Dog at Home: ఇంట్లో కుక్కను పెంచుకుంటే ఎలాంటి నిబంధనలు పాటించాలో తెలుసా..?

| Edited By: Balaraju Goud

Nov 30, 2024 | 11:41 AM

కుక్కలపై ఇంత శ్రద్ధ చూపుతున్న వారిలో చాలామంది వాటి వివరాలను మాత్రం జీహెచ్ఎంసీ లో రిజిస్ట్రేషన్ చేసుకుని లైసెన్సులు తీసుకోవడం లేదు.

Dog at Home: ఇంట్లో కుక్కను పెంచుకుంటే ఎలాంటి నిబంధనలు పాటించాలో తెలుసా..?
Dog
Follow us on

గ్రేటర్ హైదరాబాద్‌లో జంతువులను ప్రాణంగా పెంచుకునే జంతు ప్రేమికులు చాలా మంది ఉన్నారు. కుక్కలు, పిల్లులు, బాతులు తదితర జంతువులు, పక్షులను పెంచుకునేవారు ఎందరో ఉన్నారు. వీరిలో డాగ్ లవర్సే అధికంగా ఉన్నారు. పెంపుడు కుక్కలను కుటుంబ సభ్యులుగా, అల్లారుముద్దుగా పెంచుతూ, బర్త్‌డేలు ఇతర ఫంక్షన్లు సైతం నిర్వహిస్తుంటారు. వాటిని కన్నబిడ్డలతో సమానంగా చూసుకుంటూ ఉంటారు.

అయితే కుక్కలపై ఇంత శ్రద్ధ చూపుతున్న వారిలో చాలామంది వాటి వివరాలను మాత్రం జీహెచ్ఎంసీ లో రిజిస్ట్రేషన్ చేసుకుని లైసెన్సులు తీసుకోవడం లేదు. గతంలో ఇందుకు లైసెన్సు ఫీజు ఉన్నప్పటికీ.. ఎక్కువ మందిని ఆకర్షించేందుకు ఉచిత రిజిస్ట్రేషన్ అవకాశాన్ని కూడా జీహెచ్ఎంసీ కల్పించింది. అంతే కాకుండా జీహెచ్ఎంసీ కార్యాలయాల దాకా వెళ్లనవసరం లేకుండా ఆన్లైన్లోనే పొందే సదుపాయం కల్పించినా ప్రజల నుంచి స్పందన కరువైంది.

గ్రేటర్ హైదరాబాదులో దాదాపు 1.50 లక్షల వరకు పెంపుడు కుక్కలుంటాయని అధికారుల అంచనా. వీరిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారు 11 వేలు కూడా దాటలేదు. అంటే.. పది శాతం కూడా లేరు. పెంపుడు పిల్లులను రిజిస్ట్రేషన్ చేసి, లైసెన్సులు పొందినవారు 520 మంది ఉండగా, ఇతర జంతువులు, పక్షులను నమోదు చేసుకున్నవారు 314 మంది ఉన్నారు. జీహెచ్ఎంసీ చట్టం నిబంధనల మేరకు పెంపుడు కుక్కలను కలిగిన వారు వాటి వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.

నిర్ణీత వ్యవధుల్లో టీకాలు ఇప్పించాలి. డీవార్మింగ్ చేయించాలి. రిజిస్ట్రేషన్ చేయించుకుంటే పొరపాటున పెంపుడు కుక్కలు తప్పిపోతే యజమానిని గుర్తించేందుకు వీలవుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకుని లైసెన్స్ పొందడం వల్ల చట్టపరమైన యాజమాన్య హక్కు కూడా లభిస్తుందంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న యజమానులకు కుక్కల సంరక్షణకు సంబంధించిన జాగ్రత్తలు, నిర్ణీత వ్యవధుల్లో టీకాలు ఇప్పించడం వంటివాటి గురించి జీహెచ్ఎంసీ మెసేజ్ ల ద్వారా ‘ఆలర్ట్’ చేస్తుంది.

లైసెన్స్ తీసుకున్న కుక్కల యజమానులకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయని జీహెచ్ఎంసీ అధికారులు అంటున్నారు. కుక్కకు తగిన ఆహారం ఇవ్వాలి. చక్కటి వాతావరణంలో ఆశ్రయం కల్పించాలి. వాటిపై క్రూరత్వం చూపొద్దు. వాటి వల్ల ఇతరుల ఆరోగ్యానికి ప్రమాదకర పరిస్థితి ఎదురైతే జీహెచ్ఎంసీ అధికారులు లైసెన్సును రద్దు చేస్తారు. పెంపుడు జంతువుకు మంచి ఆరోగ్యం ఉండేలా చూడాలి. సకాలంలో యాంటీ రేబీస్ టీకాలు, ఇతర రోగనిరోధక టీకాలు వేయించాలి.

మరోవైపు, రిజిస్ట్రేషన్ సందర్భంగా తప్పుడు వివరాలు నమోదు చేస్తే, వాటిని గుర్తించినప్పుడు లైసెన్సు రద్దవుతుంది. పెంపుడు కుక్క బయటకు తీసుకువెళ్లేటప్పుడు వాటి లైసెన్సు (రిజిస్ట్రేషన్)ను యజమానులు వెంట ఉంచుకోవాలి. కుక్కల మెడకు పట్టి ఉంచాలి. బహిరంగ ప్రదేశాల్లో కుక్కకు వదిలిపెట్టరాదు. బహిరంగ ప్రదేశంలో పెంపుడు కుక్కలు మలవి సర్జన చేయకుండా జాగ్రత్త వహించాలి. ఒకవేళ అలా చేస్తే ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచే బాధ్యత ఆ కుక్క యజమానిదే.. అమలులో ఉన్న చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా యజమాని నడుచుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి నిబంధనల వల్లే చాలామంది పెంపుడు కుక్కలను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..