
ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఔషధాలలో అశ్వగంధ ఒకటి. దీనిని ఇండియన్ జిన్సెంగ్ అని కూడా అంటారు. శరీరానికి శక్తినిచ్చే శక్తివంతమైన ఔషధంగా దీనిని వర్ణిస్తారు. ఇది శరీరాన్ని బలంగా చేయడమే కాదు.. మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. అశ్వగంధ పొడిని ప్రతి రోజు పాలలో కలిపి తాగడం వల్ల ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఉదయం లేదా రాత్రి వేళ కొద్దిగా అశ్వగంధ చూర్ణాన్ని తీసుకుని ఒక గ్లాసు వేడి పాలలో కలిపి తాగితే శరీరానికి బలం, శక్తి వస్తాయి.
అశ్వగంధలో ఉండే ఔషధ గుణాలు శరీరంలోని ఎముకలు, కండరాలను బలపరిచేలా పని చేస్తాయి. శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారు, వ్యాయామం చేసే వారు దీనిని తీసుకుంటే శరీర బలాన్ని సులభంగా పెంచుకోవచ్చు. ఇది శక్తినిచ్చే టానిక్ లా పని చేస్తుంది.
తీవ్రమైన శారీరక నొప్పులు, వాపులతో బాధపడే వారికి అశ్వగంధను పాలలో కలిపి తాగడం వల్ల ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఇది సహజమైన యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. కండరాలు అలసిపోయినప్పుడు.. శరీర భాగాల్లో నొప్పులు వచ్చినప్పుడు ఇది సహాయపడుతుంది.
రాత్రిపూట అశ్వగంధ చూర్ణాన్ని వేడి పాలలో కలిపి తాగడం ద్వారా మెదడు ప్రశాంతంగా మారి కంటినిండా నిద్ర రావడానికి సహాయపడుతుంది. నిద్రలేమి వల్ల బాధపడే వారికి ఇది ఒక ప్రకృతి సిద్ధమైన చికిత్సగా చెప్పుకోవచ్చు. నిద్ర సరిగా లేకపోతే ఒత్తిడి పెరుగుతుంది. అలాంటప్పుడు అశ్వగంధ గొప్ప ఉపశమనం ఇస్తుంది.
అశ్వగంధ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తిని కలిగి ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ లాంటి సమస్యలపై మంచి ప్రభావం చూపుతుంది. రోజూ దీనిని తీసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది, ధ్యాస పెరుగుతుంది.
శరీరంలో శక్తి తక్కువగా ఉందని అనిపించేవారు అశ్వగంధను తీసుకుంటే కొత్త ఉత్సాహాన్ని పొందుతారు. ఇది నరాలు, కండరాల్లోకి జీవశక్తిని నింపుతుంది. శ్రమించిన తర్వాత వచ్చే అలసటను దూరం చేస్తుంది.
అశ్వగంధ అనేది శరీరానికి బలాన్ని, మనస్సుకు ప్రశాంతతను ఇవ్వగల ప్రకృతిసిద్ధమైన ఔషధం. పాలలో కలిపి తాగడం ద్వారా ఇది నిద్ర, నొప్పులు, మానసిక సమస్యలు, శక్తిలేమి వంటి అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. అయితే దీనిని ఉపయోగించే ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)