Mother House Arrest: దారుణం.. ఇంటిలో వివస్త్రగా.. కన్నతల్లిని పదేళ్లు బంధించిన కర్కోటకులు..!
కన్నతల్లిని ఇంట్లో పెట్టి తాళాలు వేసి పదేళ్లుగా హింసించారు. ఎట్టకేలకు విషయం వెలుగులోకి రావడంతో.. ఇద్దరు కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Mother House Arrest in Tamil Nadu: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా కొద్ది మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. అమ్మ లేనిది.. జన్మనే లేదు.. అలాంటిది, కడుపులో నవమాసాలు మోసి పెంచిన కన్నతల్లిని ఆ పిల్లలు బతికి ఉండగానే నరకం చూపించారు. గొప్ప చదువులు చెప్పించి, ప్రయోజకులను చేసినా సంస్కారం మంటగలిచింది. కన్నతల్లిని ఇంట్లో పెట్టి తాళాలు వేసి పదేళ్లుగా హింసించారు. ఎట్టకేలకు విషయం వెలుగులోకి రావడంతో.. ఇద్దరు కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అమానుష ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.
తంజావూర్ జిల్లా కావేరినగర్‌కు చెందిన జ్ఞానజ్యోతి (72)కి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు షణ్ముగసుందరన్ చెన్నైలో ఇన్‌స్పెక్టర్. చిన్న కుమారుడు వెంకటేశన్ కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. పదేళ్ల కిందటే జ్ఞానజ్యోతి భర్త, కుమార్తె మృతి చెందారు. కుమారులు ఆస్తి గొడవల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో తల్లిని పట్టించుకోకుండా పదేళ్ల కిందటే ఆమెను ఓ ఇంట్లో బంధించారు. వారానికోసారి వచ్చి బిస్కెట్లు తెచ్చి గేట్‌లోంచి లోపలికి విసిరేసి వెళ్లేవారు. ఆమె పరిస్థితి చూసి స్థానికులే ఆహారం పెట్టేవారు. ఇటీవల ఈ విషయం గుర్తించిన ఓ సామాజిక కార్యకర్త కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా అధికారులు ఆమెను కాపాడారు.
సాంఘిక సంక్షేమ శాఖ ప్రకారం, 72 ఏళ్ల జ్ఞానజ్యోతి తన ఇంటిలో వివస్త్రగా పడి ఉన్న వీడియోను సోషల్ మీడియాలో చూసిన గుర్తు తెలియని వ్యక్తి నుండి వచ్చిన సమాచారంతో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు వారిని రక్షించారు. ఒక బలహీనమైన పరిస్థితిలో జ్ఞానజ్యోతిని గుర్తించారు. ఆ మహిళను తంజావూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చామని, ఆమె త్వరగా కోలుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యులను కోరామని జిల్లా కలెక్టర్ దినేష్ పొన్‌రాజ్ ఆలివర్ తెలిపారు.
ఆమె కుమారులు తాళం తీయడానికి నిరాకరించడంతో పోలీసుల సహాయంతో సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది శుక్రవారం ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిని రక్షించారు. ప్రస్తుతం ఆమె మానసికస్థితి సరిగా లేదు. చికిత్స కోసం తంజావూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. షణ్ముగసుందరన్, వెంకటేశన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
Read Also…. Artificial Bird: ఇది పక్షి కాదండి బాబు.. పక్షిలాంటిది.. క్రియేటివిటీ అదిరిందికదూ..!