Prosopis juliflora: కరువు నుంచి కాపాడేందుకు తెచ్చిన చెట్టు.. ఇప్పుడు శాపంగా మారిందా..?
కరువు సమస్యకు పరిష్కారంగా 150 ఏళ్ల క్రితం భారతదేశానికి తీసుకొచ్చిన విదేశీ వృక్ష జాతి ప్రోసోపిస్ జులిఫ్లోరా ఇప్పుడు దేశంలోని అత్యంత ప్రమాదకర ఆక్రమణ జాతుల్లో ఒకటిగా మారింది. ఒకప్పుడు ప్రజలకు ఇంధనం, ఉపాధి కల్పించిన ఈ చెట్టు... నేడు జీవవైవిధ్యం, గడ్డి భూములు, స్థానిక వృక్ష జాతులకు ముప్పుగా మారిందని పరిశోధనలు చెబుతున్నాయి.

భారతదేశంలో 19వ శతాబ్దం చివర్లో వరుస కరువులు, క్షామాలు తీవ్రంగా విజృంభించాయి. ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్, దక్షిణ భారత రాష్ట్రాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అప్పటి బ్రిటిష్ పాలకులు విదేశీ వృక్ష జాతిని భారతదేశానికి తీసుకొచ్చారు. అదే ప్రోసోపిస్ జులిఫ్లోరా. అప్పట్లో కరువు నివారణకు ఆశాకిరణంగా భావించిన ఈ చెట్టు… నేడు దేశంలోని అత్యంత ప్రమాదకర ఆక్రమణ జాతులలో ఒకటిగా గుర్తింపు పొందింది.
భారత్‌కు ఎలా వచ్చింది?
దక్షిణ అమెరికాకు చెందిన ప్రోసోపిస్ జులిఫ్లోరాను 1877 ప్రాంతంలో అప్పటి సింధ్ ప్రాంతంలో తొలిసారిగా నాటారు. అనంతరం రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, హర్యానా వంటి ఎండ ప్రాంతాలకు విస్తరించారు. తక్కువ నీటితోనూ, ఎలాంటి సంరక్షణ లేకుండానూ పెరిగే సామర్థ్యం ఉండటంతో దీనిని విస్తృతంగా ప్రోత్సహించారు.
ఒకప్పుడు ప్రజలకు అండగా నిలిచిన చెట్టు
ఎడారి ప్రాంతాల్లో నివసించే పేదలకు ఈ చెట్టు ఇంధన కట్టెలు, బొగ్గు తయారీ, పశువుల మేత వంటి అవసరాలకు ఉపయోగపడింది. వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించింది. ఇసుక తుఫాన్లు, నేల కోతను తగ్గించడంలో కూడా కొంత మేర ఉపయోగపడిందని పరిశోధనలు చెబుతున్నాయి.
అయితే సమస్యలు ఎక్కడ మొదలయ్యాయి?
కాలక్రమేణా ఈ చెట్టు వేగంగా విస్తరించి స్థానిక వృక్ష జాతులను తొలగించడం ప్రారంభించింది. ముఖ్యంగా ఖేజ్రీ, అకేసియా వంటి స్వదేశీ మొక్కల పెరుగుదలను అడ్డుకుంది. అధికంగా భూగర్భ జలాలను వినియోగించడం వల్ల కొన్ని ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గిందని పరిశోధకులు చెబుతున్నారు. దీని పదునైన ముళ్లు మనుషులు, పశువులకు గాయాలు కలిగించడమే కాకుండా, పశువుల మేత కోసం ఉపయోగించే గడ్డి భూములను కూడా ఆక్రమించాయి. దీంతో పశుపోషకుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడింది.
పరిశోధనలు ఏమి చెబుతున్నాయి?
కేంద్ర ఎడారి పరిశోధనా సంస్థకు చెందిన శాస్త్రవేత్త ఎస్.కే. సక్సేనా చేసిన అధ్యయనం ప్రకారం, ఈ చెట్టు థార్ ఎడారి వంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం విజయవంతంగా పెరిగింది. అయితే PLOS ONE జర్నల్‌లో ప్రచురితమైన మరో అధ్యయనం ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. స్వదేశమైన వెనిజులాలో ఈ చెట్టు ఇతర మొక్కల పెరుగుదలకు కొంత మేర సహకరిస్తే, భారతదేశంలో మాత్రం దీనివల్ల మొక్కల వైవిధ్యం బాగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. స్థానిక జాతి అయిన ఖేజ్రీ చెట్టుతో పోలిస్తే, జులిఫ్లోరా ప్రభావం చాలా ఎక్కువగా ఉందని అధ్యయనం తేల్చింది.
బన్ని గడ్డి భూముల్లో తీవ్ర ప్రభావం
గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలోని ప్రసిద్ధ బన్ని గడ్డి భూములు ఈ చెట్టు కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. పశువులకు అవసరమైన స్థానిక గడ్డి జాతులను ఇది ఆక్రమించడంతో పశుపోషకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ చెట్టుపై పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతల మధ్య తీవ్ర చర్చ కొనసాగుతోంది. పర్యావరణానికి ముప్పుగా మారిందని పూర్తిగా తొలగించాలని ఒక వర్గం వాదిస్తుండగా… మరోవైపు లక్షలాది మంది జీవనోపాధి ఈ చెట్టుపైనే ఆధారపడిందని, పూర్తిగా నిర్మూలించడం సరైన పరిష్కారం కాదని మరో వర్గం అభిప్రాయపడుతోంది.
దాదాపు 150 ఏళ్ల క్రితం భారతదేశాన్ని కరువు నుంచి కాపాడాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ప్రోసోపిస్ జులిఫ్లోరా నేడు దేశ పర్యావరణ వ్యవస్థకు సవాలుగా మారింది. ఒకప్పుడు వరంగా భావించిన ఈ విదేశీ చెట్టు… ఇప్పుడు ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తోందా? లేక గ్రామీణ జీవనోపాధికి ఇప్పటికీ అవసరమా? అనే ప్రశ్నకు సమతుల్య పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
