కల్తీ లేని అమ్మ ప్రేమలో కూడా మార్పులు వచ్చాయి అనేందుకు ఈ ఘటననే నిదర్శనం. మానవత్వం మరచిన ఓ మహిళ పేగు తెంచుకు పుట్టిన శిశువును చెత్త కుప్ప లో పడేసింది. ఆ తల్లికి భారమైన ఆ చిన్నారిని పోలీసులు అక్కున చేర్చుకుని తన పెద్ద మనసు చాటుకున్నారు. మాతృత్వం సిగ్గుపడేలా చేసిన ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో వెలుగు చేసింది.
మానవత్వం సిగ్గుపడేలా పలు ప్రాంతాలలో కొన్ని ఘటనలు వెలుగు చూస్తునే ఉన్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. లైఫ్ లైన్ ఆసుపత్రి వద్ద ఉన్న చెత్త కుప్పలో అప్పుడే పుట్టిన మగ శిశువును వదిలి వెళ్ళింది ఓ మహా తల్లీ..! అయితే అదృష్టవశాత్తు ఆ పసికందు మాత్రం క్షేమంగానే బయటపడింది.
ఫిబ్రవరి 14వ తేదీ బుధవారం రాత్రి సుమారు 2 గంటల సమయంలో చెత్త కుప్పలో నుంచి పసికందు ఏడుపులు వినిపించాయి. దీంతో అక్కడ ఉన్న స్థానికులు వెళ్లి చూడగా అప్పుడే పుట్టిన మగ శిశువు కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీస్ ఇన్స్‌పెక్టర్ గురునాథ్ ఆదేశాల మేరకు ఏఎస్ఐ వెంకటేష్ బృందం ఘటన స్థలానికి చేరుకుని చిన్నారి బాలుడిని అక్కున చేర్చుకుంది. పసికందును బయటికి తీసి చూడగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కనిపించాడు.
అదృష్టవశాత్తు ఆ పసికందు క్షేమంగానే ఉండడంతో మెరుగైన వైద్య చికిత్స అందించడం కోసం 108 అంబులెన్స్ ద్వారా శిశువును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నవ మాసాలు మోసిన కన్నపేగును కసాయి తల్లి అప్పుడే పుట్టిన శిశువును ఎలా చెత్త కుప్పలో పడేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శిశు వు తల్లిదండ్రుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…