AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీపీ ఎక్కువగా ఉంటే మీ లైఫ్ రిస్క్‌ లో పడ్డట్టే.. ఇవి పాటించకపోతే మీకే నష్టం

ప్రస్తుత రోజుల్లో రక్తపోటు సమస్య అనేక మందిని ప్రభావితం చేస్తోంది. హైబీపీ ఉన్నవారు కేవలం మందులు మాత్రమే కాకుండా.. తినే ఆహారంపై కూడా దృష్టి పెట్టాలి. కొన్ని ఆహారాలు బీపీని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అలాంటి వాటిని రోజు వారి జీవితంలో తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. హైబీపీ ఉన్నవారు దూరంగా ఉండాల్సిన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బీపీ ఎక్కువగా ఉంటే మీ లైఫ్ రిస్క్‌ లో పడ్డట్టే.. ఇవి పాటించకపోతే మీకే నష్టం
High Blood Pressure
Prashanthi V
|

Updated on: Apr 23, 2025 | 11:11 AM

Share

ఉప్పు అంటే సోడియం. ఇది శరీరంలో నీటి నిల్వల పై ప్రభావం చూపి బీపీ ని పెంచే అవకాశం ఉంటుంది. చిప్స్, స్నాక్స్ వంటి పదార్థాల్లో అధికంగా ఉప్పు ఉంటుంది. కాబట్టి వీటిని పూర్తిగా తగ్గించాలి లేదా తక్కువగా తీసుకోవాలి. బదులుగా తక్కువ సోడియం కలిగిన ఉప్పు ఉపయోగించడం మంచిది.

సాసేజ్‌లు, బేకన్, హాట్‌డాగ్స్ వంటి ప్రాసెస్డ్ మాంసాహారం ఉప్పు, నైట్రేట్స్‌తో పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో ఒత్తిడిని పెంచి హైబీపీను మరింత తీవ్రమయ్యేలా చేస్తాయి. కాబట్టి ఈ రకమైన మాంసాహారం భోజనాల నుండి పూర్తిగా తొలగించటం ఆరోగ్యపరంగా మంచిది.

ఆవకాయ, మాగాయ పచ్చడి వంటి వాటిలో ఉప్పు మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి రుచి పుట్టించవచ్చు కానీ హైబీపీ ఉన్నవారికి ప్రమాదకరం. ఈ రకాల పచ్చళ్లను తరచుగా తినకూడదు. తినాల్సి వస్తే కూడా పరిమిత మోతాదులోనే తీసుకోవాలి.

ఇన్స్టెంట్ నూడుల్స్, క్యాన్డ్ సూప్స్ వంటి రెడీ టూ కుక్ పదార్థాలలో అధిక పరిమాణంలో సోడియం, రసాయన పదార్థాలు ఉపయోగించబడతాయి. ఇవి రక్తపోటును పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థకు ఇబ్బందులు కలిగిస్తాయి. శ్రద్ధగా పరిశీలించి ఆరోగ్యవంతమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి.

కూల్ డ్రింక్స్, సోడా, ఎనర్జీ డ్రింక్స్ లాంటి వాటిలో షుగర్ అధికంగా ఉంటుంది. ఇవి కేవలం బరువు పెరగడానికి కాదు.. రక్తపోటు అదుపులో లేకుండా చేసేందుకు కూడా కారణమవుతాయి. శరీరంలో ఇన్సులిన్ స్థాయులను మార్చడం ద్వారా ఇది జరుగుతుంది. అందువల్ల వీటిని పూర్తిగా తగ్గించడం ఉత్తమం.

చల్లబడ్డ పిజ్జా, రెడీ టూ ఈట్ మీల్స్ వంటి వాటిలో ట్రాన్స్ ఫ్యాట్స్, అధిక ఉప్పు ఉంటాయి. ఇవి గుండెపై ఒత్తిడిని పెంచుతూ రక్తపోటును నియంత్రించలేని స్థితికి తీసుకువెళ్తాయి. ఇలాంటి ఫ్రోజన్ ఫుడ్స్‌ను తగ్గించి.. తాజా పదార్థాలతో తయారు చేసిన భోజనాలపై దృష్టి పెట్టాలి.

ఆల్కాహాల్ తాగడం వల్ల బీపీ పెరగడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశముంది. ముఖ్యంగా అధిక మోతాదులో మద్యం తీసుకుంటే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. హైబీపీ ఉన్నవారు ఆల్కాహాల్‌ను పూర్తిగా మానుకోవడం ఉత్తమం.

సోయా సాస్, కెచప్, చిల్లీ గార్లిక్ సాస్ వంటి వాటిలో అధికంగా సోడియం ఉంటుంది. ఇవి ఆహారానికి రుచిని పెంచినా.. హైబీపీ ఉన్నవారికి హానికరం. వీటిని వాడటం తగ్గించి సహజమైన మసాలాలు ఉపయోగించడం మంచిది.

హైబీపీ సమస్యను నియంత్రించాలంటే మందులతో పాటు ఆహార నియమాలు పాటించాలి. అధిక ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్, మద్యం వంటి ప్రమాదకర పదార్థాలను తగ్గించి.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.