Pullela Gopichand: ఇప్పుడు రోనాల్డో చేసిన పని ఇరవై ఏళ్ల క్రితమే మన పుల్లెల గోపీచంద్ చేశాడు..ఏమిటో తెలుసా?
Pullela Gopichand: డబ్బుకంటే..విలువలకే ప్రాధాన్యం ఇచ్చేవారు చాలా తక్కువ మంది ఉంటారు. సాధారణంగా డబ్బు సంపాదన కోసం ఏదైనా అవకాశం వస్తే చాలా మంది వదులుకోవడానికి ఇష్టపడరు. కొందరు మాత్రమే ఆ పని చేయగలరు.
Pullela Gopichand: డబ్బుకంటే..విలువలకే ప్రాధాన్యం ఇచ్చేవారు చాలా తక్కువ మంది ఉంటారు. సాధారణంగా డబ్బు సంపాదన కోసం ఏదైనా అవకాశం వస్తే చాలా మంది వదులుకోవడానికి ఇష్టపడరు. కొందరు మాత్రమే ఆ పని చేయగలరు. ఎప్పుడూ వారు ప్రజల మనస్సులో నిలిచిపోతారు అందుకే. సెలబ్రిటీలు.. క్రీడాకారులు వీరు ఒక్కసారి పాపులర్ అయితే చాలు వీరి వెనుక కంపెనీలు పడతాయి. ఎందుకంటే.. వారి ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడం కోసం. అయితే, అటువంటి ఉత్పత్తులలో ప్రజలకు ప్రయోజనకారి కానివీ ఉంటాయి. కానీ, కంపెనీలు ఇచ్చే డబ్బు కోసం చాలా మంది ఈ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా ఉంటారు. అయితే, కొందరు మాత్రం అటువంటి వాటి జోలికి ఎన్ని కోట్లు ఇచ్చినా వెళ్లరు. దానివలన తమ జీవితానికి ఎంత లాభం చేకూరుతుందనేది తెలిసినా వాటికి దూరంగానే ఉంటారు. సరిగ్గా ఈ పనే చేశారు మన బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్. అదీ ఇరవై ఏళ్ల క్రితం. అసలు ఆయన ఇరవై ఏళ్ల క్రితం ఏం చేశారు? దానిని ఇప్పుడు ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాము అనేగా మీ అనుమానం.. ఈ స్టోరీ పూర్తిగా చదివితే మీకే తెలుస్తుంది.. ఇంకెందుకు ఆలస్యం..
యూరో కప్ ఫుట్‌బాల్ పోటీల సందర్భంగా పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మంగళవారం విలేకరుల సమావేశంలో తన ముందు ఉంచిన కోకాకోలా బాటిల్‌ను తొలగించి నీరు త్రాగాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో ఒక్కసారిగా ప్రపంచాన్ని కుదిపేసింది. సోషల్ మీడియాలో ఇది ప్రత్యేకంగా నిలిచింది. దీని ప్రభావం ఎంత పడింది అంటే.. కోకాకోలా కంపెనీ మార్కెట్ విలువ ఒక్కరోజులో 29 వేల కోట్ల రూపాయలు తగ్గిపోయింది. ఒక్క స్టార్ ఒక్క మాటతో చేసిన మాయాజాలం అంది. ప్రజలకు చెప్పిన మంచి ఇది. దీంతో రోనాల్డో కు అభినందనల వెల్లువ వస్తోంది. రోనాల్డో ఇది ఏమీ ప్రచారం కోసం చేయలేదు. ఆయన మొదటి నుంచీ ఇటువంటి శీతల పానీయాల వైపు కన్నెత్తి కూడా చూడరు. ఎవరినీ ఇటువంటి పానీయాలు తాగమని ప్రోత్సహించరు. తనకు నచ్చనిది తన ముందు ఉంది. అంతే, ఆయన వెంటనే దానిని తీసేయమని చెప్పారు. పక్కన ఎవరొ ఎదో అంటుంటే.. మంచినీరు తాగాలి అని ప్రజలకు చెప్పారు. అవసరమైన చోట ప్రజలకు మంచిని చెప్పడమే కోట్లాది అభిమానులున్న ఓ క్రీడాకారుడు చేయాల్సిన పని. ఎందుకంటే, అభిమానులు వాళ్ళను అనుసరిస్తారు. వారి ప్రతి అడుగునూ చూస్తూ అందులోనే నడవాలని ప్రయత్నిస్తారు. సరే.. ఇది తాజాగా జరిగింది. కానీ, మన దగ్గర ఇటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది..
అది 2001.. బ్యాడ్మింటన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ అయిన ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ పోటీలు. భారత్ తరుపున తెలుగు వాడైన పుల్లెల గోపీచంద్ అందులో పాల్గొన్నారు. పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచారు. మన దేశం నుంచి ప్రకాష్ పడుకొనే తరువాత ఈ ఘనత సాధించిన రెండో క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్. ఒక్కసారిగా ఆయన స్టార్ అయిపోయారు. ఎందరొ గోపీచంద్ అభిమానులుగా మారిపోయారు. గోపీచంద్ మధ్యతరగతి ప్రజల నుంచి వచ్చినవారు. ఆయనకు స్వంత ఇల్లు కూడా లేదు. అద్దె ఇంట్లో నివాసం ఉండేవారు. ఇదే సమయంలో ఆయన స్టార్ డమ్ ఉపయోగించుకోవాలని 2002 ప్రారంభంలో కోకాకోలా కంపెనీ గోపీచంద్ ను సంప్రదించింది. కోట్లాది రూపాయల ఆఫర్ ఇచ్చింది. తన బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని కోరింది. కానీ..పుల్లెల గోపీచంద్ ఆ ఆఫర్ ను తిరస్కరించారు. ఇటువంటి ఉత్పత్తులకు తాను పనిచేయలేననీ..వాటిని ప్రజలకు తాగమని చెప్పలేనని ఆ భారీ ఆఫర్ వదిలేసుకున్నారు. తను స్వయంగా ఆర్ధికంగా వెనుక బడి ఉన్నా.. ఈ ఆఫర్ తొ కోటీశ్వరుడు అయ్యో అవకాశం ఉన్నా ఆయన తను నమ్మిన ధర్మం కోసం దానిని వదులుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన అన్న మాటలు ఇవీ..”ధూమపానం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని నాకు తెలుసు, అదే విధంగా ఇలాంటి శీతల పానీయాలు తాగడం కూడా చాలా హాని కలిగిస్తుంది. నేను తాగని పానీయం తాగమని పిల్లలను ఎలా ప్రోత్సహించాలి? నేను భవిష్యత్తులో ఈ రకమైన ఉత్పత్తిని ప్రోత్సహించను”. ఈ మాటలు చాలు పుల్లెల గోపీచంద్ వ్యక్తిత్వాన్ని కొలవడానికి. తరువాత ఆయన బ్యాడ్మింటన్ కోచ్ అయ్యారు. దేశానికి ఎంతో మంది అద్భుతమైన బ్యాడ్మింటన్ క్రీడాకారులను అందిస్తున్నారు. పీవీ సింధు, సైనా నెహ్వాల్ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లను ఆయన అందించారు. అందిస్తున్నారు. ఆయన దగ్గర కోచింగ్ తీసుకున్న ఎవరూ కూడా ఇప్పటివరకూ ఇటువంటి శీతల పానీయాల ప్రచారంలో కనిపించలేదు.
గోపీచంద్ లానే.. మన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా శీతల పానీయాలను ప్రోత్సహించరు. తనే స్వయంగా ఇటువంటి డ్రింక్స్ తాగను కాబట్టి ఇతరులు ఎవరినీ తాగమని ప్రోత్సహించాను అని కోహ్లీ చెబుతుంటారు.
Cristiano Ronaldo: ఈ సాఫ్ట్ డ్రింక్ వద్దు.. మంచినీరు తాగండి..! క్రిస్టియానో రొనాల్డో సంచలన ప్రకటన..!