మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 8 గంటల పాటు నిద్రపోవాలని వైద్య నిపుణులు, అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే యాంత్రిక జీవనంలో ఉండే ఒత్తిడి, ఆఫీసు పనివేళలు ఇతరత్రా కారణాలతో చాలామంది ప్రశాంతమైన నిద్రకు దూరమవుతున్నారు. ఇక కరోనా కాలంలో ఎంతో మంది అర్ధరాత్రి వరకు మేల్కొని మరీ విధులు నిర్వర్తించారు. అయితే ఇలా సరైన నిద్ర లేకపోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు.
నడకపై ప్రతికూల ప్రభావం..
తలనొప్పి, నీరసం, అలసట, ఆకలి లేకపోవడం, కాళ్లు చేతులు గుంజడం, మెదడు పనితీరు మందగించడం…ఇలా నిద్రలేమి వల్ల ఎన్నో అనర్థాలున్నాయి. అయితే ఇటీవల ఎంఐటీ (మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), బ్రెజిల్‌లోని సావ్‌పాలో యూనివర్సిటీ విద్యార్థులు సంయుక్తంగా నిర్వహించిన ఓ అధ్యయనంలో నిద్రలేమి గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. నిద్రలేమి మన నడకపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుందట. ఈమేరకు పరిశోధనలో పాల్గొన్న హెర్మనో క్రెబ్స్ అనే శాస్త్రవేత్త పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.
వారు చురుగ్గా నడవలేకపోయారు..
‘ఈ రీసెర్చ్ కోసం యూనివర్సిటీ లోని కొందరు విద్యార్థులను ఎంపిక చేసుకున్నాం. ఒక ప్రత్యేకమైన వాచ్ అందించి వారు రోజులో ఎంత సేపు నిద్రిస్తున్నారో ట్రాక్ చేశాం. అయితే నిద్రకు సంబంధించి మేం వారికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కొందరు విద్యార్థులు ఆరుగంటలు నిద్రపోతే మరికొందరు అంతకన్నా తక్కువ సమయాన్ని నిద్రకు కేటాయించారు. ఇలా మొత్తం 14 రోజుల పాటు వారి స్లీపింగ్ రికార్డ్స్ నమోదుచేశాం. ఇక 14వ రోజు సాయంత్రం ఓ స్లీపింగ్ ల్యాబ్‌లో విద్యార్థులందరూ మేల్కొనే ఉండేలా చేశాం. ఆ మరుసటి రోజు ఉదయాన్నే వారికి ట్రెడ్‌మిల్ టెస్ట్ నిర్వహించాం. కెమెరాలతో విద్యార్థుల నడకను పరీక్షించాం. అప్పుడే మాకు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. కనీసం ఆరుగంటలు నిద్రపోని విద్యార్థులు ట్రెడ్‌మిల్‌పై చురుగ్గా నడవలేకపోయారు. అంతేగాక వారు ఇన్‌యాక్టివ్‌గా కనిపించారు. అయితే ఇది శాస్త్రీయంగా నిరూపితం కావడానికి మరికొన్ని రోజులు పడుతుంది’ అని క్రెబ్స్ చెప్పుకొచ్చాడు.
Also Read: