Health Tips: పిల్లలు వింతగా ప్రవర్తిస్తున్నారా.. వారిలో ఈ లక్షణాలుంటే జాగ్రత్త
పిల్లలు ఎదుగుతున్న సమయంలో వారి ఎదుగుదలను తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతుండాలి. అందరిలా కాకుండా వారు వింతగా ప్రవర్తిస్తున్నా ఈ కింది లక్షణాలు గమనించినా సొంత వైద్యం మాని వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే తాజా అధ్యయనాల ప్రకారం ఆటిజం బారిన పడుతున్న చిన్నారుల సంఖ్యం పెరిగిపోతుంది. జన్యుపరమైన లోపాలతో పాటు జీవనశైలి కూడా దీనికి ప్రధానకారణమవుతోంది.

ఆటిజం అనేది నరాల వ్యవస్థకు సంబంధించిన డిజార్డర్. ఇది పిల్లల మెదడు అభివృద్ధిలో మార్పుల కారణంగా వస్తుంది. ఇది పిల్లల ప్రవర్తన, సామాజిక నైపుణ్యాలు కమ్యూనికేషన్‌ను ప్రభావితం చేస్తుంది. ఆటిజం ఉన్న పిల్లలు ఇతరులతో సంభాషించడంలో, అర్థం చేసుకోవడంలో సంబంధాలు ఏర్పరచుకోవడంలో ఇబ్బంది పడతారు. అందరి పిల్లల్లా వయసుకు తగినట్టుగా ఉండలేరు. ఈ వ్యాధి తల్లిదండ్రుల్లో తీవ్ర మనోవేదన కలిగించడమే కాకుండా దీని చికిత్సకు ఆర్థికంగా భారంగా కూడా మారుతుంది. అందుకే ఈ రుగ్మతపై అవగాహన కల్పించేందుకు ప్రతిఏటా ఏప్రిల్ నెలను ఆటిజం గురించి అవగాహన, స్వీకరణ నెలగా జరుపుతున్నారు.
ఆటిజం లక్షణాలు:
రెండు నుంచి మూడేళ్ల లోపు చిన్నారుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనపడుతుంటాయి. ఏడాదిలోపే పేరెంట్స్ వీటిని గుర్తించగలిగితే వారిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చు. పిల్లలు ఇతరులతో కంటి చూపు కలపలేకపోవడం, మన భావాలను అర్థం చేసుకోలేకపోవడం, తమ ఈడు పిల్లలతో స్నేహం చేయలేకపోవడం, ఆడుకోవడానికి కూడా అయిష్టత చూపడం వంటివి గుర్తిస్తే తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తమవ్వాలి.
మాట్లాడటంలో ఇబ్బంది..
పిల్లలకు మాటలు రావడం ఆలస్యం అవుతున్నా, ఒకే పదాన్ని మళ్లీ మళ్లీ తిరిగి చెప్పడం, హావభావాలను అర్థం చేసుకోకపోవడం వంటివి కూడా ఆటిజం లక్షణాల కిందకే వస్తాయి. వీరి ప్రవర్తనలోనూ తేడాలను గుర్తించవచ్చు. ఒకే రకమైన పనులు పదే పదే చేయడం, ఆట వస్తువులను ఒకే వరుసలో పేర్చడం, కొన్ని వస్తువులకు లేదా శబ్దాలకు అతిగా స్పందించడం లేదా తక్కువగా స్పందించడం, రోజువారీ దినచర్యలో మార్పులను తట్టుకోలేకపోవడం, కొన్ని ప్రత్యేకమైన విషయాలపై మాత్రమే ఆసక్తి చూపడం వంటివి ఈ వ్యాధి లక్షణాలే.
ప్లాస్టిక్ కు దూరంగా ఉండాలి..
గర్భిణీల ప్లాసెంటాలోనూ ప్లాస్టిక్ ఆనవాళ్లను తాజాగా పరిశోధకులు కనుగొన్నారు. అయితే, ఇవి… పిల్లల్లో ఆటిజానికీ కారణమవుతున్నాయని నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్లాస్టిక్‌లో ఉండే హానికారక రసాయనం బీపీఏ… కొందరు గర్భిణీల్లో అధికంగా ఉన్నట్లు గుర్తించారు. పిల్లల మెదడు పెరుగుదలలో(ముఖ్యంగా మగ శిశువుల్లో) కీలకపాత్ర పోషించే హార్మోనుని ఈ బీపీఏ అస్తవ్యస్తం చేస్తుందట. వారికి రెండేళ్లు వచ్చేసరికి ఆటిజం వచ్చే ఆస్కారం మూడున్నర రెట్లు ఉంటే, 11ఏళ్లకు ఆ ముప్పు ఆరురెట్లకు పెరుగుతుందట. కాబట్టి, ఎదుగులను కుంటుపరిచే ఆటిజం బారిన పిల్లలు పడకుండా ఉండాలంటే… మనం నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉండాలంటున్నారు పరిశోధకులు. ఆహారం, పానీయాలు ప్యాక్ చేయడానికి ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, ఇళ్లను పునర్నిర్మించేటప్పుడు వచ్చే కొన్ని రకాల వాసనలు పీల్చడం, కాస్మెటిక్స్ వల్ల కూడా ఈ హానికర రసాయనం శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ప్రెగ్నెన్సీ సమయంలో ప్లాస్టిక్ వాడకంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
1970లో అమెరికా ఆటిజం సంఘం ఆరంభించిన ఈ కార్యక్రమం, ఐక్యరాజ్యసమితి గుర్తింపుతో ఏప్రిల్ 2ను ప్రపంచ ఆటిజం అవగాహన దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు. “వైవిధ్యాన్ని ఆనందంగా స్వీకరించండి” అనే ఇతివృత్తంతో ఈ సంవత్సరం ఆటిజం డేను నిర్వహిస్తున్నారు. ఇది ఇళ్లలో, విద్యాలయాల్లో, పని కార్యాలయాల్లో, సమాజాల్లో న్యూరో వైవిధ్యాన్ని ఆదరించడాన్ని, సమగ్ర వాతావరణాన్ని సృష్టించడాన్ని ప్రేరేపిస్తుంది. ఆటిజం రోజుని ఉద్దేశించి, ముగ్ధ కల్రా “ఐ సీ యు, ఐ గెట్ యు: ది సెల్ఫ్-కేర్ గైడ్ ఫర్ స్పెషల్ నీడ్స్ పేరెంట్స్” అనే పుస్తకాన్ని రచించారు.