Cross Cultures: ‘ఆ’ దేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారా? ఇవి పాటించకపోతే మీరు ఇబ్బందుల్లో పడడం ఖాయం

విదేశాలకు వెళుతున్నారా? అక్కడి ఆచార వ్యవహారాలను ముందే తెలుసుకోండి. క్రాస్ కల్చర్ సెంటిమెంట్లను గౌరవించండి. ఒక్కో చోట ఒక్కో సెంటిమెంటు.. ఒక్కో నమ్మకం.. తెలుసుకోండి మరి!

Cross Cultures: ‘ఆ’ దేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారా? ఇవి పాటించకపోతే మీరు ఇబ్బందుల్లో పడడం ఖాయం
Rajesh Sharma

|

Feb 04, 2021 | 5:59 PM

Cross culture sentiments across the World: ప్రపంచంలో సుమారు రెండువందల దాకా దేశాలున్నాయి. ఒక్కో దేశానికి ఒక్కో సంస్కృతి. ఒక్కో దేశ ప్రజలకు ఒక్కో రకమైన ఆచారం. కొన్ని సంస్కృతులు, కొన్ని ఆచారాలు, సంప్రదాయాల్లో కొంత మేరకు పోలిక వుండొచ్చు కానీ.. ప్రతీ దేశానికి ఓకే సంస్కృతి, ఒకే ఆచార వ్యవహారాలుండడం అరుదు. మారిన ప్రపంచ పరిస్థితుల కారణంగా ప్రపంచమంతా చిన్న గ్రామంలా మారిపోయింది. పెరిగిన రవాణా సదుపాయాలు.. చేతిలో వుండే మొబైల్ ఫోన్‌లో ప్రపంచంలో ఎక్కడి విషయాలనైనా తెలుసుకునే వెసులుబాటు వెరసి.. ప్రపంచ పర్యాటకుల సంఖ్య ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగిపోయింది. దానికి తోడు గ్లోబలైజేషన్ ప్రాసెస్ విదేశీ ప్రయాణాలను, గమనాలను సునాయాసం చేసేసింది. దాంతో విదేశాలలో పర్యటించే వారి సంఖ్య భారీగా పెరిగింది. అయితే, విదేశాలకు వెళ్ళాలనుకునే వారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని ఆచారాలున్నాయి. ఈ ఆచారాలను తెలుసుకోకుండా ఆ దేశాలకు వెళితే.. మీరు చిక్కుల్లో పడడం ఖాయం.

జపాన్‌లో బిజినెస్ కార్డు సెంటిమెంటు:

పసిఫిక్ మహా సముద్ర తీర దేశమైన జపాన్ దేశీయుల్లో ఓ విచిత్రమైన సెంటిమెంటు వుంది. ఇదే బిజినెస్ కార్డు సెంటిమెంటు. జపనీయులు తమ సొంత వారి ఇళ్ళకో, లేదా పార్టీలు జరిగే స్థలాలకో వెళితే విధిగా తమ బిజినెస్ కార్డులను వెంట తీసుకుని వెళ్ళాల్సి వుంటుంది. అదే విధంగా ఒకరికొరు బిజినెస్ కార్డులు ఇచ్చిపుచ్చుకోవడం వారి సంప్రదాయం. అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం వుంది. అదేంటంటే.. ఒకరు వేరే వారికి తమ బిజినెస్ కార్డు ఇచ్చినపుడు దానిని యధాలాపంగా తీసుకుని తమ జేబుల్లో పెట్టుకుంటే అది కార్డు ఇచ్చిన వారిని అవమానించినట్లుగా జపనీయులు భావిస్తారు. కార్డు తీసుకునే వ్యక్తి దానికి తన రెండు చేతులతో తీసుకుని, ఏదో ఒక కామెంటు ఆ కార్డునుద్దేశించే చేస్తే.. జపనీయులు అవతలి వ్యక్తి తమను గౌరవించినట్లుగా భావిస్తారు. కార్డు బావుందనో.. లెటర్స్ బావున్నాయనో ఏదో ఒక పాజిటివ్ కామెంటుతో కార్డు తీసుకుని జేబులో పెట్టుకుంటే జపనీయులు సంతోషపడతారు.

వియత్నాంలో ‘ఆ’ పని అస్సలు చేయకూడదు:

పోరాట పర్వాలకు పెట్టింది పేరైన వియత్నాం ప్రజల్లో ఓ సెంటిమెంటు వుంది. ఎవరైనా ఎదుటి వ్యక్తి తమ తలపైన చేయి పెడితే వారు దానిని అవమానంగా భావిస్తారు వియత్నమీస్. అదే మన దేశంలో ఎవరైనా తలపైన చేయి పెట్టి నిమిరితే అది వానికి ఓదార్చినట్లుగా భావిస్తారు. కానీ వియత్నంలో వారి సెంటిమెంటు మన విశ్వాసానికి పూర్తిగా వ్యతిరేకం. ఎదుటి వ్యక్తి తమ నెత్తిన చేయిపెడితే దానికి తీరని అవమానంగా ఆ దేశస్థులు భావిస్తారు.

గల్ఫ్ దేశాల్లో తిరస్కారం ఓ అవమానం:

గల్ఫ్ దేశస్థుల్లో ఓ సెంటిమెంటు వార్తల్లో తెగ వైరలవుతోంది. ఎవరైనా తమ ఇంటి వస్తే వారిని అతిథులుగా భావించి.. గల్ఫ్ దేశస్థులు ఏదైనా తినే పదార్థమో, ఏదైనా డ్రింకో ఆఫర్ చేస్తారు. ఇలా వారు ఆఫర్ చేసినపుడు మరో మాట చెప్పకుండా దానికి స్వీకరిస్తే దానిని ఎదుటి వారు తమతో మిత్రత్వాన్ని కోరుకుంటున్నట్లుగా గల్ఫ్ దేశస్థులు విశ్వసిస్తారు. అలా కాకుండా మొహమాటానికి పోయి వద్దు అనడమో లేక తమకు ఇష్టం లేదని చెప్పడమో చేస్తే దానికి వారు అవమానంగా తలుస్తారు. సో.. గల్ఫ్ దేశస్థుల ఇళ్ళకు వెళితే నో అన్న పదాన్ని మరిచిపోవాలి. ఈ మర్యాద పాటించడం తప్పనిసరి.

సౌదీలో ‘అవి’ చూపిస్తే చిక్కే:

గల్ఫ్ దేశాల్లో అత్యంత పవర్ ఫుల్‌గా కనిపించే సౌదీ అరేబియాలో ఎదుటి వారికి తమ పాదాలు కనిపించేలా కూర్చోవడం అవమానకరం. సీటుపైనో లేక సోఫాలోనో కూర్చున్నప్పుడు కాలి మీద కాలు వేసుకును కూర్చోవడం ద్వారా తమ పాదాలను ఎదుటి వారికి చూపిస్తే అది అవమానకరంగా భావిస్తారు సౌదీ దేశస్థులు. ఎక్కడ కూర్చున్నా తమ కాళ్ళను తమ అదుపులో వుంచుకోవడం సౌదీ అరేబియాకు వెళ్ళేవారు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం.

ఈజిప్టులో స్వీట్లే కాని పూవులొద్దు..

ఈజిప్టు దేశాన్ని సందర్శించే వారు అక్కడ స్థానికులు పరిచయమైతే వారింటికి వెళ్ళే ముందు తప్పనిసరిగా గిఫ్టును తీసుకుని వెళ్ళాలి. ఉత్తచేతులతో వెళితే దానిని వారు నెగెటివ్‌గా తీసుకుంటారు. తమతో ఫ్రెండ్షిప్ ఎదుటి వారికి ఇష్టం లేదని వారు భావిస్తారు. అయితే.. గిఫ్టుల్లో స్వీట్లు తీసుకువెళ్ళొచ్చు కానీ.. పూవులను మాత్రం తీసుకువెళ్ళకూడదని చెప్పుకుంటారు. పూవులను చెడు సందర్భాలలో మాత్రమే తీసుకువెళతారని ఈజిప్టు దేశస్థుల అభిప్రాయం. అదే సమయంలో అతిథికి తామెంతో ఇష్టంతో వడ్డించే ఆహార పదార్థాలను అతిథులు ఎంత ఎక్కువగా తింటే అంత ఎక్కువగా వారికి మిత్రత్వం కలుపుకునేందుకు ఉత్సాహం చూపిస్తారు ఈజిప్టు దేశస్థులు. ఈ దేశంలోని వారికి మరో సెంటిమెంటు కూడా వుంది. ఎవరైనా ఎదుటి వారికి గిఫ్టు ఇస్తే.. దానికి అందరి ముందు ఓపెన్ చేసి చూడకూడదు. అతిథులంతా వెళ్ళిన తర్వాత సింగిల్‌గా దానికి ఓపెన్ చేసి చూసుకోవాలి.

రష్యాలో సరి, బేసి సెంటిమెంటు:

అగ్రరాజ్యాలలో ఒకటిగా భావించే రష్యాలో అక్కడి ప్రజలకు ఓ సెంటిమెంటు వుంది. ఎవరైనా ఏదైనా విజయం సాధించినా.. లేక దేనిలోనైనా సక్సెస్ సాధించినా.. వారికి పూవులను అభినందన పూర్వకంగా ఇస్తారు. అయితే.. ఇలా ఇచ్చే పూవుల సంఖ్య తప్పనిసరిగా బేసి సంఖ్యలో అంటే 1, 3, 5, 7 లేదా 9 ఇలా వుండాలన్నమాట. అలా కాకుండా సరి సంఖ్యలో పూవులను బహూకరిస్తే… అది చెడుగా భావిస్తారు. అయితే ఏదైనా చెడు జరిగినపుడు మాత్రమే సరి సంఖ్యలో పూవులను ఇచ్చిపుచ్చుకుంటారు రష్యా దేశస్థులు. అంటే బేసి సంఖ్య సంతోషానికి చిహ్నం.. సరి సంఖ్య చెడుకు ఇండికేషన్‌గా రష్యా దేశస్థులు తలుస్తారు.

యూరప్ ‘అది’ కామన్:

యూరోపియన్ల భోజన అలవాట్లు భిన్నంగా వుంటాయి. మనదేశంలో 99 శాతం మంది కుడి చేతితోనే తింటారు కానీ యూరోపియన్లు మాత్రం రెండు చేతులతో తినడం అత్యంత కామన్. యూరోపియన్ కంట్రీస్‌లో పర్యటించే వారు అక్కడి వారు రెండు చేతులతో తింటూ వుంటే వింతగా మాత్రం చూడొద్దు. మనల్ని అనాగరికులమని అనుకునే ప్రమాదం వుంది. యూరోప్‌లో రెండు చేతులతో స్పూన్లు, ఫోర్కులు పట్టుకుని తినడం అక్కడి అలవాటు. సో.. మనం కుడి చేతితో తింటూ వున్నా వారిని మాత్రం రెండు చేతులతో తింటున్నందుకు వింతగా మాత్రం చూడొద్దన్నమాట.

ఫ్రాన్స్ దేశీయుల్లో ‘ఆ’ సెంటిమెంటు:

ఫ్రెంచ్ దేశస్థులకు ఓ సెంటిమెంటు వుంది. ఎవరైనా తమ ఇంటికి వచ్చినా.. లేదా తామెవరి ఇంటికి వెళ్ళినా.. గిఫ్టు తీసుకువెళ్ళడం ఆనవాయితీ. గిఫ్టు లేకుండా తమ ఇంటికి ఎవరైనా వస్తే దానికి చెడుగా భావిస్తారు ఫ్రెంచ్ దేశస్థులు. సో.. ఫ్రెండ్షిప్ పెంచుకోవాలంటే ఫ్రెంచ్ దేశస్థుల ఇంటికి చేతులూపుకుంటే వెళ్ళే బదులు… ఏదైనా చిన్నదో, పెద్దతో గిఫ్టు తీసుకుని వెళ్ళండి.

కొలంబియాలో ‘పచ్చ’కు బ్రేక్:

కొలంబియా దేశస్థుల్లో పచ్చదనాన్ని ఇచ్చిపుచ్చుకోవడం నిషేధం. పచ్చ అంటే ఆకుపచ్చ కాదు.. పసుపుపచ్చ. ఉదాహరణకు మేరీ గోల్డ్ (బంతిపూలు) ఫ్లవర్స్‌ను కొలంబియా దేశస్థులు ఇచ్చిపుచ్చుకోరు. ఎల్లో కలర్‌లో వున్న పూవులను గానీ, వస్తువులను గానీ ఇచ్చిపుచ్చుకోవడం చెడుకు సంకేతంగా కొలంబియా వారు భావిస్తారు.

అమెరికాలో కన్ను కన్ను కలపాలి:

అగ్రరాజ్యం అమెరికా జాతీయులకు ఓ సెంటిమెంటు వుంది. దీనిని సెంటిమెంటు అనే దానికంటే జాగ్రత్త అనడం బెటరేమో. ఎందుకంటే అమెరికన్లు ఎవరైనా తమకు అతి సన్నిహితంగా వుంటే సహించరు. ముఖ్యంగా వారు దానికి అగౌరవంగాను, అసౌకర్యంగాను ఫీలవుతారు. అపరిచితులు తమకు దూరంగా వుండాలని కోరుకుంటారు అమెరికన్లు. రెస్టారెంట్లు అయినా.. బహిరంగ ప్రదేశాలైనా చివరికి లిఫ్టుల్లో అయినా అమెరికన్లతో కాస్త డిస్టెన్స్ మెయింటేన్ చేస్తే బెటర్. అదే సమయంలో అమెరికన్లు తమతో మాట్లాడే వారు తమతో ఐ కాంటాక్ట్ (కన్నుల్లోకి చూస్తూ)తో మాట్లాడితే ఇష్టపడతారు. వారు చెప్పేది నిజమని భావిస్తారు. కిందకి చూస్తూనే లేక మరో దిక్కుకో చూస్తూనో మాట్లాడితే ఎదుటి వారు చెప్పేది అసత్యమని వారనుకుంటారు. సో.. అమెరికన్లతో మాట్లాడేప్పుడు ఐ కాంటాక్ట్ తప్పనిసరన్నమాట.

విదేశీ పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా అయితే పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటించండి. ఆనందంగా విహరించి రండి. వీలైనంత ఎక్కువ మందితో స్నేహాన్ని కలుపుకుని రండి. అయితే వారి సెంటిమెంట్లను మాత్రం తప్పనిసరిగా గౌరవించండి.

Also Read: చెన్నై చెపాక్ స్టేడియం టీమిండియాకు స్పెషల్.. ఊరిస్తున్న ఆ రికార్డుపై కోహ్లీ సేన కన్ను

Also Read: మయన్మార్‌లో అసలేం జరిగింది? సైనిక తిరుగుబాటు వెనుక రహస్యమేంటి?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu