AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతిరోజూ 200 లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయ్.. కిడ్నీలు బాగుండాలంటే ఈ తప్పులు అస్సలు చేయొద్దు

మూత్రపిండాలు మన శరీరానికి సహజ ఫిల్టర్‌లుగా పనిచేస్తూ రక్తంలోని మలినాలను తొలగిస్తాయి. పొగతాగడం, మద్యం సేవించడం, అధిక ఉప్పు-పంచదార వినియోగం, నియంత్రణలో లేని బీపీ, షుగర్ వంటి సమస్యలు కిడ్నీలను దెబ్బతీసే ప్రధాన కారణాలు. తగినంత నీరు తాగడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, బరువును అదుపులో ఉంచుకోవడం, సరిపడా నిద్రపోవడం ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతిరోజూ 200 లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయ్.. కిడ్నీలు బాగుండాలంటే ఈ తప్పులు అస్సలు చేయొద్దు
Kidney Health
Shaik Madar Saheb
|

Updated on: Jun 25, 2026 | 9:45 PM

Share

ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తి అక్షర సత్యం. మనం ఎంత ధనం సంపాదించినా, ఆరోగ్యం లేకపోతే ఆ సంపద నిరుపయోగమే. మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలలో మూత్రపిండాలు (కిడ్నీలు) ఒకటి. ఇవి మనం బ్రతికినంత కాలం ఆరోగ్యంగా ఉండాలంటే, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. మెదడు, గుండె మాదిరిగానే కిడ్నీలు కూడా మన శరీర నిర్మాణంలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. కిడ్నీల ప్రధాన విధి రక్తంలోని మలినాలను వడపోసి శుభ్రం చేయడం. శరీరంలో నిరంతరం జరిగే జీవక్రియల ఫలితంగా ఏర్పడే వ్యర్థ పదార్థాలను, అధికంగా ఉన్న నీటిని మూత్రం రూపంలో బయటకు పంపే పనిని కిడ్నీలు నిర్విరామంగా చేస్తాయి. ఈ ప్రక్రియలో, కిడ్నీలు ఒక్క రోజులో దాదాపు 180 నుంచి 200 లీటర్ల రక్తాన్ని వడపోస్తాయని తెలిస్తే ఆశ్చర్యపోతారు. అంతేకాదు, శరీరంలో నీరు, లవణాల సమతుల్యతను కాపాడటంలో, అలాగే రక్తపోటు (బీపీ) నియంత్రణలోనూ మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతిరోజూ 2 లీటర్ల వ్యర్థాలను, అధికంగా ఉన్న నీటిని కిడ్నీలు శుద్ధి చేసి మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. ఈ సంక్లిష్ట ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది.

అయితే, ఆధునిక జీవనశైలి, కొన్ని చెడు అలవాట్ల వల్ల కిడ్నీలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. పొగతాగడం, అధికంగా మద్యం సేవించడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అతిగా మాంసాహారం తీసుకోవడం వంటివి కిడ్నీల పనితీరును దెబ్బతీస్తాయి. కొన్ని మందుల దుష్ప్రభావాలు, నియంత్రణలో లేని రక్తపోటు, షుగర్ వ్యాధులు కూడా కిడ్నీలు పాడవడానికి ప్రధాన కారణాలు. కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేయకపోతే, రక్తం విషపూరితం అవుతుంది. ఇది ప్రాణాంతక పరిస్థితికి దారితీస్తుంది. డయాలసిస్ వంటి చికిత్సలు అవసరమవుతాయి.

కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని కీలకమైన జాగ్రత్తలు పాటించాలి.

పొగతాగడం, మద్యం: ఈ రెండు అలవాట్లు కిడ్నీలకు అత్యంత హానికరం. తక్షణమే వీటిని మానేయడం శ్రేయస్కరం.

వ్యాధులను అదుపులో ఉంచుకోవడం: రక్తపోటు (బీపీ), షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను వైద్యుల సలహా మేరకు నియంత్రణలో ఉంచుకోవాలి.

ఆరోగ్యకరమైన ఆహారం: సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఉప్పు, పంచదార వినియోగాన్ని తగ్గించాలి. ఆకు కూరలు, పుచ్చకాయలు (సీజన్‌లో), క్యాబేజీ, ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు, ఆలివ్ ఆయిల్ వంటివి కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నిమ్మరసం, స్వచ్ఛమైన తేనె కూడా మంచిది.

నీటి వినియోగం: రోజుకు కనీసం 4 నుండి 7 లీటర్ల మంచినీరు (శరీర అవసరాలను బట్టి నీటి పరిమాణం మారుతుంది) త్రాగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించవచ్చు. చిన్న రాళ్లు ఉన్నా అవి మూత్రం ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.

శారీరక శ్రమ: ప్రతిరోజూ వ్యాయామం చేయడం లేదా గార్డెన్‌లో మొక్కలు పెంచడం వంటి శారీరక శ్రమ చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, ఇది కిడ్నీలకు కూడా మేలు చేస్తుంది.

బరువు నియంత్రణ: శరీర బరువును అదుపులో ఉంచుకోవడం కిడ్నీల ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

తగినంత నిద్ర: ప్రతిరోజు కనీసం 8 గంటల నిద్ర తప్పనిసరి. నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. ఇది కిడ్నీల పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది.

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఈ అలవాట్లను పాటించడం ద్వారా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు, తద్వారా సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.. అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ముఖ్యం..

రోజుకు 4–7 లీటర్ల నీరు అందరికీ సరిపోదు. నీటి అవసరం వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు, వాతావరణం, శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుంది. కిడ్నీ లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే నీటి పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us