ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేస్తే కరెక్ట్ గా తెలుస్తుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
పీరియడ్స్ ఆలస్యం కావడం వల్ల గర్భధారణపై అనుమానాలు రావడం చాలా సహజం. అయితే వెంటనే టెస్ట్ చేయడం వల్ల తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశముంది. మరి ఈ పరీక్షకు సరైన సమయం ఎప్పుడో.. అలాగే ఇంటి టెస్ట్ కిట్ ఫలితాలపై ఎంత వరకు నమ్మకంగా ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పీరియడ్స్ ఆలస్యం కావడం చాలా మంది ఆడవాళ్లకు ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా గర్భం కావాలని ఆశ పడేవాళ్ళకి ఒక్కరోజు ఆలస్యం అయినా ఆశ పెరుగుతుంది. అయితే ఆలస్యం అయిన వెంటనే గర్భధారణ పరీక్ష చేస్తే తప్పుడు ఫలితాలు రావచ్చు. అందుకే ఇంట్లోనే పరీక్ష చేయాలనుకుంటే కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి.
ఫలితాలు కచ్చితంగా ఉంటాయా..?
ఇంట్లో గర్భధారణ కిట్ వాడి పరీక్ష చేస్తే శరీరంలోని hCG (Human Chorionic Gonadotropin) అనే హార్మోన్‌ను గుర్తించే ప్రయత్నం జరుగుతుంది. గర్భం మొదలైనప్పుడు ఈ హార్మోన్ బాగా పెరుగుతుంది. అయితే ఇది గుర్తించే స్థాయికి చేరడానికి కొన్ని రోజులు పడుతుంది. అందుకే ఆలస్యం అయిన మరుసటి రోజు పరీక్షిస్తే నెగటివ్ రావచ్చు. అది తప్పుడు ఫలితం కావచ్చు.
ఎప్పుడు టెస్ట్ చేయాలి..?
మీ పీరియడ్స్ ఎప్పుడూ ఒకే సమయానికి వస్తుంటే.. ఆలస్యం అయిన రోజు నుండి కనీసం 14 రోజులు ఆగడం మంచిది. ఎందుకంటే అప్పుడు మాత్రమే శరీరంలోని hCG స్థాయి మూత్రంలో పక్కాగా కనిపిస్తుంది. ఈ సమయంలో గర్భధారణ పరీక్ష చేస్తే సరైన ఫలితం వచ్చే అవకాశం ఎక్కువ.
ఉదయం వేళ ఎందుకు మంచిది..?
ఉదయం మీరు వెళ్లే మూత్రం ద్వారా టెస్ట్ చేస్తే hCG స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇది ఫలితాలు మరింత కచ్చితంగా చూపిస్తుంది. ఉదయం టెస్ట్ చేయలేకపోతే.. కనీసం 6 గంటల విరామం తర్వాత మూత్రాన్ని వాడి పరీక్ష చేయవచ్చు.
ఇంకా ఏం చేస్తే మంచిది..?
ఒకసారి ఇంటి పరీక్షలో పాజిటివ్ అని వస్తే.. వెంటనే ఒక మహిళా డాక్టర్‌ను కలవడం మంచిది. రక్త పరీక్ష ద్వారా hCG స్థాయిని కచ్చితంగా తెలుసుకోవచ్చు. ఇది గర్భం సరిగా కొనసాగుతుందో లేదో తెలుసుకోవడానికి.. భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది.
పీరియడ్స్ ఆలస్యమైతే వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసేయకండి. కనీసం రెండు వారాలు ఆగడం బెస్ట్. అప్పటి వరకు అలసట, రొమ్ముల నొప్పి, వికారం, మలబద్ధకం, తరచుగా మూత్రం పోవడం లాంటి చిన్నపాటి మార్పులు కనిపించొచ్చు. అయితే ఈ లక్షణాలు అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు. ఈ సింప్టమ్స్ ఉన్నా, లేకపోయినా, కచ్చితమైన నిర్ధారణకు.. సరైన సమయం చూసుకోవడం మీదే ఆధారపడి ఉంటుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




