చెస్ బాక్సింగ్‌లో పసిడి పట్టేసిన తెలంగాణ యువతి.. 8 రకాల యుద్ధ విద్యల్లో నైపుణ్యం ఈమె సొంతం

|

Nov 23, 2023 | 12:44 PM

గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన ప్రతిభ తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులు. వాస్తవానికి ప్రతిభ ఆటలవైపు ఆసక్తి కనబరచడం.. క్రీడాకారిణిగా ఎదగడానికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో తన  అభిరుచిని అనుసరించాలని నిర్ణయించుకున్న ప్రతిభ తన తల్లిదండ్రులకు చెప్పకుండా కరాటేలో శిక్షణ పొందేందుకు పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు చేరింది. తన చిన్నతనంలో మైక్ టైసన్ వీడియోలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని..మార్షల్ ఆర్ట్స్ పట్ల మక్కువ పెంచుకున్నట్లు ప్రతిభ చెప్పింది.

చెస్ బాక్సింగ్‌లో పసిడి పట్టేసిన తెలంగాణ యువతి.. 8 రకాల యుద్ధ విద్యల్లో నైపుణ్యం ఈమె సొంతం
Pratibha Thakkadpally
Follow us on

గత కొంతకాలంగా క్రీడల పట్ల మక్కువ పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా క్రీడా కుసుమాలు వికసిస్తున్నాయి. అరుదైన క్రీడల్లో విదేశాల్లో సైతం ప్రతిభ కనబరుస్తూ భారత దేశ ఖ్యాతిని పెంచుతున్నారు. అంతర్జాతీయ క్రీడారంగంలో పతకాలు సాధిస్తూ రికార్డ్ సృష్టిస్తున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ప్రతిభా తక్కడపల్లి అనే యువతి ఇటీవల ఇటలీలో జరిగిన 5వ చెస్ బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరుస్తూ..  అంతర్జాతీయస్థాయిలో బంగారు పతకాలను సాధించిన ఏకైక భారతీయురాలిగా పేరు తెచ్చుకుంది. చెస్ బాక్సింగ్ అంటే.. చదరంగం బాక్సింగ్‌లను మిళితం చేసిన క్రీడ. ఈ పోటీలో పాల్గొనేవారు రెండింటిలోనూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలి.

కామారెడ్డిలోని పిట్లంకు చెందిన 28 ఏళ్ల ప్రతిభ ఎనిమిది రకాల పోరాట క్రీడల్లో శిక్షణ పొందింది. చెస్ బాక్సింగ్‌లో రెండు స్వర్ణాలు సాధించడమే కాదు కిక్‌బాక్సింగ్, టైక్వాండో, ముయే థాయ్, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో నాలుగు అంతర్జాతీయ బంగారు పతకాలను గెలుచుకుంది. ఇప్పటి వరకూ ప్రతిభ 14 జాతీయ బంగారు పతకాలు, రెండు అంతర్జాతీయ రజత పతకాలను కూడా గెలుచుకుంది.

గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన ప్రతిభ తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులు. వాస్తవానికి ప్రతిభ ఆటలవైపు ఆసక్తి కనబరచడం.. క్రీడాకారిణిగా ఎదగడానికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో తన  అభిరుచిని అనుసరించాలని నిర్ణయించుకున్న ప్రతిభ తన తల్లిదండ్రులకు చెప్పకుండా కరాటేలో శిక్షణ పొందేందుకు పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు చేరింది.

ఇవి కూడా చదవండి

తన చిన్నతనంలో మైక్ టైసన్ వీడియోలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని..మార్షల్ ఆర్ట్స్ పట్ల మక్కువ పెంచుకున్నట్లు ప్రతిభ చెప్పింది. అయితే పల్లెటూరిలో అమ్మాయిలకు ఆంక్షలు ఎక్కువ. కనుక తాను క్రీడాకారిణిగా ఎదగడానికి ఆ ఆంక్షలను దాటి రావడానికి చాలా కష్టపడినట్లు పేర్కొంది. తాను  సామాజిక అంచనాలకు మించి ఎదగాలని నిర్ణయించుకున్నానని వెల్లడించింది.

కోచ్ సలహాను అనుసరించిన ప్రతిభ కిక్‌బాక్సింగ్‌లో శిక్షణ పొందింది. తరువాత టైక్వాండో, ముయే థాయ్, MMA, BJJ (గ్రాప్లింగ్), చెస్ బాక్సింగ్, వుషు, సిలంబమ్‌ల్లో శిక్షణ తీసుకుంది. అంతేకాదు ప్రతిభ టైక్వాండోలో బ్లాక్ బెల్ట్ హోల్డర్ కూడా.

ఓ వైపు JNTUలో MBA చదువుతూనే మరోవైపు క్రీడల్లో శిక్షణ పొందడంతో పాటు వ్యాపార డెవలపర్‌గా పార్ట్‌టైమ్ ఉద్యోగంకూడా చేసేది. ప్రస్తుతం ప్రతిభ దూరవిద్య ద్వారా సైకాలజీ చదువుతోంది.

గ్రామీణ ప్రాంతాల్లోని యువతులకు ఉచిత శిక్షణ అందించడంలో  ప్రతిభ చేసిన కృషికి  సేవా భారత్ అవార్డు లభించింది. అంతేకాదు వివిధ క్రీడారంగాల్లో అత్యధిక సంఖ్యలో సర్టిఫికేట్‌లను అందుకున్న యువతిగా చరిత్ర చరిత్ర సృష్టించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

సామాజిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న మహిళలందరికీ తన విజయాన్ని అంకితం ఇస్తున్నలు ప్రతిభ చెప్పింది. అంతేకాదు మీ ఇష్టాన్ని .. నెరవేర్చుకునే క్రమంలో ఎవరు ఎంతగా వ్యతిరేకించినా పట్టువదల కుండా కొనసాగిస్తే విజయం సాధిస్తారని చెబుతోంది.

ప్రతిభ తదుపరి ఆటలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి స్పాన్సర్‌ల కోసం వెతుకుతోంది. అంతేకాదు దేశంలో క్రికెట్‌తో పోలిస్తే .. ఇతర  క్రీడలకు ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ కు తగిన గుర్తింపు లేదంటూ నిరాశను వ్యక్తం చేసింది. మార్షల్ ఆర్ట్స్ విభాగాలలో క్రీడాకారులను గుర్తించి, స్పాన్సర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..