సిగరెట్ తాగే అలవాటు మీకుందా..? ఇది తెలిస్తే మెదడున్నోళ్లు ఇక ముట్టరు..!

ఒత్తిడి తగ్గించుకోవడానికి సిగరెట్ తాగుతున్నారా? టెన్షన్‌లో ఉన్నప్పుడు పొగ వదిలితే రిలాక్సేషన్ వస్తుందని అనుకుంటున్నారా? అయితే మీరు పెద్ద పొరపాటే చేస్తున్నారు. మీరు పీల్చే ఆ పొగ ఒత్తిడిని తగ్గించకపోగా, మిమ్మల్ని మానసిక ఆందోళనలోకి నెట్టేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసలు సిగరెట్ తాగినప్పుడు మెదడులో ఏం జరుగుతుంది? అనేది తెలుసుకుందాం..

సిగరెట్ తాగే అలవాటు మీకుందా..? ఇది తెలిస్తే మెదడున్నోళ్లు ఇక ముట్టరు..!
Does Smoking Really Reduce Stress

Updated on: Feb 19, 2026 | 9:03 AM

ఆఫీసులో పని ఒత్తిడి పెరిగినా, ఏదైనా టెన్షన్ వచ్చినా వెంటనే సిగరెట్ వెలిగించడం చాలా మందికి అలవాటు. ధూమపానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఒత్తిడి తగ్గుతుందని చాలా మంది నమ్ముతుంటారు. కానీ ఇది పూర్తిగా అపోహ అని, వాస్తవానికి ధూమపానం ఒత్తిడిని తగ్గింకపోగా మరింత పెంచుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిగరెట్లలో ఉండే నికోటిన్ ఊపిరితిత్తుల ద్వారా కేవలం కొన్ని సెకన్లలోనే మెదడుకు చేరుకుంటుంది. ఇది శరీరంలో డోపమైన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. దీనివల్ల కొద్ది నిమిషాల పాటు ఏదో తెలియని ఆనందం, హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ తాత్కాలిక అనుభూతిని చూసి ధూమపానం ఒత్తిడిని తగ్గిస్తుందని భ్రమపడుతుంటారు.

నిపుణులు ఏమంటున్నారు?

ఢిల్లీలోని లంగ్స్ వెల్నెస్ సెంటర్‌కు చెందిన డాక్టర్ నేహా వధేరా దీనిపై కీలక వివరణ ఇచ్చారు. నికోటిన్ ఇచ్చే ఆ ప్రశాంతత కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. శరీరంలో నికోటిన్ ప్రభావం తగ్గగానే, మళ్లీ సిగరెట్ తాగాలనే కోరిక మొదలవుతుంది. దీనివల్ల మునుపటి కంటే ఎక్కువ విశ్రాంతి లేకపోవడం, చిరాకు, ఆందోళన పెరుగుతాయి. దీర్ఘకాలంలో ధూమపానం చేసేవారిలో మానసిక ఒత్తిడి స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.

శరీరానికి కలిగే ఇతర నష్టాలు

కేవలం మానసిక స్థితిపైనే కాకుండా ధూమపానం వల్ల ప్రాణాంతక సమస్యలు వస్తాయని డాక్టర్ నేహా హెచ్చరించారు.

ఊపిరితిత్తుల వ్యాధులు: తరచుగా దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ముప్పు ఉంది.

గుండెపోటు: సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తుల వాపు, COPD వంటి సమస్యలు రావడమే కాకుండా గుండెపోటు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ.

ధూమపానం ఎలా మానేయాలి?

ధూమపానం మానేయడం అసాధ్యమేమీ కాదు. ప్రస్తుతం వైద్యశాస్త్రంలో మందులు, వివిధ రకాల థెరపీలు అందుబాటులో ఉన్నాయి. ధూమపానం మానేసిన తొలినాళ్లలో కొంత అసౌకర్యంగా అనిపించినా, నిపుణుల పర్యవేక్షణలో చేసే స్వల్పకాలిక చికిత్సతో సులభంగా ఈ అలవాటు నుండి బయటపడవచ్చు. గుర్తుంచుకోండి.. ఒక చిన్న సిగరెట్ ముక్క ఒత్తిడిని కాదు మీ జీవితకాలాన్ని తగ్గిస్తుంది..

Follow Us