
శరీరాన్ని గడ్డకట్టించే చల్లటి నీటిలో ముంచే ‘ఐస్ బాత్’ ప్రస్తుతం ఒక ట్రెండ్. ఇది కేవలం క్రీడాకారులకే పరిమితం కాకుండా, ఇప్పుడు సాధారణ ప్రజలు కూడా ఛాలెంజ్‌లు విసురుకుంటున్నారు. కండరాల నొప్పి తగ్గించడం, శరీర వాపును తగ్గించడం, మానసిక ఉత్తేజం లాంటి ప్రయోజనాలు ఐస్ బాత్‌ల వల్ల లభిస్తాయని చాలామంది నమ్ముతున్నారు. అయితే, ఈ ఐస్ బాత్లో కొన్ని తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు దాగి ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఐస్ బాత్‌లో శరీరాన్ని 5 నుండి 15 నిమిషాల పాటు అతి శీతల ఉష్ణోగ్రతలకు గురిచేస్తారు. ఇది రక్తనాళాలను సంకోచింపజేసి, బయటకి రాగానే అవి విస్తరిస్తాయి. దీనివల్ల వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లి, ఆక్సిజన్ సమృద్ధిగా ఉండే రక్తం కండరాలకు చేరుతుందని భావిస్తారు. మానసిక ప్రశాంతత, మంచి నిద్ర, రోగనిరోధక శక్తి పెరుగుదల లాంటి ప్రయోజనాలు కూడా దీనికి ఆపాదిస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయని, అవి నొప్పిని తగ్గించడంలో, మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయని కొందరు విశ్వసిస్తారు.
ఈ ప్రయోజనాల వెనుక కొన్ని తీవ్రమైన ప్రమాదాలు ఉన్నాయి. ముఖ్యంగా, ‘కోల్డ్ షాక్’ అనే పరిస్థితి ప్రమాదకరం. చల్లటి నీటిలో అకస్మాత్తుగా దిగగానే శ్వాస తీసుకోడానికి కష్టం కావడం, గుండె వేగం అకస్మాత్తుగా పెరగడం జరుగుతుంది. ఇది పానిక్ ఎటాక్‌కు దారి తీయగలదు. గుండె సమస్యలు ఉన్నవారికి, ఈ అకస్మాత్తు ఉష్ణోగ్రత మార్పు గుండెపోటుకు కారణం కాగలదు. ఇది ప్రాణాపాయ స్థితికి కూడా దారితీయవచ్చు.
అంతేకాక, ఎక్కువసేపు చల్లటి నీటిలో ఉంటే ‘హైపోథర్మియా’ వస్తుంది. శరీర ఉష్ణోగ్రత ప్రమాదకరంగా పడిపోతుంది. వణుకు, అయోమయం, సమన్వయ లోపం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ‘రేనాడ్స్ వ్యాధి’ లాంటి రక్త ప్రసరణ సమస్యలు ఉన్నవారు ఐస్ బాత్‌లు పూర్తిగా దూరంగా ఉండాలి. ఇది వారి పరిస్థితిని మరింత దిగజార్చి, కణజాల నష్టానికి దారి తీయగలదు. సరైన పర్యవేక్షణ లేకుండా చేస్తే, ఫ్రాస్ట్‌బైట్ లేదా నరాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. ఈ విధానం సురక్షితంగా ఉండాలంటే, వైద్య నిపుణులను సంప్రదించాలి. వారి సలహా తీసుకున్న తర్వాతే దీనిని ప్రయత్నించాలి. ఏ మాత్రం అనుమానం ఉన్నా, లేదా ఏదైనా ఆరోగ్య సమస్యలున్నా, ఐస్ బాత్‌లకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.