
Geminids Meteor shower 2022: ఆకాశంలో ఇవాళ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ ఏడాదిలో చివరి ఉల్కాపాతం భూమికి అత్యంత సమీపంగా రానుంది. ఈ నెల 4వ తేదీ నుంచి ఆకాశంలో కనిపిస్తున్న ‘జెమినిడ్స్’ ఉల్కాపాతం ఇవాళ రాత్రి గరిష్ఠస్థాయికి చేరుకోనుంది. గరిష్ఠంగా గంటకు 150 ఉల్కలతో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. జెమినిడ్స్ ఉల్కాపాతం శిథిలాలు సెకనుకు 70 కిలోమీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశించనున్నాయి. ఈ సమయంలో ఉల్కలు మండిపోతూ మరింత ప్రకాశంగా కనిపించనున్నాయి. వీటిని టెలిస్కోప్ లేకుండానే వీక్షించే అవకాశం ఉందని, భూమిమీద ఎక్కడినుంచైనా వీక్షించొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆకాశంలో కనిపించే జెమినిడ్స్ ను ప్రత్యేక్షంగా చూసినా ఎలాంటి ముప్పు ఉండదంటున్నారు.
ఈరోజు సాయంత్రం 6గంటల 30 నిమిషాలకు ఉల్కాపాతం గరిష్ఠ స్థాయిని చేరుకొంటుందని, రాత్రి 9 గంటలకు దీన్ని మరింత స్పష్టంగా వీక్షించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఆకాశంలో ఈ మహాద్భుతాన్ని వీక్షించే అవకాశాన్ని ఎవరూ మిస్ చేసుకొవద్దని సైంటిస్టులు సూచిస్తున్నారు.
రాత్రి 9 గంటల తర్వాత ఆకాశంలో కాంతులు వెదజల్లుతూ జెమినిడ్స్ ఉల్కాపాతం జరగబోతున్నట్లు ప్లానెటరీ సొసైటీ, ఇండియా వ్యవస్థాపక కార్యదర్శి, డైరెక్టర్ ఎస్.రఘునందన్‌రావు మీడియాకు దీన్ని మామూలు కంటితోనే చూడొచ్చని తెలిపారు.
రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో ఈశాన్యం, తూర్పు వైపు, అర్ధరాత్రిలో ఆకాశం నడినెత్తిన.. సూర్యోదయానికి ముందు పడమర వైపు చూడవచ్చని వెల్లడించారు. ఇలా డిసెంబరు 17 వరకు ఉల్కపాతాలు కనిపిస్తాయన్నారు. ఈ రోజులానే రేపు కూడా వీక్షించవచ్చని పేర్కొన్నారు.
పౌర్ణమి తర్వాత ఏర్పడుతుండటంతో గంటకు 150కి పైగా మెరుపులు వస్తాయని.. మనం 30-40 మాత్రమే చూడగలుగుతామని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం..