
ఆకాశంలో ఎగురుతున్న పక్షిని నేలపై ఉన్న జంతువు పట్టుకోగలదా? చాలా మందికి ఇది అసాధ్యంగా అనిపించవచ్చు. కానీ ప్రకృతిలో అలాంటి అద్భుతమైన వేటగాడు ఒకటి ఉంది. దాని పేరు కార్కల్ (Caracal). ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా ప్రాంతాల్లో కనిపించే ఈ అడవి పిల్లి జాతి తన అసాధారణ వేట నైపుణ్యాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
కార్కల్‌ను చూసిన వెంటనే అందరి దృష్టిని ఆకర్షించేది దాని చెవులపై ఉండే పొడవాటి నల్లటి వెంట్రుకలు. ఇవి కేవలం అందం కోసం మాత్రమే కాదు. ఇతర జంతువుల కదలికలు, శబ్దాలను మరింత స్పష్టంగా గుర్తించేందుకు ఇవి సహాయపడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కార్కల్.. అత్యంత విశేషమైన లక్షణం దాని దూకుడు. ఇది ఒక్కసారిగా దాదాపు 10 అడుగుల ఎత్తు వరకు గాలిలోకి ఎగరగలదు. ఎగురుతున్న పక్షుల గుంపులోకి దూకి, గాలిలోనే తన పదునైన గోళ్లతో వాటిని పట్టేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఒకే దూకుడులో రెండు లేదా మూడు పక్షులను కూడా కూలదోసినట్లు పరిశోధకులు నమోదు చేశారు.
పక్షులు మాత్రమే కాదు, కుందేళ్లు, ఎలుకలు, చిన్న జింకలు, సరీసృపాలు కూడా దీని ఆహారంలో భాగమే. నిశ్శబ్దంగా వేటాడటం, వేగంగా స్పందించడం, అద్భుతమైన దృష్టి శక్తి కారణంగా కార్కల్ అత్యంత సమర్థవంతమైన వేటగాడిగా గుర్తింపు పొందింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రాచీన కాలంలో భారతదేశం, పర్షియా ప్రాంతాల రాజులు కార్కల్స్‌ను శిక్షణ ఇచ్చి పక్షుల వేట కోసం ఉపయోగించేవారు. వాటి వేగం, చురుకుదనం కారణంగా వీటిని ప్రత్యేకంగా పెంచేవారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
కార్కల్ శరీర పొడవు సాధారణంగా 60 నుంచి 90 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. అయితే దాని వెనుక కాళ్లు చాలా బలంగా ఉండటం వల్ల అసాధారణ ఎత్తుకు దూకగలుగుతుంది. గంటకు 80 కిలోమీటర్ల వరకు వేగంగా పరుగెత్తగల సామర్థ్యం కూడా దీనికి ఉంది. ఇంకో విశేషం ఏమిటంటే, కార్కల్ ఎక్కువగా రాత్రిపూట వేటాడుతుంది. పగటిపూట చెట్లు, పొదల్లో దాక్కొని విశ్రాంతి తీసుకుంటుంది. అందువల్ల దీనిని గుర్తించడం కూడా చాలా కష్టం.
చూడటానికి సాధారణ అడవి పిల్లిలా కనిపించినప్పటికీ, ఆకాశంలో ఎగురుతున్న పక్షులను సైతం గాలిలోనే వేటాడే అద్భుత సామర్థ్యం కార్కల్‌ను ప్రకృతిలోని అత్యంత విశేషమైన వేటగాళ్లలో ఒకటిగా నిలబెట్టింది. ప్రకృతి జీవ వైవిధ్యంలో కార్కల్ ఒక అద్భుతమైన సృష్టి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
పాములకు శత్రువు.. అడవుల యోధుడు.. ముంగిస గురించి ఆసక్తికర విషయాలు