AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూత్‌పై సైలెంట్‌గా దాడి? ఎలాంటి సింప్టమ్స్ లేకుండానే ప్రాణాలు తీసేస్తోంది

ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితం వల్ల చాలామంది శారీరక శ్రమకు పూర్తిగా దూరం అవుతున్నారు. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేసే డెస్క్ ఉద్యోగాల సంస్కృతి పెరిగిపోయింది. ఇలా రోజంతా ఒకే చోట కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల గుండె బలహీనపడి రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. అమెరికాకు చెందిన సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (CDC) పరిశోధనల ప్రకారం.. శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, పొగ తాగడం, ఎక్కువ మద్యం సేవించడం వంటి అలవాట్లు బీపీని విపరీతంగా పెంచేస్తాయి.

యూత్‌పై సైలెంట్‌గా దాడి? ఎలాంటి సింప్టమ్స్ లేకుండానే ప్రాణాలు తీసేస్తోంది
Hypertension In Youth
Nikhil
|

Updated on: May 20, 2026 | 6:05 AM

Share

ప్రస్తుత కాలంలో పట్టుమని పాతికేండ్లు నిండకుండానే చాలామంది రక్తపోటు (బీపీ) బారిన పడుతున్నారు. మారుతున్న మన జీవనశైలి, చెడు అలవాట్లే దీనికి ప్రధాన కారణమవుతున్నాయి. వైద్య పరిభాషలో హై బ్లడ్‌ప్రెషర్‌ను ‘హైపర్‌ టెన్షన్‌’ అని పిలుస్తారు. దీనిని చాలా మంది ‘సైలెంట్‌ కిల్లర్‌’ అని అంటుంటారు. ఎందుకంటే, ఇది ఎలాంటి స్పష్టమైన లక్షణాలు చూపించకుండానే శరీరంలోకి నెమ్మదిగా ప్రవేశిస్తుంది.

కానీ లోలోపలే గుండె, మెదడు, కిడ్నీలు, రక్తనాళాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 140 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అందులో సగానికి పైగా ప్రజలకు తమకు బీపీ ఉందనే విషయమే తెలియకపోవడం గమనార్హం. మరి ఈ మహమ్మారి ఏ విధంగా మనల్ని చుట్టుముడుతుందో, దీని నుండి ఎలా రక్షించుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

ఉప్పు ముప్పు..

మనం తినే ఆహారం కూడా రక్తపోటుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రాసెస్‌ చేసిన ఫుడ్స్‌, ఫాస్ట్‌ ఫుడ్స్‌, ప్యాకెట్‌ స్నాక్స్‌ వంటి పదార్థాలలో ఉప్పు (సోడియం) అధికంగా ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో నీరు నిల్వ ఉండిపోతుంది, దాంతో రక్తాన్ని పంప్ చేయడానికి గుండె సాధారణం కంటే ఎక్కువ పని చేయాల్సి వస్తుంది.

అదే సమయంలో పండ్లు, ఆకుకూరలు తక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పొటాషియం అందక బీపీ నియంత్రణ కష్టతరమవుతుంది. వీటికి తోడు ఆఫీసు పనుల వల్ల నిరంతరం స్ట్రెస్‌ ఫీలవడం, నిద్రలేమి, అర్ధరాత్రి వరకు మొబైల్ స్క్రీన్‌కు అతుక్కుపోవడం వంటివి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి తాత్కాలికంగా బీపీని పెంచుతాయి. కాలక్రమేణా ఇది శాశ్వత సమస్యగా మారే ప్రమాదం ఉంది.

నివారణ మార్గాలివే

రక్తపోటు ముదిరినప్పుడు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఉదయాన్నే విపరీతమైన తలనొప్పి రావడం, తల తిరగడం, చూపు మసకబారడం, ఛాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు నుంచి హఠాత్తుగా రక్తస్రావం కావడం మరియు గుండె కొట్టుకునే వేగంలో మార్పులు రావడం వంటివి కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి.

ఈ సైలెంట్ కిల్లర్ నుండి ప్రాణాలను రక్షించుకోవడానికి జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ఎంతో అవసరం. ప్రతిరోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయడం, ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించడం, బరువును అదుపులో ఉంచుకోవడం వంటివి చేయాలి. ధూమపానం, మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉంటూ, రోజుకు కనీసం ఏడు గంటల పాటు కంటి నిండా నిద్రపోవడం వల్ల బీపీ నియంత్రణలోకి వస్తుంది. ముఖ్యంగా ఎక్కువ ఒత్తిడికి గురయ్యేవారు రెగ్యులర్‌గా డాక్టర్‌ని సంప్రదించి బీపీ చెక్ చేయించుకోవాలి. నిర్లక్ష్యం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది కాబట్టి, సకాలంలో స్పందించి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఉత్తమం.

Follow Us