Workouts after long break: విరామం తరువాత మళ్ళీ వర్కవుట్‌లు మొదలు పెడుతున్నారా? అయితే.. ఈ నియమాలు పాటించడం తప్పనిసరి!

Workouts after long break: విరామం తరువాత మళ్ళీ వర్కవుట్‌లు మొదలు పెడుతున్నారా? అయితే.. ఈ నియమాలు పాటించడం తప్పనిసరి!
Workout After Long Break

వ్యాయామం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, సమయం లేకపోవడం వల్ల అది చేయడం సాధ్యం కాదు.

KVD Varma

|

Aug 17, 2021 | 5:23 PM

Workouts after long break: ఇది పోటీ ప్రపంచం. ఎవరికివారు వెనుకబడిపోకుండా ఉండటానికి పోరాడుతున్నారు. ఒక్కరి జీతంతో కుటుంబాన్ని నడపడం కష్టమైన పరిస్థితులు. దీంతో భార్యాభర్తలిద్దరూ పని చేయాల్సి వస్తోంది.  ప్రతిఒక్కరూ డబ్బు కోసం పరుగులు తీస్తూనే వస్తున్నారు. ఈ పోటీలో, ఎవరికీ ఖాళీ సమయం ఉండదు. తక్కువ సమయంలో ఎక్కువ చేయాలనే హడావుడి ఉంది. అప్పుడు అలాంటి సమయంలో వ్యాయామంచేయడానికి ఎవరికీ సమయం ఉండదు. వ్యాయామం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, సమయం లేకపోవడం వల్ల అది చేయడం సాధ్యం కాదు. కొందరికి సమయం చిక్కినా అది విశ్రాంతి తీసుకోవడానికే సరిపోతుంది. నిజానికి ఈ పోటీ ప్రపంచంలోని ఉరుకులు పరుగుల జీవితం మన ఆరోగ్యానికి తెస్తున్న చేటు అంతా.. ఇంతా కాదు. ఒక పక్క ఇమ్యూనిటీ తగ్గిపోతోంది. మరోపక్క ఊబకాయం.. కొలెస్ట్రాల్ సమస్యలు పీడిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కనీస వ్యాయామం లేకపోవడం ఇబ్బంది కలిగిస్తుంది. ఇది ఒకరకమైన బాధ అయితే, మరోరకమైన ఇబ్బంది కూడా ఉంది.

కొంతమంది ఫిట్‌నెస్ కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. అదే సమయంలో, కొంతమంది నిర్దిష్ట ఆహారాన్ని అనుసరిస్తారు. అయితే, కొన్ని కారణాల వల్ల కొందరు ఒక్కోసారి వ్యాయమాన్ని నిలిపివేయాల్సి పరిస్థితి వస్తుంది. ఒక్కసారి వ్యాయాయం చేయడంలో గ్యాప్ వస్తే.. మళ్ళీ వ్యాయామం చేయాలంటే ఇబ్బంది కలుగుతుంది. అంతేకాదు వ్యాయామం మధ్యలో మానేస్తే కొన్ని శారీరక ఇబ్బందులూ తలెత్తే అవకాశం ఉంటుంది. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం ప్రారంభించిన తరువాత మధ్యలో ఆగిపోయి తిరిగి ప్రారంభించాలి అనుకుంటే.. కొన్ని నియాలు పాటించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గ్యాప్ తక్కువ ఉంటే ఫర్వాలేదు.. కానీ, ఎక్కువ గ్యాప్ తీసుకున్నట్లయితే.. మళ్లీ వర్కవుట్ ప్రారంభించాలి అంటే ఈ నియమాలు తప్పక పాటించాలని సూచిస్తున్నారు.

1. బద్ధకాన్ని వదిలించుకోవాలి..

ఏదైనా పనిలో పెద్ద గ్యాప్ తర్వాత లేదా కొంత సమయం గ్యాప్ తర్వాత, పనిని పునరావృతం చేయడం చాలా బోర్‌గా మారుతుంది. కానీ, మీరు ఫిట్‌గా ఉండాలంటే, ఈ బద్ధకాన్ని వదిలించుకోవాలి. ప్రారంభంలో చాలా మంది విసుగు చెందుతారు. ఇది పని చేసే ఉత్సాహాన్ని తొలగిస్తుంది. అందుకనే తిరిగి మళ్లీ వర్కవుట్ ప్రారంభించినపుడు, నెమ్మదిగా వ్యాయామం చేయడం ప్రారంభించండి. ఇది వ్యాయామం కొనసాగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

2. యోగాతో ప్రారంభించండి..

ఏదైనా వ్యాయామం ప్రారంభించే ముందు మానసిక స్థిరత్వం కలిగి ఉండటం ముఖ్యం. కాబట్టి వ్యాయామం ప్రారంభించే ముందు 20 నిమిషాల పాటు యోగా చేయండి. అలాగే, మీరు ప్రారంభంలో గట్టిగా వ్యాయామం చేస్తే, అది మీ శరీరంలో ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి చిన్న యోగాసనాలతో ప్రారంభించండి. ఇది మీకు మానసికస్థిరత్వాన్ని ఇవ్వడంతో పాటు..వ్యాయామాలను చేయడంలో మీకు సహాయకారిగా ఉంటుంది.

3. ఆహారంలో మార్పులు..

మీరు మళ్లీ వ్యాయామం చేయడం ప్రారంభించిన తర్వాత, మీ ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. మీకు ప్రారంభ ఫిట్‌నెస్ ఫలితాలు కావాలంటే, మీ ఆహారంలో డైట్ ఫుడ్, జ్యూస్‌లు, కూరగాయలను చేర్చడం ప్రారంభించండి. మీ వ్యాయామాలకు తగిన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

4. సంయమనం కావాలి..

ఒక్క రాత్రిలో అద్భుతాలు జరగవు. మీరు వ్యాయాయం మొదలు పెట్టిన వెంటనే ఫలితాల కోసం చూడవద్దు.  కాబట్టి ఫిట్ అవ్వడానికి కాస్త ఓపిక పట్టండి. ఒక రోజు వ్యాయామం చేసిన వెంటనే మీరు సన్నగా లేదా మందంగా మారరు. మీరు కొన్ని నెలలు కష్టపడాలి. అప్పుడే మీరు ఆశించిన ఫలితాన్ని పొందుతారు.

(ఈ కథనం వివిధ హెల్త్ జర్నల్స్ లో ప్రచురితమైన పరిశోధకులు చేసిన వైద్య పరిశోధనలతో పాటు నిపుణుల అభిప్రాయాల మీద ఆధారపడి అందించడం జరిగింది. ఏదైనా వైద్యం తీసుకునే ముందు ఆరోగ్య నిపుణులు, వైద్యులను సంప్రదించడం అవసరం.)

Also Read: Anemia: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే రక్తహీనత కావచ్చు.. ఈ పదార్థాలు తీసుకోండి..!

Diabetes: డయాబెటిక్ రోగులు సైక్లింగ్ చేస్తే మరణాన్ని జయించినట్లే.. అధ్యాయనాల్లో సంచలన విషయాలు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu