రోజంతా కూర్చునే ఉంటున్నారా..? మీ మెదడుకి ఎంత ప్రమాదమో తెలుసా..?
తాజాగా చేసిన స్టడీస్ ప్రకారం.. రోజంతా కదలకుండా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మన మెదడు పనితీరులో మార్పులు రావొచ్చని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద వయసు వాళ్లలో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించిందని 7 ఏళ్ల పాటు జరిగిన పరిశోధనల్లో తేలింది. రోజూ వ్యాయామం చేసినా ఎక్కువసేపు కూర్చునే అలవాటు ఉన్నవాళ్లలో నాడీ సంబంధిత మార్పులు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారట.

ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం వల్ల మన గుండె మాత్రమే కాదు.. మెదడు కూడా నెమ్మదిగా ఎఫెక్ట్ అవుతుంది. రోజూ కొంతసేపు వ్యాయామం చేస్తూ ఉన్నా.. తరచుగా కదలకుండా కూర్చునే వాళ్లలో తెలివితేటలు తగ్గుముఖం పడుతున్నాయని పరిశోధనల ద్వారా తెలిసింది.
మెదడు సైజు తగ్గుతుందట
వాండర్‌బిల్ట్ వైద్య సంస్థ, పిట్స్‌బర్గ్ యూనివర్సిటీ కలిసి 50 ఏళ్లు పైబడిన 400 మందికి పైగా వ్యక్తులపై ఏడేళ్లపాటు పరిశోధన చేశాయి. ఈ అధ్యయనంలో వారు రోజూ ఎంతసేపు కూర్చుంటున్నారు.. వారి మెదడు పనితీరు ఎలా ఉంది అనే విషయాలను పరిశీలించారు. మెదడు స్కాన్ లను విశ్లేషించగా.. ఎక్కువ కూర్చునే అలవాటున్న వాళ్లలో మెదడు సైజు తగ్గిందని గుర్తించారు.
అల్జీమర్ కు ఎక్కువసేపు కూర్చోవడం కూడా కారణమా..?
అల్జీమర్ (Alzheimer), డిమెన్షియా (Dementia) వంటి మెదడుకు సంబంధించిన జబ్బులకు దారితీసే మెదడు కుంచించుకుపోవడం, ఎక్కువసేపు కూర్చునే వారిలో ఎక్కువగా కనిపిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా APOE-e4 అనే జన్యు మార్పు ఉన్నవాళ్లలో ఇది మరింత సీరియస్ గా చూడాల్సిన విషయమని వారు హెచ్చరిస్తున్నారు.
ఈ అధ్యయనం చేసిన బృందం హెడ్ ఏం చెప్పారంటే.. రోజంతా కూర్చొని, ఒక్కసారి మాత్రమే వ్యాయామం చేయడం సరిపోదు. ప్రతి ఒక్కరూ మధ్యమధ్యలో లేచి నడవాలి, కదలాలి, శరీరానికి కొద్దిగా కదలిక ఇవ్వాలి. ఇది మెదడు పనితీరును మెరుగుపరిచే మార్గాల్లో ఒకటి అని వారు అన్నారు.
మెదడు ఆరోగ్యానికి చిన్న మార్పులు
- ప్రతి 30 నిమిషాలకోసారి కూర్చున్న చోటు నుండి లేచి చక్కగా నడవండి.
- చేతులు, కాళ్లు తేలికగా చాపి చిన్న వ్యాయామాలు చేయండి.
- పనిలో అలసట వచ్చినప్పుడల్లా చిన్న బ్రేక్ తీసుకుని కదలిక కలిగించండి.
- ఎక్కువసేపు బెడ్ లేదా సోఫాలో గడపకూడదు.. ఇది శరీరాన్ని బద్ధకం చేస్తుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- ఎక్కువసేపు కూర్చోవడం అల్జీమర్ లాంటి సమస్యలకు దారి తీస్తుంది.
- వ్యాయామం ఒక్కటే సరిపోదు.. రోజంతా కొద్దిగా కదలిక ఉండేలా చూసుకోవాలి.
- మెదడు పనితీరును మెరుగుపరచడానికి కూర్చునే సమయాన్ని తగ్గించాలి.
ఈ స్టడీ మనకు చెప్పే విషయం ఏమిటంటే.. మెదడు ఆరోగ్యం మన శరీర కదలికలతో నేరుగా సంబంధం కలిగి ఉంది. అందుకే రోజంతా కదలికలతో ఉండడం ద్వారా మన మెదడును కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




