చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె జబ్బులను దూరం చేసే శక్తివంతమైన ఆహారాలు ఇవే..!
గుండె ఆరోగ్యం కోసం చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడం అత్యంత ముఖ్యం. దీని కోసం ఆరోగ్యకరమైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. రోజువారీ జీవనశైలిలో ఓట్స్, నట్స్, చేపలు లాంటి పదార్థాలను చేర్చితే చెడు కొలెస్ట్రాల్ ను సహజంగా నియంత్రించవచ్చు. ఇప్పుడు వీటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం.

మన శరీరంలో కొలెస్ట్రాల్ సహజంగానే ఉంటుంది. ఇది రెండు రకాలు. ఒకటి మంచిది (HDL), ఇంకొకటి చెడుది (LDL). ఈ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. LDL ఎక్కువైతే అది రక్తనాళాల్లో పేరుకుపోయి రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. దీని వల్ల హార్ట్ ఎటాక్, స్ట్రోక్ లాంటి తీవ్ర సమస్యలు రావొచ్చు.
కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడే కొన్ని ఆహారాలను మన రోజువారీ జీవితంలో చేర్చుకుంటే.. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వాటిలో ముఖ్యమైన మూడు ఆహార పదార్థాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
ఓట్స్
ప్రతిరోజూ ఓట్స్ ఉదయాన్నే లేదా రాత్రి తినడం ద్వారా మనం చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఈ ఫైబర్ LDL స్థాయిని తగ్గించే విధంగా పనిచేస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం.. ఓట్స్ లో ఉండే పోషకాలు శరీరంలోని విషాలను తొలగించడంలో సహాయపడతాయి. ఇందులో ఐరన్, విటమిన్ B, విటమిన్ E, జింక్, సెలీనియం లాంటి ముఖ్యమైన మినరల్స్ కూడా ఉంటాయి. ఇవి శరీర శక్తిని పెంచుతాయి. తెలివితేటలను మెరుగుపరుస్తాయి.
నట్స్
బాదం, పిస్తా, వేరుశనగలు లాంటి నట్స్ లో ఆరోగ్యానికి ఉపయోగపడే మంచి కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో చాలా సహాయపడతాయి. రోజుకు గుప్పెడు నట్స్ తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా.. శరీరంలో వచ్చే ఆక్సీకరణ ప్రభావాన్ని తగ్గించి క్యాన్సర్ లాంటి వ్యాధుల నుంచి కూడా రక్షణ పొందొచ్చు. వీటిలో విటమిన్ E, సెలీనియం లాంటి యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల శరీరంలో మలినాలను బయటకు తీసివేసే శక్తి కలుగుతుంది.
చేపలు
రుచిగా ఉండే చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి. చేపలు తినడం వల్ల శరీరంలోని వాపు తగ్గుతుంది. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి. ఎక్కువ కేలరీలతో ఉండే ఫాస్ట్ ఫుడ్ తినే అవకాశాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా ఫ్యాటీ లివర్, ఎసిడిటీ లాంటి సమస్యలు ఉన్నవారికి చేపలు ఆహారంలో చేర్చడం మంచిది.
రోజువారీ ఆహారంలో ఓట్స్, నట్స్, చేపలు లాంటి పదార్థాలను చేర్చడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను సహజంగా తగ్గించుకోవచ్చు. ఇవి గుండె సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకోవడంలో సహాయపడతాయి. అంతేకాదు శరీరంలో వ్యర్థాలను తొలగించడంలో, శక్తిని మెరుగుపరచడంలో, జీర్ణాన్ని బలోపేతం చేయడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. సరైన జీవనశైలి, తగిన వ్యాయామం, సరిపడా నిద్రను పాటిస్తూ ఈ ఆహారాలు తీసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు.




