ఎలుకలు వంటి జంతువులను ఆహారంగా తీసుకునే ఈ పాము పొలాలు, గోదాముల వద్ద ఎక్కువగా సంచరిస్తుంది. కాటు విషయంలో అపోహలను నమ్మకుండా వెంటనే ఆసుపత్రికి తరలించడం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Russells viper: రక్తపింజర్రోయ్.. దీంతో పెద్ద ప్రమాదంరోయ్..
Russells Viper
Ram Naramaneni
|

Updated on: May 08, 2026 | 4:54 PM

Share

భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఒకటిగా పేరుగాంచింది రస్సెల్స్ వైపర్. హిందీలో “చందన్ గోడ్”, తెలుగులో “రక్త పింజర”గా పిలిచే ఈ పాము, తన విషపూరిత స్వభావంతో అనేక ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, పొలాల వద్ద ఈ పాము ఎక్కువగా కనిపించడం వల్ల ప్రమాదం మరింత పెరుగుతోంది.

ఈ పాము తనను ప్రమాదంలో ఉందని భావించిన వెంటనే అత్యంత వేగంగా స్పందిస్తుంది. శరీరాన్ని వంచి ఒక్కసారిగా దాడి చేస్తూ కాటు వేయగలదు. దీని విషం హీమోటాక్సిక్ స్వభావం కలిగి ఉండటంతో, రక్తం గడ్డకట్టే ప్రక్రియను దెబ్బతీసి అంతర్గత రక్తస్రావానికి దారితీస్తుంది. కాటు తర్వాత తీవ్రమైన నొప్పి, వాపు, రక్తస్రావం, కొన్ని సందర్భాల్లో మూత్రంలో రక్తం కనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. పరిస్థితి విషమిస్తే మూత్రపిండాల పనితీరు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది.

ఒకసారి కాటు వేసిన తర్వాత మళ్లీ కరిస్తే విషం విడుదల చేయదనే అపోహ ప్రజల్లో ఉంది. కానీ ఇది పూర్తిగా తప్పు. ప్రతి కాటులో కూడా విషం ప్రవేశించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో విషం లేకుండా కాటు (డ్రై బైట్) ఉండొచ్చుగానీ, అది ముందుగా చెప్పలేము. కాబట్టి ఏ పాము కాటు అయినా నిర్లక్ష్యం చేయడం ప్రాణాంతకం.

ఆహారం, జీవన విధానం:

ఈ పాము ప్రధానంగా ఎలుకలు, చిన్న సస్తన జంతువులు, బల్లి జాతులు, కొన్ని పక్షులు వంటి వాటిని ఆహారంగా తీసుకుంటుంది. ముఖ్యంగా వ్యవసాయ పొలాల్లో ఉండే ఎలుకలను తినడం వల్ల రైతులకు కొంత మేర ఉపయోగకరంగా కూడా ఉంటుంది. రాత్రి సమయంలో ఎక్కువగా చురుకుగా ఉండే ఈ పాము, పొదలు, పొలాలు, గడ్డి ప్రాంతాలు, మనుషుల నివాసాల సమీపంలో కూడా కనిపిస్తుంది. ఎలుకలు ఎక్కువగా ఉండే గోదాములు, పంట పొలాలు వీటి సాధారణ నివాస ప్రాంతాలు. ఈ పాము సాధారణంగా కాటు వేయడానికి ముందు హెచ్చరిక ఇస్తుంది. ఇస్…….. అంటూ శబ్దం చేస్తుంది. కానీ అది ఎప్పుడూ గ్యారంటీ కాదు.

పాము కాటుకు గురైన వెంటనే బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలించడం అత్యవసరం. యాంటీ వెనం మాత్రమే ఈ విషానికి సమర్థవంతమైన చికిత్స. మంత్రాలు, పసర్లు, సంప్రదాయ వైద్యాలపై ఆధారపడటం సమయాన్ని వృథా చేసి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంది. కాటు అయిన వ్యక్తిని శాంతంగా ఉంచడం, కదలికలు తగ్గించడం చాలా ముఖ్యం. గాయం దగ్గర బిగిగా కట్టడం, కోయడం, విషం పీల్చడం వంటి చర్యలు చేయకూడదు.

ఇంటి పరిసరాల్లో, పొలాల్లో లేదా విద్యాసంస్థల్లో పాములను గమనించినప్పుడు వాటిని తాకేందుకు లేదా చంపేందుకు ప్రయత్నించకూడదు. వెంటనే నిపుణులైన రెస్క్యూ సిబ్బందిని సమాచారం ఇవ్వాలి. వారు పాములను సురక్షితంగా పట్టుకుని సహజ ఆవాసాలకు తరలిస్తారు. వన్యప్రాణులతో సహజీవనం చేయడం, వాటిని గౌరవించడం పర్యావరణ సమతుల్యతకు ఎంతో అవసరం.

Follow Us