Platelets: ప్రాణాలు తీసే ప్లేట్‌లెట్స్ లోపం.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
ఆరోగ్యమే మహాభాగ్యం. మన శరీరం ఇచ్చే సూచనలను చాలా సార్లు నిర్లక్ష్యం చేస్తుంటాం. ఇది భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య ప్రమాదాలకు దారి తీయవచ్చు. అలాంటి ఒక పరిస్థితే రక్తంలో ప్లేట్‌లెట్ సంఖ్య తగ్గడం. రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్స్ అనే మూడు రకాల కణాలు ఉంటాయి. ఇవి ప్లాస్మా ద్రవంలో తేలుతూ ఉంటాయి. శరీరానికి గాయం అయినప్పుడు ప్లేట్‌లెట్స్ రక్తాన్ని గడ్డలుగా మారుస్తాయి. దీంతో, రక్తస్రావం ఆగుతుంది.

ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గితే రక్తం గడ్డకట్టదు. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. రక్తంలో ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్న ఈ పరిస్థితిని థ్రోంబోసైటోపెనియా అంటారు. ప్లేట్‌లెట్ సంఖ్య తగ్గినప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ లక్షణాలేంటి, ఎంత కౌంట్ ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
సాధారణ ప్లేట్‌లెట్ కౌంట్ ఎంత ఉండాలి?
ప్లేట్‌లెట్ కౌంట్ అంటే రక్తంలో రక్త ఫలకాల సంఖ్యను కొలిచే పరీక్ష. ఆరోగ్యకరమైన పెద్దవారిలో సాధారణంగా ప్రతి మైక్రోలీటర్ రక్తానికి 1,50,000 నుంచి 4,50,000 ప్లేట్‌లెట్స్ ఉండాలి.
పురుషులలో: సాధారణంగా 1,50,000 నుంచి 4,50,000 వరకు.
స్త్రీలలో: సుమారు 1,50,000 నుంచి 3,50,000 వరకు ఉండాలి. వయసు, లింగాన్ని బట్టి ఈ సంఖ్యలో స్వల్ప తేడాలు కనిపిస్తాయి. 64 ఏళ్లు పైబడిన వారిలో సగటు సాధారణ విలువ 1,50,000 కంటే కాస్త తక్కువగా ఉండవచ్చు.
ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గడానికి కారణాలు
చాలా మంది డెంగ్యూ వస్తేనే ప్లేట్‌లెట్ సంఖ్య తగ్గుతుందని భావిస్తారు. అయితే, డెంగ్యూ మాత్రమే కాదు ప్లేట్‌లెట్ సంఖ్య తగ్గడానికి అనేక ఇతర కారణాలు సైతం ఉంటాయి. ఉదాహరణకు:
రక్తంలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు
ఎముక మజ్జ సమస్యలు (బోన్ మ్యారో డిజార్డర్స్)
ఇడియోపతిక్ థ్రోంబోసైటోపెనిక్ పర్పురా (ITP)
హెమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్ (HUS)
హైపర్‌స్ప్లెనిజం
ఆటో ఇమ్యూన్ వ్యాధులు
విటమిన్ బి12, ఫోలేట్, ఐరన్ వంటి పోషకాలు తక్కువ అవ్వడం కూడా ప్లేట్‌లెట్ సంఖ్య తగ్గడానికి ఒక కారణం నిపుణులు చెబుతున్నారు.
తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్ ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు శరీరంలో ప్లేట్‌లెట్స్ తక్కువ ఉన్నప్పుడు కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. వాటిని వెంటనే గుర్తించడం ముఖ్యం:
చిన్న గాయాలు సైతం తీవ్ర రక్తస్రావం కలిగిస్తాయి.
చర్మంపై చిన్న నీలం, ఎరుపు, ఊదా రంగు గుర్తులు (చిన్న చిన్న రక్తస్రావాల వల్ల) కనిపిస్తాయి.
ముక్కు నుంచి లేదా చిగుళ్ళ నుంచి ఎక్కువగా రక్తం కారుతుంది.
మలం నల్లగా మారడం లేదా రక్తం కనిపించడం.
ఎరుపు లేదా గులాబీ రంగు మూత్రం.
రక్తంతో వాంతులు అవ్వడం.
స్త్రీలకు పీరియడ్స్ సమయంలో అసాధారణంగా రక్తస్రావం పెరగడం.
తీవ్రమైన తలనొప్పి.
కండరాలు లేదా కీళ్లలో నిరంతర నొప్పి.
బలహీనంగా, తల తిరుగుతున్నట్లు అనిపించడం.
ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరగాలంటే ఏం చేయాలి? శరీరంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య పెంచడానికి కొన్ని ఆహారాలు సహాయపడతాయి:
పోషకాలు: ఫోలేట్, విటమిన్-బి12, విటమిన్-సి, విటమిన్-డి, విటమిన్-కె సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి.
బొప్పాయి: ప్లేట్‌లెట్స్ పరిమాణం పెంచడానికి బొప్పాయిని ఆహారంలో చేర్చుకోవచ్చు. అధ్యయనాల ప్రకారం, బొప్పాయి ఆకులు ప్లేట్‌లెట్స్ సంఖ్య, ఎర్ర రక్త కణాలు పెంచడానికి సహాయపడతాయి. ఈ ఆకులను మరిగించి రసం తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది.
గుమ్మడికాయ: గుమ్మడికాయ కూడా ప్లేట్‌లెట్స్ పరిమాణం పెంచడంలో తోడ్పడుతుంది. గుమ్మడికాయ రసం తాగడం కూడా మంచిది నిపుణులు సూచిస్తున్నారు.
చికిత్స, నివారణ
ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గినప్పుడు, దాని వెనుక ఉన్న కారణాన్ని బట్టి చికిత్స అందిస్తారు.
మద్యపానం అలవాటు ఉంటే మానేయడం మంచిది.
పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే లేదా ప్లేట్‌లెట్ కౌంట్ తక్కువగా ఉన్నట్టు నిర్ధారణ అయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. స్వయంగా వైద్యం చేసుకోకూడదు.
గాయాలు కాకుండా…
ప్లేట్‌లెట్ కౌంట్ చాలా తక్కువగా (ఉదాహరణకు 10,000 కంటే తక్కువ) ఉండి, రక్తస్రావం అవుతుంటే అత్యవసర పరిస్థితుల్లో ప్లేట్‌లెట్ మార్పిడి అవసరం కావచ్చు.




