Heart Attack: గుండె బలంగా ఉండాలంటే ఇలా చేయండి..! ఈ చిన్న చిట్కాలను పాటించి చూడండి..!
హార్ట్ ఎటాక్ రాకుండా ఉండేందుకు కొన్ని నియమాలు పాటించడం చాలా అవసరం. రోజూ వ్యాయామం చేయడం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుతుంది. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం ద్వారా గుండె వ్యాధుల ముప్పును తగ్గించుకోవచ్చు. సరైన నిద్ర కూడా గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యం అంటున్నారు వైద్య నిపుణులు.

గుండెపోటు అనేది ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో ఒకటి. అయితే మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముఖ్యమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక ఉప్పు
అధిక ఉప్పు తీసుకోవడం రక్తపోటును పెంచుతుంది. ఇది గుండె జబ్బులకు ప్రధాన కారణం. ప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తినడం అలవాటు చేసుకోండి. వంట చేసేటప్పుడు ఉప్పును తక్కువగా ఉపయోగించండి.
పండ్లు, కూరగాయలు
పండ్లు, కూరగాయలలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ కలిగి ఉంటుంది. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ప్రతిరోజూ కనీసం ఐదు రకాల పండ్లు, కూరగాయలు తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
వ్యాయామం తప్పనిసరి
వ్యాయామం గుండెను బలంగా చేస్తుంది. పైగా రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటి వ్యాయామం చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి.
అల్లం, వెల్లుల్లి
అల్లం, వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లి రక్తపోటును తగ్గిస్తుంది. పైగా కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా మెరుగుపరుస్తుంది. అల్లం రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది, వాపును సైతం తగ్గిస్తుంది.
ఒత్తిడి మంచిది కాదు
ఒత్తిడి గుండె ఆరోగ్యానికి హానికరమైనది. ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం లేదా మీకు నచ్చిన ఇతర విశ్రాంతి పద్ధతులను ప్రయత్నించండి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండటం కూడా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఆరెంజ్ పండ్లు
ఆరెంజ్ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి రక్త నాళాలను బలపరుస్తుంది. పైగా కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. ఆరెంజ్, నిమ్మ, ద్రాక్ష ఇతర సిట్రస్ పండ్లు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి.
సరైన నిద్ర
నిద్ర లేకపోవడం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలని లక్ష్యంగా పెట్టుకోండి. సరైన నిద్ర శరీర బరువును సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా రక్షణ కలిగిస్తుంది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీరు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)