Lemons Prices: ఎండలు ముదరడంతో నిమ్మకాయలకి గిరాకీ పెరిగింది. దీంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వాస్తవానికి నిమ్మకాయలకి ఇంత ధర ఎప్పుడు లేదని అమ్మకందారులు చెబుతున్నారు. ముంబైలోని దాదర్ సబ్జీ మండిలో నాణ్యమైన నిమ్మకాయ ధర ఒక్కోటి పది రూపాయలు పలుకుతోంది. ప్రస్తుతం ముంబై మార్కెట్లలో కిలో నిమ్మకాయ ధర నాణ్యతను బట్టి రూ.150 నుంచి 220 వరకు పలుకుతోంది. అసలు మార్కెట్‌లో నాణ్యమైన నిమ్మకాయలు కనిపించే పరిస్థితి లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా వేసవిలో నిమ్మకాయలకు డిమాండ్ పెరుగుతుంది. కానీ మరీ ఇంతగా ఎప్పుడు లేదని చెబుతున్నారు. ఉత్పత్తి తగ్గడంలో నిమ్మకాయలకి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ధరలు పెరిగిపోయాయి.
ఎండాకాలంలో వేడి నుంచి తప్పించుకోవడానికి ప్రజలు నిమ్మరసం ఎక్కువగా తాగుతారు. ఎందుకంటే నిమ్మరసం ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. విటమిన్-సికి మంచి మూలం. మహారాష్ట్ర, రాజస్థాన్, ఎంపీ, ఆంధ్రప్రదేశ్, బీహార్, హర్యానా రాష్ట్రాల్లో నిమ్మకాయల ఉత్పత్తి ఎక్కువగా ఉంది. కానీ ఈసారి అకాల వర్షాలు, వాతావరణ మార్పులకు సంబంధించిన సమస్యల కారణంగా ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది. దీంతో ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు ఉత్పత్తి తక్కువగా ఉండడంతో వేసవిలో వీటి ధర ఎక్కువగానే ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.
ముంబైలోని దాదర్ మండిలో నిమ్మకాయ ధర వింటే కొనుగోలు దారులు ఆశ్చర్యపోతున్నారు. గతంలో మూడు నిమ్మకాయలు రూ.10కి లభించేవి. కానీ నేడు రూ.10కి ఒక్క నిమ్మకాయ లభిస్తుంది. గతంలో కిలో 70 నుంచి 80 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఆ ధర మూడు రెట్లు పెరిగింది. మరోవైపు పండ్లు, కూరగాయల ధరలు కూడా చాలా ఖరీదైనవిగా మారాయి. కొనాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే.
కానీ రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి. నిమ్మ సాగులో మహారాష్ట్ర చాలా ముందుంది. నిమ్మతోటలు ఒక్కసారి నాటితే మూడు దశాబ్దాల పాటు ఫలాలు అందుతాయని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మూడేళ్ల తర్వాత పండ్లు రావడం ప్రారంభమవుతాయి. ప్రతి సంవత్సరం వేసవిలో దీని ధర పెరుగుతుంది. అయితే ఈసారి నిమ్మరైతులు బాగానే సొమ్ము చేసుకుంటున్నారు.