Blood Cancer: ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రమాదాల్లో క్యాన్సర్ ప్రధానమైంది. ఈ మాయదారి రోగం కారణంగా ఏటా వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. మనిషిని కొంచెం కొంచెంగా తినేసి, చివరికి ప్రాణాలను హరించేలా చేస్తుందీ రోగం. అనేక రకాల క్యాన్సర్లలో రక్త క్యాన్సర్ ఒకటి. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాను ప్రతీ ఏటా సెప్టెంబర్‌ను ప్రపంచ రక్త క్యాన్సర్ అవగాహన నెలగా నిర్వహిస్తారు. ఈ ఏడాది క్లోజ్ ది కేర్ గ్యాప్ అనే థీమ్‌తో దీనిని నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ చికిత్సలో ఉన్న అసమానతలను అర్థం చేసుకోవడం, వాటిని పరిష్కరించడానికి అవసరమైన పురోగతిని సాధించే దిశగా అడుగులు వేయడం ఈ ఏడాది థీమ్ ముఖ్య ఉద్దేశం.
బ్లడ్ క్యాన్సర్ బారిన పడుతోన్న వారిలో అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. దేశంలోని దాదాపు 70,000 కంటే ఎక్కువ మంది పురుషులు, స్ట్రీలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. రోజురోజుకీ పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అయితే బ్లడ్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌లో స్టెమ్ సెల్ మార్పిడి కీలకంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇదే విషయమై డోనర్ రిక్వెస్ట్ మేనేజ్‌మెంట్, DKMS BMST ఫౌండేషన్ ఇండియాకు చెందిన డాక్టర్ నితిన్ అగర్వాల్ టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టెమ్ స్టెల్ మార్పిడి విధానం బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడేవారికి వరంలాంటిదని అభివర్ణించారు.
బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడే వారిలో అసాధారణమైన బ్లెడ్ సెల్స్ కారణంగా రక్తం నిర్వహించాల్సిన విధులను అడ్డుకుంటాయి. శరీర బరువలో ఎనిమిది శాతం ఉండే రక్తం, శరీర పనితీరులో కచ్చితంగా ముఖ్యపాత్ర పోషిస్తుంది. శరీరంలో రక్తం ప్రవహించడం ద్వారానే పోషకాలు, హార్మోన్లు అన్ని అవయవాలకు సరఫరా అవుతుంది. బ్లడ్ క్యాన్సర్ కణాలు ఎముక మజ్జలో ప్రారంభమవుతాయి. ఎముక మజ్జలోని మూల కణాలు పరిపక్వం చెందుతాయని డాక్టర్ అగర్వాల్ తెలిపారు.
బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో ప్రధానంగా కీమోథెరపీ, రేడియో థెరపీ, స్టెమ్ స్టెల్ మార్పిడి విధానాలు ఉన్నాయి. రక్తం, ఎముక మజ్జ క్యాన్సర్‌లకు చికిత్స విధానం వ్యక్తి వయసు, క్యాన్సర్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందన్న దానిపై ఆధారపడి ఉంటుంది. అధిక మొత్తంలో ఇచ్చే రేడియో థెరపీ లేదా కీమో థెరపీ క్యాన్సర్ కణాలపై మాత్రమే కాకుండా సాధారణ కణాలపై కూడా ప్రభావం చూపుతాయి. దీంతో కణాల పెరుగుదల నెమ్మదించడం లేదా పూర్తిగా నాశనానికి దారి తీస్తుందని డాక్టర్ చెప్పుకొచ్చారు.
బ్లడ్ క్యాన్సర్‌కు స్టెమ్ సెల్ మార్పడి ఉత్తమ విధానంగా చెప్పొచ్చు. లుకేమియా, మైలోమా, లింఫోమా వంటి వాటికి ఈ విధానం ఉపయోగపడుతుంది. స్టెమ్ సెల్ మార్పిడి విధానాన్ని ఎముక మజ్జ మార్పిడిగా కూడా పిలుస్తుంటారు. దీనిద్వారా రోగి దెబ్బ తిన్న మూల కణాలను భర్తీ చేయడానికి ఆరోగ్యకరమైన మూల కణాలను తీసుకంటారు. ల్యుకేమియా ఉన్న రోగులలో ఆరోగ్యకరమైన ఎముక మజ్జను పునరుద్దరించడానికి ఉపయోగిస్తారు. స్టెమ్ సెల్స్ కొత్త ఎముక మజ్జ పెరుగుదల ప్రేరేపించడంలో సహాయపడుతుంది అని అగర్వాల్ వివరించారు.
స్టెమ్ సెల్ మార్పిడి విధానంలో దాతల రక్తం లేదా ఎముక మజ్జ నుంచి ఆరోగ్యకరమైన మూలకణాలను తీసుకుంటారు. వీటిని క్యాన్సర్‌తో బాధపడుతోన్న వారి శరీరంలోకి ఇన్‌జెక్ట్ చేస్తారు. ఈ మార్పిడి విజయవంతం కావడానికి దానం చేసిన మూలకణాలు ఒక ప్రత్యేక జన్యు మార్కర్‌ను కలిగి ఉండాలి, దీనిని హ్యూమన్ ల్యూకోసైట్ యాంటిజెన్ అని పిలుస్తారు అని డాక్టర్ అగర్వాల్ చెప్పుకొచ్చారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..