World Lung Day 2022: మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉన్నాయా? ఈ 5 లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..

|

Sep 25, 2022 | 5:04 PM

World Lung Day 2022: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా సెప్టెంబర్ 25ని ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవంగా నిర్వహిస్తారు. ఈ రోజున ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది.

World Lung Day 2022: మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉన్నాయా? ఈ 5 లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..
Lungs
Follow us on

World Lung Day 2022: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా సెప్టెంబర్ 25ని ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవంగా నిర్వహిస్తారు. ఈ రోజున ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. క్యాన్సర్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), ట్యూబర్‌క్యులోసిస్ (TB), ఆస్తమా, అలర్జిక్ రినిటిస్ ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ సమస్యలు మన దేశ ప్రజల్లో సర్వసాధారణం అయ్యాయి. అయితే, ఈ సమస్యల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇస్తున్నారు నిపుణులు. చాలా మంది ఊపిరితిత్తుల సమస్యలు, దగ్గును పెద్దగా పట్టించుకోరు. ఎలాంటి చికిత్స కూడా తీసుకోరు. ప్రధానంగా ధూమపానం ఊపిరితిత్తుల ఏకైక శత్రువు. వాతావరణ కాలుష్యం, పారిశ్రామిక వ్యర్థాలు, జల కాలుష్యం ఊపిరితిత్తుల అనారోగ్యానికి కారణం అవుతాయి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉన్నాయా? లేదా? అని తెలుసుకోవడం చాలా ముఖ్యం అని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మన శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలు ఊపిరితిత్తులు అనారోగ్యాన్ని సూచిస్తాయని చెబుతున్నారు. ఆ లక్షణాలు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలని, చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నిరంతర దగ్గు..

ప్రతి రోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే నిరంతర దగ్గు వస్తున్నట్లయితే, అది ఊపిరితిత్తుల వ్యాధికి చిహ్నంగా చెబుతున్నారు వైద్యులు. వైద్యుల ప్రకారం.. దీర్ఘకాలిక దగ్గు అనేది క్యాన్సర్ గానీ, COPD వంటి ఊపిరితిత్తుల వ్యాధులకు ఒక వార్నింగ్ కావొచ్చని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఊపిరి ఆడకపోవడం..

మెట్లు ఎక్కేటప్పుడు లేదా ట్రెక్కింగ్‌కు వెళ్లేటప్పుడు బాగా ఆయాసపడటం, ఊపిరి ఆడకపోవడం వంటివి ఊపిరితిత్తుల సమస్యకు సంకేతం కావొచ్చు. పల్మనరీ హైపర్‌టెన్షన్, ఆస్తమా కారణంగానూ ఈ సమస్య తలెత్తుతుంది.

వాయిస్‌లో మార్పు..

కొన్నిసార్లు ఊపిరితిత్తులు ఆరోగ్యంగా లేకపోవడం వల్ల బలమైన శ్వాసను వదిలే సామర్థ్యాన్ని కోల్పోతాయి. దీనివల్ల వాయిస్‌లో మార్పు రావొచ్చు. మీ వాయిస్‌ అకస్మాత్తుగా మృదువుగా మారితే.. స్వరతంతుల పనితీరులో సమస్య వల్ల కావొచ్చు. వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటే.. ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

దీర్ఘకాలిక ఛాతి నొప్పి..
గుండె జబ్బుల కారణంగా ఛాతి నొప్పి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఊపిరితిత్తుల వ్యాధి వల్ల కూడా ఛాతిలో నొప్పి వస్తుంది. నవ్వినప్పుడు, దగ్గినప్పుడు లేదా లోతైన శ్వాసను తీసుకుంటున్పుడు నొప్పి వస్తుంటుంది. అలా నొప్పి వస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చు.

అధిక శ్లేష్మం..
అమెరికన్ లంగ్ అసోసియేషన్ ప్రకారం.. ప్రకోపించే ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి వాయుమార్గాల ద్వారా కఫం ఉత్పత్తి అవుతుంది. అయితే, ఇది ఒక నెల కంటే ఎక్కువ కాలం పాటు ఛాతీ లేదా గొంతులో ఉంటే.. ఊపిరితిత్తులు అనారోగ్యం బారిన పడుతున్నాయని, వ్యాధి ప్రమాదాన్ని సూచించవచ్చు.

గమనిక: ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఆర్టికల్‌ను పబ్లిష్ చేయడం జరిగింది. ఊపిరితిత్తులకు సంబంధించి ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.