ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు! మీ ఆరోగ్యానికే ప్రమాదం

నేటి యుగంలో దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్ లేదా రిఫ్రిజిరేటర్ ఉండే ఉంటుంది. అందులో చాలా ఆహార పదార్థాలను నిల్వ చేస్తుంటారు. అయితే, కొన్ని పదార్థాలను పొరపాటున కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అలాంటి పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఆరోగ్యానికే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు! మీ ఆరోగ్యానికే ప్రమాదం
Foods In Fridge

Updated on: Dec 27, 2025 | 5:25 PM

నేటి కాలంలో ఫ్రిడ్జ్ లేదా రిఫ్రిజిరేటర్ దాదాపు ప్రతి ఒక్కరి నివాసంలోనూ ఉంటోంది. చేసిన వంటకాలు, ఆహార పదార్థాలు కొంత సమయం వరకు చెడిపోకుండా ఉండేందుకు రిఫ్రిజిరేటర్లు ఉపయోగపడతాయి. అయితే, వీటిలో కొన్ని ఆహార పదార్థాలను అస్సలు ఉంచకూడదు. చాలా మందికి ఈ విషయం తెలియదు. అదేదో స్టోర్ రూంల అన్నీ ఫ్రిడ్జ్‌లో కుక్కేస్తుంటారు. ఇది చాలా ప్రమాదమకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కూరగాయలు, పండ్లు, పాలు లాంటి కొన్ని ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం సాధారణమే. కానీ, మిగిలిపోయిన ఆహార పదార్థాలు, పండ్లు, నూనె పదార్థాలను కూడా రెండు మూడు రోజులపాటు ఫ్రీజర్‌లో ఉంచుతారు. అయితే, రిఫ్రిజిరేటర్ చల్లని ఉష్ణోగ్రత కొన్ని ఆహార పదార్థాలకు హానికరం. వాటిని రిఫ్రిజిరేటర్‌లలో పెడితే మాత్రం ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారతాయి. వాటి రుచి, ఆకృతి చెడిపోవడమే గాక, కొన్నిసార్లు వాటి నాణ్యత కూడా దెబ్బతింటుంది.

ఫ్రిజ్‌లో ఏయే పదార్థాలను ఉంచవద్దంటే?

బంగాళాదుంపలు
బంగాళాదుంపలు (ఆలుగడ్డలు) లను ఫ్రిజ్‌లో ఉంచితే చల్లని గాలి వాటిలో ఉండే స్టార్చ్‌ను చక్కెరగా మారుస్తుంది. అవి వండినప్పుడు తీపిగా, అనారోగ్యకరంగా మారుతాయి. అందుకే బంగాళాదుంపలను ఫ్రిజ్‌లో కాకుండా చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేస్తే మంచిది.

టమాటో
టమాటోలను కూడా రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయకూడదు. ఎందుకంటే, వాటిలో ఉండే రసం, తీపి తగ్గుతుంది. దాని రుచి కూడా పోతుంది.

ఉల్లిపాయలు
ఉల్లిపాయలను కూడా ఫ్రిజ్‌లో అస్సలు ఉంచకూడదు. ఫ్రిజ్‌లోని తేమ ఉల్లిపాయలు మెత్తబడటానికి, చెడిపోవడానికి కారణమవుతుంది. అందుకే, ఉల్లిపాయలను ఎప్పుడూ కూడా మెష్ బుట్టలో నిల్వ చేస్తే త్వరగా పాడవకుండా ఉంటాయి.

వెల్లుల్లి
వెల్లులిని కూడా ఫ్రిజ్‌లో అసలు ఉంచకూడదు. రిఫ్రిజిరేటర్‌లోని తేమతో వెల్లుల్లి మొలకెత్తుతుంది. దాని రుచిని కోల్పోతుంది. తేమలో వెల్లుల్లి త్వరగా చెడిపోతుంది.

అరటి
అరటిపండ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి తొక్క త్వరగా గోధుమ రంగులోకి మారుతుంది. లోపలి గుజ్జు చెడిపోతుంది. అరటిపండ్లను గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తే సరిపోతుంది.

తేనె
ఫ్రిజ్‌లో పెట్టకూడని మరో పదార్థం తేనె. దీన్ని ఫ్రిజ్‌లో ఉంచితే స్పటికంగా మారే అవకాశం ఉంది. దీంతో తేనెను ఉపయోగించడం సాధ్యం కాదు. తేనెను గది ఉష్ణోగ్రత వద్ద గాలి చొరబడని కంటైనర్లో నిల్వ చేస్తే మంచిది.

బ్రెడ్
ఫ్రిజ్‌లో బ్రెడ్‌ను నిల్వ చేయకూడదు. అలా చేస్తే ఎండిపోయి దాని మృదువైన ఆకృతిని కోల్పోతుంది. దీర్ఘకాలిక నిల్వకు డీప్ ఫ్రీజర్ మంచిది.

కాఫీ
కాఫీని పొరపాటున కూడా రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయకూడదు. అలా చేస్తే తేమను గ్రహించి రుచి, వాసన కోల్పోతుంది. కాఫీని ఎప్పుడూ గాలి చొరబడని కంటైనర్లలో చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి.

నూనె

కొంతమంది వంట నూనెలను కూడా ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. కానీ, దీని వల్ల నూనె చిక్కగా మారుతుంది. కొన్నిసార్లు తెల్లగా మారి దాని సహజత్వాన్ని కోల్పోతుంది.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం.. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.. మేము వివిధ వైద్య అధ్యయనాలు, నిపుణుల సలహాలు, వార్తా నివేదికలను ప్రాతిపదికగా తీసుకున్నాము.)