Praising Children: తల్లిదండ్రులు తరచుగా పిల్లలను ప్రశంసిస్తూ ఉంటారు. పిల్లలు చేసే కొన్ని పనుల్లో మెచ్చుకుంటుంటాము. అయితే, పిల్లలను అతిగా ప్రశంసించడం వారి అభివృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఎక్కువగా ప్రశంసించడం పిల్లలకు ప్రాణాంతకమే కాకుండా వేధింపులకు గురయ్యేలా చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అతిగా పొగడ్తలు అందుకునే చిన్నారులు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంలో విఫలమవుతారంట. ఈ వాస్తవాలను బ్రిటన్‌లోని ఎక్సెటర్ విశ్వవిద్యాలయం అధ్యయనకారులు ఇటీవల నిర్వహించిన పరిశోధనలో వెల్లడయ్యాయి. 4,500 మంది తల్లిదండ్రులు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. యూనివర్సిటీ సోషల్ మొబిలిటీ డిపార్ట్‌మెంట్ ఎలియట్ మేజర్ ప్రకారం.. సర్వేలో పాల్గొన్న 85 శాతం మంది తల్లిదండ్రులు, తమ పిల్లలను అతిగా ప్రశంసించడం వలన వారి నేర్చుకోవడంపై ప్రతికూల ప్రభావితం చూపినట్లు తెలియదు. వాస్తవానికి చిన్నారుల్లో పొగడ్త వారిలో సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుంది. అయితే, ఇదే సమయంలో అతిగా పొగడటం మాత్రం వారి అభివృద్ధి విషయంలో కొంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఎలియట్ మేజర్ ప్రకారం.. తల్లిదండ్రులు పిల్లల ఎదుట సానుకూల విషయాలను మాట్లాడటం లేదా ప్రశంసిస్తేనే వారిలో సామర్థ్యం పెరుగుతుందని నమ్ముతారు. కానీ అది వారిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుందని గుర్తించలేకపోతున్నారు.
పిల్లలను పొగడడం ముఖ్యమే. ప్రశంస ద్వారా పిల్లలకు కొత్త ఉత్సాహం అందుతుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ప్రశంస పిల్లలకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లల ఎదుగుదలకు ప్రశంసలు ఎంతో సహాయపడతాయి. స్కూల్లో వారి పెర్ఫార్మన్స్ మెరుగవుతుంది. తమపై తాము ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకుంటారు. దీనికి ఓ చిన్న పొగడ్త ఎంతో ఉపయోగపడుతుంది. అలా కాకుండా అతిగా పొగిడితే మాత్రం అది వారిపై దుష్ప్రభావం చూపుతుంది. పిల్లల్ని ప్రశంసించే విషయంలో పరిమితులుంటాయి. ఆరోగ్యకరమైన ప్రశంసకు, అతిగా పొగడడానికి మధ్య ఉన్న బేధాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నప్పుడు మితిమీరిన ప్రశంసల వల్ల పిల్లలపై పడే దుష్ప్రభావం నుంచి వారిని కాపాడుకోవచ్చు. ఏదైనా పనిని సాధించడంలో పిల్లల కృషిని కచ్చితంగా ప్రశంసించి తీరాలి. వారి ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచాలి. చిన్న చిన్న అంశాలకు వారిని ప్రశంసించడం మానండి. మీ ప్రశంస నిజాయితీగా ఉండాలి. సవాళ్ళను ఎదుర్కునే ధైర్యాన్ని పిల్లలకివ్వడం పిల్లలను ప్రశంసించడంలోనున్న ముఖ్య ఉద్దేశ్యం. ప్రశంసని నైపుణ్యంగా పిల్లలపై ప్రయోగిస్తే జీవితాంతం వారికి మీ సపోర్ట్ అందినట్టే. పిల్లలను అతిగా పొగడడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి.
మీ ఆలోచనలకు అనుగుణంగా పిల్లలను తీర్చిదిద్దుకునేందుకు ప్రశంస ఓ సాధనంలా ఉపయోగపడుతుంది. అయితే ఇది షార్ట్ టర్మ్ మాత్రమే. అంటే పిల్లలు ఎప్పుడైతే పెద్దల అంగీకారం కోసం ఎదురు చూస్తారో అప్పటివరకు మాత్రమే ఈ పద్ధ పనిచేస్తుంది. కానీ, అతిగా పొగడడం వల్ల పిల్లలు ప్రతిసారి తల్లిదండ్రులపై ఆధారపడుతూ ఉంటారు. ఈ పద్ధతి వారి మానసిక ఎదుగుదలకు మంచిది కాదు. తరచూ పిల్లల్ని ప్రశంసిస్తూ ఉంటే ప్రతి దానికి వారు మీ నుంచి ప్రశంసలని ఆశిస్తూనే ఉంటారు. ప్రతి చిన్న విషయంపై మీ మీద ఆధారపడి మీ అంగీకారం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. తమదైన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను వారికి వారే పోగొట్టుకుంటారు. ఆత్మ విశ్వాస లోపంతో మీ మీద ఆధారపడేలా తయారవుతారు. కాబట్టి ప్రశంసించే ముందు ఆలోచించండి.
పిల్లల పనులకు చిన్న చిన్న బహుమతులు ఇవ్వాలే కానీ, వారు చేసే పనులని ఆధారంగా తీసుకుని జడ్జ్ చేయకండి. తల్లిదండ్రులు తరచూ వాడే ‘మంచి పని చేసావు’ అనే ప్రశంసపై ఎన్నో వాదనలు జరిగాయి. ‘మంచి పని’ అనేది జడ్జ్‌మెంట్‌గా మారుతుంది కాని ప్రశంసగా మాత్రం కాదు. ఇటువంటి మాటలు పిల్లల చిన్న చిన్న ఆనందాలని హరిస్తాయి. పిల్లలను అతిగా పొగడకూడదు లేదా ప్రశంసించకూడదు అనేందుకు ఇది ఒక కారణం. ఒక వ్యక్తిని తను చేసిన ఏదైనా పని గురించి పొగిడితే ఆ వ్యక్తి తన పనిపై ఆసక్తి పోగొట్టుకుంటాడని అధ్యయనాలలో తేలింది. ఇదే అంశం పిల్లలకూ వర్తిస్తుంది. పిల్లలని అతిగా ప్రశంసించే ముందు ఆ ప్రశంస పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపబోతుంది అనే దానిపై కొంచెం ఆలోచించాలని అంటున్నారు పరిశోధకులు.