అక్కడ చావు కూడా సంబరమేనా.. అద్భుతం అనిపించేలా మహా ప్రస్థానం..!

| Edited By: Balaraju Goud

Feb 25, 2025 | 3:29 PM

వర్షాకాలం వస్తే గోదావరి ఒడ్డు నీటితో నిండా మునిగి సాధారణం జనం సైతం తమ అయిన వారి అంత్యక్రియలను నడిరోడ్డు పై నిర్వహించుకోవాల్సిన దుస్థితి. అదంతా గతం మరో పది రోజుల్లో ఆ ఆఖరి కష్టాలకు రెడ్ సిగ్నల్ వేసి పర్యావరణ హితంగా ఆకరి మజీలిని అద్భతంగా పూర్తి చేసేలా జిల్లా కేంద్రం లోని గోదావరి తీరాన మహా ప్రస్థానం నిర్మాణం అవుతోంది

అక్కడ చావు కూడా సంబరమేనా.. అద్భుతం అనిపించేలా మహా ప్రస్థానం..!
Mahaprasthanam
Follow us on

దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఆ ప్రాంత వాసుల కల సాకారం కాబోతోంది. పవిత్ర గోదావరి తీరాన.. ప్రకృతి ఒడిలో ఆఖరి మజిలీ ఆవాసం ఏర్పడబోతోంది. అలా ఇలా కాదు చావు‌ కూడా పెళ్లిలాంటిదే బ్రదర్ అన్న ఓ సినీ గేయ రచయిత మాటలను నిజం చేసేలా ఆ జిల్లా కేంద్రంలో ఆఖరి మజిలీ క్షేత్రం రూపుదిద్దుకుంటోంది. ఇన్నాళ్లు నడి రోడ్డుపై అయిన వాళ్ల అంత్యక్రియలు చేస్తూ వెక్కి వెక్కి ఏడ్చిన‌ జనం కంట కన్నీటికి కూడా ఓ విలువనిచ్చేలా ఆఖరి యాత్రకు ఓ స్థానం దక్కబోతుంది. అదే మంచిర్యాల మహా ప్రస్థానం..

మంచిర్యాల జిల్లా సింగరేణి ఖిల్లా పేరుకు పెద్ద పట్టణం.. జిల్లా కేంద్రం కూడా.. కానీ ఈ పట్టణంలో కనీసం చావును కూడా ప్రశాంతంగా సాగనంపే చోటు లేదు. అంత్యక్రియలకు స్థానం లేక నడి రోడ్డుపై తగలడిపోయిన దేహాలు ఎన్నెన్నో .. ఇక ఈ పట్టణంలో పొట్ట చేతపట్టుకుని వచ్చి అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్నా బడుగు జీవుల కుంటుబాల్లో ఎవరైనా కాలం చేస్తే.. వారిని అంత్యక్రియల కు సాగనంపే వరకు ఇంట్లో పెట్టే పరిస్థితి లేక నడిరోడ్డుపైనే రాత్రంతా శవంతో జాగరం చేయాల్సిన‌ దురదృష్ట పరిస్థితులు కోకొల్లలు.

వర్షాకాలం వస్తే గోదావరి ఒడ్డు నీటితో నిండా మునిగి సాధారణం జనం సైతం తమ అయిన వారి అంత్యక్రియలను నడిరోడ్డు పై నిర్వహించుకోవాల్సిన దుస్థితి. అదంతా గతం మరో పది రోజుల్లో ఆ ఆఖరి కష్టాలకు రెడ్ సిగ్నల్ వేసి పర్యావరణ హితంగా ఆకరి మజీలిని అద్భతంగా పూర్తి చేసేలా జిల్లా కేంద్రం లోని గోదావరి తీరాన మహా ప్రస్థానం నిర్మాణం అవుతోంది. నడి రోడ్డుపై కాలిన‌దేహాల సాక్షిగా కరిగిపోయిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు.. ఈ మహా ప్రస్థానాన్ని టాస్క్ గా చేపట్టి పూర్తి చేయడంతో రూపిదిద్దుకుంటోంది మహాప్రస్థానం.

మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులకు చలించిపోయిన ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావుహాప్రస్థానం నిర్మాణాన్ని చాలెంజ్ గా తీసుకోవడంతో మూడు నెలల కాలంలోనే చకచకా ఈ ఆఖరి మజిలీ ధామం నిర్మాణం పూర్తి చేసుకోబోతోంది. గత ఏడాది‌ అక్టోబర్ 3 న మంచిర్యాల పట్టణంలోని గోదావరి నదికి సమీపంలోని నాలుగెకరాల భూదాన్ భూమిని మహాప్రస్థానం నిర్మాణానికి కేటాయించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.4 కోట్లు , ఎఫ్‌డీఎఫ్ నుంచి రూ.42 లక్షలు కేటాయించారు. అయితే మహాప్రస్థాన నిర్మాణానికి ఆ బడ్జెట్ సరిపోక పోవడంతో ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు ఛాలెంజ్ గా తీసుకుని ప్రభుత్వం నుండి అదనంగా మరో 6 కోట్లు ఈ మహా ప్రస్థానానికి తీసుకు‌రాగలిగారు.

మహాప్రస్థానంలోకి స్వాగతం పలుకుతున్నట్టుగా ప్రసన్నవదనంతో కనిపించే ఆ భోళా శంకరుడు శివుడి విగ్రహాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఆఖరి మజిలీలో ఎలాంటి కష్టాలు ఉండకూడదని, వచ్చిన వారందరికీ అన్ని సదుపాయాలు ఉండేలా నిర్మాణాలు చేపడుతున్నారు. ఎనిమిది బర్నింగ్ ప్లాట్ ఫాంలు నిర్మించారు. కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు చూసేలా ఎదురుగా ప్రత్యేకంగా లాన్లు నిర్మిస్తున్నారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా బాత్రూంలు, డ్రెస్సింగ్ రూంలు, కర్మకాండలు చేసుకునేందుకు ప్రత్యేక గదులు, వంట చేసుకునే గదులతో పాటు అతిథి గదులు కడుతున్నారు.

ఈ మహాప్రస్థానంలో ఏదో గదులు నిర్మించామా.. దహన సంస్కారాలు చేసేలా గదులున్నాయా అన్నట్టుగా కాకుండా.. ఆఖరి మజిలీలో ఇక్కడి వచ్చే జనానికి ఆహ్లద కరంగా ఉండేలా పచ్చదనానికి పెద్దపీట వేస్తూ మొక్కలు సైతం నాటుతున్నారు. విద్యుత్ తో కాకుండా పర్యావరణ హితంగా సోలార్ ప్లేట్లు అమర్చి అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. నిత్యం 20 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా‌ మినీ సొలార్ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేస్తున్నారు. అంత్యక్రియలకు హాజరయ్యే కుటుంబ సభ్యులు బంధువులకు సరిపడా గదులు, వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక సౌకర్యం కల్పిస్తున్నారు. కేశఖండనం చేసుకుని అక్కడే గోదావరి జలాలతో స్నానాలు చేసేలా ప్రత్యేక మంచినీటి పైపులైన్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ నెల 26న మహాశివరాత్రి సందర్భంగా ఈ మహాప్రస్థానాన్ని ప్రారంభించాలని ఫిక్స్ అయ్యారు. ప్రారంభానికి రెండు‌వారాల ముందే ఈ నిర్మాణం పూర్తవ్వాలని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఇక ఈ మహాప్రస్థానం నిర్మాణంతో మంచిర్యాల పట్టణంలో అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్న వారికి ఆఖరి కష్టాలు‌ తీరనున్నాయి. సొంతిల్లు లేని వారు మరణిస్తే అద్దె ఇళ్ల వద్దకు మృతదేహాన్ని తీసుకొస్తే అడ్డుకుంటున్న ఇంటి యజమానుల కథలు‌ కొకొల్లలుగా వినిపిస్తున్నాయి. అంబులెన్స్‌లలోనే మృతదేహాలను రాత్రంతా నడి రోడ్డు మీదే ఉంచుకోవాల్సిన దుస్థితి. ఇలాంటి వారికి మంచిర్యాల మహాప్రస్థానం అన్ని రకాలుగా అవసరాలను తీర్చనుంది. అటు‌ సొంతిల్లు ఉన్నవారికీ సైతం కర్మకాండలు నిర్వహించేందుకు సరైన వసతులు లేకపోవడం ఇబ్బంది పడక తప్పడం లేదా. అలాంటి వారికి మంచిర్యాల మహా ప్రస్థానం ఓ వరంలా నిలవబోతోంది.

గత ఆరేళ్లుగా ఏటా వానాకాలంలో గోదావరి నది ఒడ్డున మృతదేహాలను ఖననం చేసేందుకు స్థలం లేక.. వరద అడ్డంకిగా మారడంతో నడి రోడ్డు పై వర్షం లోనే అయిన వారి అంత్యక్రియలు నిర్వహించిన వారికి మంచిర్యాల మహాప్రస్థానం శివరాత్రి నుండి భోళా శంకరుడి ఆవాసంగా కన్నీటి కష్టాలను తీర్చబోతోంది. మహాప్రస్థానానికి‌ వచ్చే ఏ వ్యక్తి అయినా.. అయినవారి బాధను కాసింతైనా తగ్గించుకునేలా ప్రశాంతతో నిండిన మనసుతో ఇంటి దారి పట్టేలా మహా ప్రస్థాన నిర్మాణం సాగుతుంది. చుట్టూ పచ్చని‌ ప్రకృతితో వేసవి కాలంలో సూర్య తాపాన్ని తగ్గించేలా ఏర్పాట్లు.. చిన్నారులు సైతం మహాప్రస్థానంలో కాసేపు‌ సేదతీరేలా గార్డెన్ ఏరియా.. గ్రీనరీకి కేరాప్ అడ్రస్ గా నిలిచేలా సోలార్ విద్యుత్ వినియోగం ఇలా ఒక్కటేమిటి అన్నీ అద్బుతం అనేలా ఆఖరి మజిలీ దామం నిర్మాణం జరుగుతోంది. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వేళ ఘనంగా ప్రారంభమై అందుబాటులోకి రాబోతున్న ఈ మహాప్రస్థానం తో ఇక మంచిర్యాల పట్టణ వాసుల స్మశాన కష్టాలు తీరినట్టే..!

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..