2020లో కోవిడ్ మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని స్తంభింపజేసిన విషయం తలుచుకుంటే ఇప్పటికే ఆ భయానక జ్ఞాపకాలు వెంటాడుతాయి. ఇక కరోనా సెకండ్ వేవ్‌లో అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఎక్కడ చూసినా కరోనా మృతులే..! అంతిమ సంస్కారాలు కూడా చేయలేక మృతదేహాలను గుట్టలు గుట్టలుగా వేసి దహనాలు, ఖననాలు చేసిన పరిస్థితి. ఒకానొక దశలో కుటుంబ సభ్యులు కూడా అంతిమ సంస్కార కార్యక్రమంలో పాల్గొనేందుకు సైతం భయపడ్డారు. ఇక ఆస్పత్రుల్లో అయితే శ్వాస తీసుకోలేక లక్షలాది మంది కరోనా బాధితులు నరకయాతన అనుభవించారు. ఆక్సిజన్ సిలెండర్లు తీవ్ర కొరత.. ఆస్పత్రుల్లో బెడ్లు లేవు.. ఉన్నా ఆక్సిజెన్ అందక ఎంతో మంది చనిపోయారు. ఆనాటి జ్ఞాపకాలను తలుచుకుంటే, గుండె చెమ్మగిళ్ళక మానదు.
అలాంటి సందర్భంలో ఒక్క వ్యక్తి నేనున్నానంటూ ముందుకు వచ్చారు. ఆయుర్వేద వైద్యంతో కోవిడ్‌ను మటుమాయం చేస్తానని శపథం చేశారు. కోవిడ్ నివారణకు ఉచితంగా మందు పంపిణీ చేశారు. అందులో వివిధ రకాల ఔషధాలను అందజేశారు. కోవిడ్ వచ్చిన వారికి తగ్గడం కోసం.. కోవిడ్ వచ్చి తీవ్రంగా బాధపడుతున్నవారికి, అసలు కరోనా పూర్తిగా రాకుండా ఉండేందుకు ఇలా రకరకాల మందులను స్వయంగా తయారు చేసి పంపిణీ చేశారు.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం స్వస్థలమైన ఆనందయ్య అదే గ్రామంలో మందు పంపిణీ మొదలుపెట్టారు. ఈ విషయం పరిసర గ్రామాలకు తాకడంతో ఆనందయ్య మందు ద్వారా కరోనా రావడం లేదు, ఒకవేళ వచ్చిన వెంటనే నయమవుతుందని ప్రచారం మొదలైంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కరోనా మందు కోసం ప్రజలు క్యూ కట్టారు. ఆనందయ్య ముందు కోసం వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. మీడియా ద్వారా దేశం నలుమూలల పాకింది. దీంతో ఆయన మందుకోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా విజ్ఞప్తులు రావడంతో అందరికీ మందు సరఫరా చేయలేని పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వం కూడా మందు పంపిణీకి అనుమతులు ఇచ్చింది
అయితే రాష్ట్రంలో ఆయా నియోజకవర్గాలకు మందు సరఫరా చేయాలని స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు ఆనందయ్య చుట్టూ క్యూ కట్టారు. పేరు మోసిన బడా పారిశ్రామికవేత్తలు సైతం ఆనందయ్య మందు కోసం కృష్ణపట్నం రావడం మొదలుపెట్టారు. మంత్రులు పారిశ్రామికవేత్తలను కలవడానికి సైతం ఆనందయ్యకు సమయం లేని పరిస్థితి. కరోనా రాకుండా వచ్చినవారికి నయం అయ్యేందుకు ఆనందయ్య ఇచ్చే మందు కంటే ఐసీయూలో ఉంటూ ఊపిరి తీసుకోలేని బాధితులకు ఐ డ్రాప్స్ ఆనందయ్య తయారు చేయడంతో వాటికోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో మంత్రులు తమ పలుకుబడితో ఆనందయ్య తో ప్రత్యేకంగా చేయించి తమకు కావలసిన వారికి పంపిణీ చేశారు.
కరోనా మందు పంపిణీకి ముందు ఆనందయ్య కృష్ణపట్నం మాజీ సర్పంచ్ అంతకుమించి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. కానీ మందు పంపిన తర్వాత విపరీతమైన గుర్తింపు రావడంతో ఎప్పుడూ లేనంత, ఎవరి ఎవరూ లేనంత బిజీ అయిపోయారు. కరోనా ఆనందంగా పేరు తెచ్చుకున్న ఆ తర్వాత కొద్ది రోజులకే రాజకీయాల వైపు మొగ్గు చూపారు. దేశవ్యాప్తంగా బీసీలందరినీ ఏకం చేస్తూ బీసీ నేతలు అంతా కలిసి ఒక రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఆ పార్టీ ఆనందయ్య లీడ్ చేసే విధంగా ఏర్పాట్లు జరిగాయి.
అప్పటివరకు ఆనందయ్య పేరు బలంగా వినిపించింది. కోవిడ్ థర్డ్ వేవ్ కోసం తాను మందు తయారు చేశానని, కోవిడ్ థర్డ్ వేవ్ ఆ మందు తీసుకుంటే రాదని సవాల్ చేయడంతో మెల్లగా ఆయనకున్న డిమాండ్ తగ్గుతూ వచ్చింది. తర్వాత రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రయత్నాలు కూడా సన్నగిల్లాయి. ఆ తర్వాత ఆనందయ్య పేరు ఎక్కడ పెద్దగా వినిపించలేదు. ఇటీవల ఎన్నికలకు ముందు గతంలో వైసీపీలో ఉన్న ఆనందయ్య టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. కరోనా మందు పంపిణీ సమయంలో ఆనందయ్యకు ఎమ్మెల్సీ ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. ఆ తర్వాత ఎక్కడ ఆయన పేరు పెద్దగా వినపడలేదు. కానీ కరోనా పేరు చెప్పగానే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆనందయ్య పేరు కచ్చితంగా గుర్తు రావడం ఖాయం..!
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..