AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీసులు ఇక అలా చెప్పలేరు.. మీ చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం లాంటి చట్టం ఇదే..

అర్ధరాత్రి హైవేపై ప్రమాదం జరిగినా.. కొత్త ఊర్లో ఏదైనా దారుణం ఎదురైనా.. పోలీసుల సాయం కోసం పరుగులు తీస్తే ‘‘ఇది మా పరిధిలోకి రాదు, ఆ స్టేషన్‌కు వెళ్లండి’’ అనే చేదు అనుభవం ఎప్పుడైనా ఎదురైందా? ఇకపై పోలీసులు అలాంటి సాకులు చెప్పడానికి అస్సలు వీల్లేదు. నేరం ఎక్కడ జరిగినా సరే, ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా కేసు పెట్టే పవర్‌ఫుల్ హక్కు మనకు చట్టం ఇచ్చింది. సామాన్యులకు బ్రహ్మాస్త్రం లాంటి ఆ రూల్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పోలీసులు ఇక అలా చెప్పలేరు.. మీ చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం లాంటి చట్టం ఇదే..
What Is Zero Fir
Krishna S
|

Updated on: Oct 24, 2026 | 4:36 PM

Share

నేరం ఎక్కడ జరిగినా బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు చట్టం కల్పించిన గొప్ప ఆయుధం జీరో ఎఫ్‌ఐఆర్. లిమిట్స్ పేరుతో పోలీసులు కేసు తీసుకోకపోతే ఏం చేయాలి? జీరో ఎఫ్‌ఐఆర్ ఎలా పనిచేస్తుంది? అనేది చాలా మందికి తెలియదు. ప్రమాదం లేదా తీవ్రమైన నేరం జరిగినప్పుడు సాధారణంగా ఎవరైనా సరే వెంటనే పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో సంఘటన జరిగిన ప్రాంతం కాకుండా సమీపంలోని వేరే పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు, పోలీసులు ‘‘ఈ ప్రాంతం మా పరిధిలోకి రాదు.. సంబంధిత స్టేషన్‌కు వెళ్లండి’’ అంటూ బాధితులను తిప్పి పంపుతుంటారు. దీనివల్ల బాధితులకు న్యాయం జరగడం ఆలస్యం కావడమే కాకుండా కీలకమైన ఆధారాలు చేజారిపోయే ప్రమాదం ఉంటుంది. పోలీసుల ఈ అధికార పరిధి సమస్యకు చెక్ పెడుతూ, బాధితులకు తక్షణ రక్షణ, సహాయం అందించేందుకు ఉద్దేశించిందే జీరో ఎఫ్‌ఐఆర్.

అసలు జీరో ఎఫ్‌ఐఆర్ అంటే ఏమిటి?

సాధారణంగా ఏదైనా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనప్పుడు దానికి ఒక క్రమ సంఖ్య కేటాయిస్తారు. కానీ సంఘటన తమ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగకపోయినా బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకుని నమోదు చేసే ప్రాథమిక నివేదికనే జీరో ఎఫ్‌ఐఆర్ అంటారు. ఇది తమ అధికారిక పరిధిలోని కేసు కాదు కాబట్టి దీనికి ఎలాంటి సీరియల్ నంబర్ ఇవ్వకుండా క్రైమ్ నంబర్ స్థానంలో ‘0’ అని నమోదు చేస్తారు. అందుకే దీనికి జీరో ఎఫ్‌ఐఆర్ అనే పేరు వచ్చింది.

ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? దీని నేపథ్యమేంటి?

2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన తర్వాత ఏర్పాటైన జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. క్రిమినల్ లా అమెండ్‌మెంట్ యాక్ట్ ద్వారా జీరో ఎఫ్‌ఐఆర్‌కు చట్టబద్ధమైన గుర్తింపు లభించింది. కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం కూడా నేరం జరిగిన ప్రదేశంతో సంబంధం లేకుండా సమీపంలోని ఏ స్టేషన్‌లోనైనా ప్రాథమిక సమాచారం నమోదు చేయవచ్చని చట్టం స్పష్టం చేస్తోంది.

ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం..

మీరు హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణిస్తున్నప్పుడు జాతీయ రహదారిపై ఏదైనా ఊరి శివార్లలో దోపిడీ లేదా రోడ్డు ప్రమాదం జరిగిందనుకుందాం. తీవ్రమైన గాయాలు లేదా భయంతో ఉన్న ఆ సమయంలో ఆ ప్రాంతం ఏ మండల పరిధిలోకి వస్తుంది? ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది? అని వెతుక్కోవడం సాధ్యం కాదు. లాంటి అత్యవసర పరిస్థితుల్లో మీరు వెంటనే హైవే పక్కన కనిపించే సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. ‘‘ప్రదేశం మా పరిధిలోకి రాదు’’ని పోలీసులు చెప్పడానికి చట్టపరంగా వీల్లేదు. వారు వెంటనే జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, తక్షణ సహాయం అందించాలి.

జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు తర్వాత పోలీసులు ఏం చేస్తారు?

ప్రాథమిక సహాయం – ఆధారాల సేకరణ: జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగానే పోలీసులు తక్షణమే స్పందించి బాధితులకు వైద్య సహాయం అందించడం, సంఘటనా స్థలంలో కీలక ఆధారాలు ధ్వంసం కాకుండా చూడటం వంటి అత్యవసర చర్యలు చేపడతారు.

ఫైల్ బదిలీ: ప్రాథమిక వివరాలు తీసుకున్న తర్వాత ఆ ఎఫ్‌ఐఆర్‌తో పాటు సేకరించిన పత్రాలను అసలు నేరం జరిగిన ప్రాంత పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు అధికారికంగా బదిలీ చేస్తారు.

రెగ్యులర్ ఎఫ్‌ఐఆర్ నమోదు: సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు ఆ పత్రాలను స్వీకరించి, దానికి రెగ్యులర్ క్రైమ్ నంబర్‌ను కేటాయించి అసలు దర్యాప్తును వేగవంతం చేస్తారు.

పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరిస్తే?

చట్టం ప్రకారం తీవ్రమైన నేరం జరిగినప్పుడు ఏ పోలీస్ అధికారైనా అధికార పరిధి పేరుతో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరిస్తే, అది చట్టవిరుద్ధం. భారత న్యాయ సంహిత ప్రకారం డ్యూటీ నిర్వర్తించని అధికారులపై క్రమశిక్షణా చర్యలతో పాటు న్యాయపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. పోలీసులు నిరాకరిస్తే వెంటనే సీనియర్ పోలీసు అధికారులుకు లిఖితపూర్వకంగా లేదా ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసే హక్కు పౌరులకు ఉంది.

ఆపద సమయంలో సమయం ఎంతో విలువైంది. అధికార పరిధి అడ్డంకుల వల్ల బాధితులకు అన్యాయం జరగకూడదన్నదే జీరో ఎఫ్‌ఐఆర్ ముఖ్య ఉద్దేశం. ప్రతి పౌరుడు తమకున్న ఈ చట్టపరమైన హక్కుపై అవగాహన పెంచుకుంటే ఆపత్కాలంలో ధైర్యంగా న్యాయం పొందవచ్చు.

Follow Us